Mahesh Kumar Goud: కరీంనగర్ జిల్లా మరోసారి రాజకీయ వ్యాఖ్యలతో మార్మోగింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తన రెండో విడత జనహిత పాదయాత్ర మన కోసం, మన భవిష్యత్తు కోసం అనే యాత్రను కరీంనగర్ నుంచి ప్రారంభించారు. ఈ యాత్రలో పాల్గొన్న ఆయన బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలపై తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రజల మధ్య నేరుగా వెళ్లి వారి కష్టాలు, సమస్యలు తెలుసుకోవడమే తన యాత్ర లక్ష్యమని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు.
మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్‌రూం ఇల్లు కూడా సాధ్యంకాలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోపే ఆ కలను నిజం చేస్తోంది. ప్రజల సంతోషాలను, సమస్యలను నేరుగా తెలుసుకునే ఉద్దేశ్యంతోనే నేను ఈ యాత్ర చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
మహేష్ గౌడ్ తన వ్యాఖ్యల్లో బీజేపీపై ఘాటు విమర్శలు గుప్పించారు. ప్రజల మద్దతు లేకుండా దొంగ ఓట్లతో బీజేపీ అధికారం సాధించింది. తెలంగాణలో కనీసం 8 మంది బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతోనే గెలిచారు. బండి సంజయ్ కూడా దొంగ ఓట్ల వల్లే గెలిచాడు. ఆ ఓట్లు లేకపోతే బీజేపీకి ఒక్క సీటు కూడా రావడం అసాధ్యమని ధ్వజమెత్తారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి.
అలాగే బీఆర్‌ఎస్‌పై కూడా విమర్శలు ఎక్కుపెట్టారు మహేష్ గౌడ్. తెలంగాణలో బీఆర్‌ఎస్ పని అయిపోయిందని, ఆ పార్టీ మూడు ముక్కలు అయిందన్నారు. నాలుగో ముక్క కోసం ఇంకొకరు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ప్రజలు ఈ సారి బీఆర్‌ఎస్‌ను పూర్తిగా తిరస్కరించారు. కులం, మతం పేరుతో ఓట్లు అడుగుతున్న బీజేపీ నాయకులు బిచ్చగాళ్ల్లా తిరుగుతున్నారు. మేము కాంగ్రెస్ పార్టీగా ఎప్పుడూ దేవుడు పేరుతో ఓట్లు అడగం, అడగమని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. సంసార కష్టం తెలీని నాయకుడు నరేంద్ర మోడీ. ప్రజల మద్దతుతో కాకుండా, మాయమాటలతో, దొంగనోట్లతో అధికారం లోకి వచ్చాడు. కానీ ఈ సారి పరిస్థితి మారింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వంద సీట్లకు తగ్గకుండా గెలుస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తప్పా వేరే పార్టీకీ ఛాన్స్ లేదని చెప్పారు.
బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై మాట్లాడుతూ, బండి సంజయ్ బీసీ సమాజంపై మాట్లాడటానికి జంకుతున్నాడు. రెండు బిల్లులు, ఒక ఆర్డినెన్స్ పెండింగ్‌లో ఉండగా, మౌనం వహిస్తూ ఢిల్లీలో దాక్కున్నాడు. నిజమైన ప్రజానాయకుడు అయితే బీసీ సమస్యలపై గళమెత్తాలి. కానీ తన కుర్చీ కోసం ప్రజలను మోసం చేస్తున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read: Telangana Govt: వినాయక చవితి పండుగకు.. తెలంగాణ ప్రభుత్వ సూపర్ గిఫ్ట్.. మీకు తెలుసా!
జనహిత పాదయాత్రలో మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ యాత్రలో నేను ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజల సమస్యలను వింటాను. డబుల్ బెడ్‌రూం ఇళ్ళు, సంక్షేమ పథకాలు, రైతుల సమస్యలు, యువతకు ఉపాధి వంటి అన్ని అంశాలపై కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తుంది. తెలంగాణకు సమగ్ర అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయం అని తెలిపారు.
కరీంనగర్ ప్రజలు పెద్ద ఎత్తున ఆయన పాదయాత్రలో పాల్గొని తమ సమస్యలను పంచుకున్నారు. డబుల్ బెడ్‌రూం ఇండ్లలో ఆలస్యం, రోడ్ల సమస్యలు, విద్యుత్ సమస్యలు, ఉపాధి లేకపోవడం వంటి సమస్యలను స్థానికులు మహేష్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి ఒక్కరి సమస్యను జాగ్రత్తగా విన్న మహేష్ గౌడ్ వాటిని పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మహేష్ గౌడ్ తన ప్రసంగంలో భవిష్యత్తు ప్రణాళికలను కూడా వివరించారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా, తెలంగాణను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కరీంనగర్‌లో ప్రారంభమైన ఈ జనహిత పాదయాత్ర జిల్లాలో పలు నియోజకవర్గాల మీదుగా కొనసాగనుంది. ప్రజల మద్దతు స్పష్టంగా కాంగ్రెస్ వైపు మొగ్గుతుందనే విశ్వాసం మహేష్ గౌడ్‌లో కనిపించింది. తెలంగాణలో మార్పు తప్పనిసరి, ఆ మార్పును కాంగ్రెస్ మాత్రమే తీసుకొస్తుందని ఆయన చివరగా హామీ ఇచ్చారు.