Indian Railways Ticket Refund: భారతీయ రైల్వే ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు తీసుకెళ్తుంది. కానీ, కొన్నిసార్లు ప్రయాణీకులకు పలు రకాల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అకస్మాత్తుగా ప్లాట్ ఫారమ్ మారడం వల్ల రైళ్లు మిస్ అయిన సందర్భాలు ఉంటాయి. అలాంటి పరిస్థితిలో ప్రయాణీకులు టికెట్ డబ్బును రీఫండ్ పొందే అవకాశం ఉంటుందా? రైల్వే రీఫండ్ రూల్స్ ఏం చెప్తున్నాయంటే?
ప్లాట్ ఫామ్ మారడం వల్ల రైలు మిస్ అయితే?
తరచుగా ప్రయాణీకులు రెండు నెలల ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుంటారు. స్టేషన్ కు చేరుకున్న తర్వాత రైలు ప్లాట్ ఫారమ్ మార్చబడిందని తెలుస్తుంది. అప్పటికే తాము వెళ్లాల్సిన రైలు బయల్దేరిపోతుంది. అలాంటి సమయంలో టికెట్ డబ్బులు తిరిగి ఇస్తారా? లేదా? అనే ప్రశ్న తలెత్తుతుంది. చాలా మంది ప్రయాణీకులు కోపంతో, టెన్షన్ తో టికెట్ ను పారవేస్తారు. అది పనికిరానిదిగా భావిస్తారు, కానీ, వాస్తవానికి భారతీయ రైల్వే అలాంటి కేసులకు సంబంధించి కొన్ని నిబంధనలను రూపొందించింది. ఒకవేళ ప్రయాణీకులు రైలు మిస్ కావడానికి రైల్వే సంస్థ కారణం అయితే టికెట్ పూర్తి మొత్తాన్ని రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది.
రైల్వే రీఫండ్ రూల్స్ ఏం చెప్తున్నాయంటే?
రైల్వే నిబంధనల ప్రకారం, ప్రయాణీకుల తప్పు వల్ల రైలు తప్పిపోతే, అంటే, స్టేషన్ కు ఆలస్యంగా చేరుకోవడం, సమయానికి సరైన ప్లాట్ ఫారమ్ ను కనుగొనలేకపోవడం వంటివి జరిగితే, రీఫండ్ లో కొంత మినహాయింపు ఉంటుంది. కానీ, రైల్వే తప్పు అయితే, అకస్మాత్తుగా ప్లాట్ ఫారమ్ ను మార్చడం, సమాచారం సరిగా ఇవ్వకపొవడం జరిగితే పూర్తి రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది.
ప్రయాణీకులకు TDR సదుపాయం
రైలు మిస్ అయిన అధికారులకు భారతీయ రైల్వే TDR (టికెట్ డిపాజిట్ రసీదు) సౌకర్యాన్ని అందిస్తుంది. దీని ద్వారా, ప్రయాణీకులు తాము ప్రయాణించలేదని, రీఫండ్ కోరుకుంటున్నారని చెప్పవచ్చు. ఆన్ లైన్ లో లేదంటే ఆఫ్ లైన్ లోనూ TDR ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకున్నట్లయితే, IRCTC వెబ్ సైట్, యాప్ ఓపెన్ చేసి My Bookingsకి వెళ్లి సంబంధిత టికెట్‌ను ఎంచుకోవాలి. File TDR ఎంపికపై క్లిక్ చేయండి. అటు కౌంటర్ నుండి టికెట్ కొనుగోలు చేస్తే, మీరు స్టేషన్‌లోని రిజర్వేషన్ కార్యాలయానికి వెళ్లి TDR ఫారమ్‌ను పూరించాలి. రైల్వే నిబంధనల ప్రకారం, రైలు తప్పిపోతే, రైలు బయలుదేరిన 1 గంటలోపు మీరు TDR నింపాలి. తప్పు రైల్వేలది అయితే, TDR దాఖలు చేయడానికి 4 గంటల వరకు సమయం ఉంటుంది. తప్పు మీదే అయితే, సర్వీస్ ఛార్జీని తగ్గించిన మిగతా మొత్తం వాపసు అందిస్తారు. రైల్వేల తప్పు ఉందని రుజువైతే, మొత్తం మీ ఖాతాకు తిరిగి వస్తుంది. ఈ రీఫండ్ సుమారు 7 నుంచి 21 రోజుల్లో అందుతుంది.
Read Also: రూట్ అంతా ఒకే స్పీడ్.. ఈ ఐదు వందేభారత్ రైళ్లు వెరీ వెరీ స్పెషల్!