Marketing Cyber Crimes: పెట్టుబడి తక్కువ.. లాభాలు ఎక్కువ! తక్కువ టైమ్‌లో.. ఎక్కువ ఆదాయం! ఇంట్లో నుంచే.. బీరువాల నిండా సంపాదించండి! ఇలాంటి ప్రకటనలతో.. ముందూ వెనకా ఆలోచించకుండా.. అత్యాశకు పోయి ఎంతో మంది భారీగా నష్టపోతున్నారు. నెట్‌వర్కింగ్ పేరుతో కొందరు కేటుగాళ్లు నట్టేట ముంచేస్తున్నారు. బిజినెస్, ప్రొడక్ట్, మార్కెటింగ్ అంటూ తెలివిగా మోసం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో.. ఈ తరహా మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలు పెరిగిపోయాయ్. ఇప్పటికైనా మేలుకోని.. తేరుకోకపోతే.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.
డబ్బుల ఆశకుపోతే.. అడ్డంగా బుక్కైపోతారు!
ప్రతిసారీ పేరు మారుతుంది.. మోసం మారదు!
మల్టీ లెవెల్‌లో జనాల్ని పల్టీ కొట్టిస్తున్న కేటుగాళ్లు!
రివార్డులు, పాయింట్లు, రిఫర్ చేస్తే బోనస్‌లు
తక్కువ టైంలో ఎక్కువ లాభాలు ఆర్జించొచ్చు. ఎంతమంది ఏజెంట్లని చేర్పిస్తే అన్ని రివార్డులు, పాయింట్లు, రిఫర్ చేస్తే బోనస్‌లు వస్తాయని ఆశ చూపే దందాలు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయాయ్. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఈ దేశంలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలు మళ్లీ పెరుగుతున్నాయ్. వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు, హెర్బల్ ప్రొడక్ట్స్, హెల్త్ కేర్ ఉత్పత్తులు, క్రిప్టో కరెన్సీ, నిత్యవసర వస్తువులు, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్, ఎలక్ట్రిక్ బైకుల అమ్మకాల పేరిట అడ్డంగా మోసం చేస్తున్నారు. పిరమిడ్ మోడల్ తరహా మోసాలు చేసే కేటుగాళ్లంతా.. ఇప్పుడిదే పనిలో ఉన్నారు. తమ దగ్గర ప్రొడక్టులు కొని మార్కెట్‌లో విక్రయిస్తే.. భారీ లాభాలు వస్తాయని చెప్పి.. జనం ఆశల్ని, అమాయకత్వాన్ని క్యాష్ చేసుకునే ఏజెంట్లు ఎందరో ఉన్నారు.
వి-కెన్, ఆమ్ వే, క్యూ నెట్, వెస్టీజ్, హెర్బల్ లైఫ్
వి-కెన్, ఆమ్‌వే, క్యూ నెట్, వెస్టీజ్, హెర్బల్ లైఫ్, సంకల్ప్ మార్ట్, DKZ టెక్నాలజీస్, ఫ్రైడే అప్ కన్సల్టెన్సీస్.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాడంత ఉంటుంది. ఈ జాబితాలోనే ఇప్పుడు చేసింది ADMS e-బైక్స్.. ప్రతిసారీ కంపెనీ పేరు మారుతుంది. దాని బిజినెస్ మారుతుంది. అందులోని స్కీమ్ మారుతుంది కానీ.. స్కామ్ మాత్రం మారదు. అదే స్క్రిప్ట్, అదే సినిమా. అందులో క్యారెక్టర్స్ మారతాయి కానీ.. మోడల్ మారదు. లైఫ్‌లో సక్సెస్ అయ్యేందుకు.. దీనిని మించిన అవకాశం మరొకటి లేదు.. రాదు అని కథలు చెబుతారు. మిమ్మల్ని మోటివేట్ చేస్తారు. బ్రెయిన్ వాష్ చేస్తారు.
వందల కోట్లు వసూళ్లు చేసి.. బోర్డు తిప్పేసిన కంపెనీలెన్నో!
వాళ్ల దారిలోకి తెచ్చుకుంటారు. మనల్ని మోసం చేయడమే కాదు.. మన చేత మరో నలుగురైదుగురిని మోసం చేయమని చెబుతారు. డబ్బుల మీదున్న ఆశతో.. ఎంతో మంది అమాయకులు ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల ఏజెంట్లు చెప్పింది విని మోసపోతున్నారు. వాళ్లు చెప్పినట్లుగా చేస్తూ.. మిగతా వాళ్లు కూడా నష్టపోయేందుకు కారకులవుతున్నారు. ఇలా.. వందల కోట్లలో వసూలు చేసి.. బోర్డు తిప్పేసిన కంపెనీల లిస్టు చాలానే ఉంది. ఈజీగా మనీ వస్తుందని ఆశపడితే.. తర్వాత నష్టపోవాల్సిందే మీరేనని మార్కెట్ నిపుణులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు.
కొత్తగా మార్కెట్లోకి వచ్చి స్కామ్ ADMS ఈ బైక్స్
ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోడల్‌లో.. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన స్కామే.. ADMS ఈ-బైక్స్. బైక్‌ల పేరుతో వ్యాపారం మొదలుపెట్టిన కంపెనీ.. ఆ బైక్‌లు అమ్మకుండా.. చైన్ మార్కెటింగ్ వ్యాపారం చేస్తోంది. రిజిస్ట్రేషన్, మెంబర్‌షిప్, ఐడీ జనరేషన్ అని చెబుతూ.. జనాల నుంచి డబ్బులు వసూలు చేసి.. వారినే మార్కెటింగ్ ఏజెంట్లుగా మార్చేస్తోంది. జనం డబ్బుతో.. వాళ్లు వ్యాపారం చేస్తూ.. వేల కోట్లు వెనకేస్తున్నారు. కొద్దో గొప్ప డబ్బులకు ఆశపడి.. ఈ స్కీమ్‌లో ఏజెంట్లుగా చేరుతున్న వాళ్లెందరో ఉన్నారు.
విదేశాల్లో ఉండి పిరమిడ్ రాకెట్ నడుపుతున్న కేటుగాళ్లు
ఎప్పుడైతే.. సైబర్ మోసాలపై జనంలో అవగాహన పెరగడం మొదలైందో.. కేటుగాళ్లంతా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్‌పై కన్నేశారు. చైన్ బిజినెస్ పేరుతో.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా ప్రకటనలు గుప్పించి.. అమాయకులను మోసగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మల్టీలెవెల్ మార్కెటింగ్ స్కీములు నడిపే కేటుగాళ్లలో.. చాలా మంది మంది విదేశాల్లోనే ఉండి ఈ పిరమిడ్ రాకెట్ నడుపుతుంటారు. భారీ లభాలతో పాటు లగ్జరీ కార్లు, ఫారిన్ టూర్ల పేరిట.. ఏజెంట్ల ద్వారా అమాయకులకు వల వేస్తున్నారు.
పెద్ద మొత్తంలో జమ అయ్యాక జెండా పీకేసే కంపెనీలు
ఈ మల్టీలెవెల్ మార్కెటింగ్ మోసాలన్నీ.. స్టాలిన్ సినిమా తరహాలోనే ఉంటాయ్. నువ్వో ముగ్గురికి సాయం చెయ్.. ఆ ముగ్గురిని మరో ముగ్గురి చొప్పున సాయం చేయమని చెప్పండి లాగే ఉంటుంది వ్యవహారం. ఇలా చైన్ సిస్టమ్ ద్వారా డబ్బులు కట్టించుకోవడం, పెద్ద మొత్తంలో జమ అయ్యాక జెండా పీకేయడం ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నదే! ఇప్పుడు.. ఈ-బైక్స్ పేరుతో ఏడీఎంఎస్ చేస్తున్నది కూడా ఇదే దందా. కొన్ని కంపెనీలు తమ దగ్గర ప్రొడక్ట్స్ కొని.. మార్కెట్‌లో సేల్ చేసుకోమని చెబుతాయ్. ఇంకొన్ని.. కచ్చితంగా ప్రతి నెలా తమ ఉత్పత్తుల్ని కొనాల్సిందే అంటాయ్. తర్వాత.. మిగతా వాళ్లని కూడా చేర్పించమని చెబుతాయ్. కానీ.. ఏడీఎంస్ అలా కాదు.
బైక్ కొనాల్సిన అవసరం లేదంటున్న ఏడీఎంస్ కంపెనీ
పైకి.. ఎలక్ట్రిక్ బైక్స్ వ్యాపారంగానే కనిపిస్తున్నా.. బైక్ కొనాల్సిన అవసరం లేదంటున్నారు. బైక్ కొనడానికి వెళితే.. 16 వేలు కట్టించుకొని.. ఐడీ ఇచ్చేస్తున్నారు. మరో ఇద్దరిని చేర్పిస్తే.. బోనస్ డబ్బులొస్తాయని ఆశ పెడుతున్నారు. 16వేలు కట్టలేని వారి కోసం 8వేలు కడితే చాలంటూ ఇంకో స్కీమ్ తీసుకొచ్చారు. ఇప్పటికే.. ఇలా 2 లక్షల మందికి పైగా డబ్బులు కట్టేశారు. ఒక వేళ నిజంగానే.. ఏడీఎంస్ కేవలం ఈ-బైక్స్ వ్యాపారమే చేస్తున్నట్లయితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్ల మీద ఎన్నో ఏడీఎంఎస్ బైక్స్ కనిపించేవి. కానీ.. ఆ పరిస్థితి లేదు. అక్కడ జరుగుతున్నదంతా.. చైన్ సిస్టమ్, మనీ సర్క్యులేషన్. జనం డబ్బుల్ని.. జనానికే ఇస్తూ.. పై స్థాయిలో వాళ్లు భారీగా లాభపడుతున్నారు.
రూ.16వేలు కట్టాక 2 ఆఫర్లు ఇస్తున్న కంపెనీ ప్రతినిధులు
ఏడీఎంస్ బైక్ కొనేందుకు వెళ్లినవారు.. 16 వేలు కట్టాక కంపెనీ ప్రతినిధులు రెండు రకాల ఆఫర్లు ఇస్తారు. ఒకటి.. బైక్ కొనుగోలు చేయడం, మరొకటి.. మల్టీ లెవెల్ మార్కెటింగ్ ప్లాన్. 16 వేలు కట్టండి, మరో ఇద్దరితో 16 వేల చొప్పున కట్టించండి. 10 వేల కమీషన్ పట్టండి అంటూ కమిట్ చేయిస్తున్నారు. తాము ఇప్పటికే కోట్లలో సంపాదించామని.. బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. వేలు కట్టండి.. కోట్లు సంపాదించండి అంటూ.. ఇప్పుడు జనాన్ని ముంచే పనిలో ఫుల్ బిజీగా ఉంది ఏడీఎంస్ కంపెనీ. ముందు నువ్వు డబ్బు కట్టు, తర్వాత మరో ఇద్దరితో కట్టించు, కమీషన్ కొట్టు అంటూ.. ఇప్పటికే వందల కోట్లు దండుకుంది. ఇలా ఏకంగా 40 వేల కోట్లు కొల్లగొట్టేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది.
జనంతో ప్రొడక్ట్స్ భారీగా కొనుగోలు చేయించే స్కీమ్
మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయ్. ఈ కంపెనీలు.. తమ డైట్ సప్లిమెంట్ల నుంచి క్లీనింగ్ ప్రొడక్ట్స్ వరకు ఏవైనా జనం భారీగా కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తాయ్. ఆ తర్వాత వీటిని సేల్ చేయడం ద్వారా ప్రజలు ఆదాయాన్ని సంపాదించే వీలుందని చెబుతాయి. నిజానికి ఇలాంటి కొన్ని స్కీమ్‌లలో భారీగా ఏజెంట్లను నియమించుకోవడం ద్వారా కంపెనీలు డబ్బులు సంపాదిస్తూ ఉంటాయ్. కింది స్థాయిలో జనం పెట్టే డబ్బు ద్వారానే.. పైస్థాయిలో ఉండేవారికి లాభాలు వస్తుంటాయ్.
ఏజెంట్లకు వస్తాయని చెప్పే లాభాలు.. వాళ్ల పైనున్న వాళ్లకొస్తాయి
కాబట్టి.. నిజమైన వినియోగదారుల నుంచి వచ్చే డబ్బు కంటే.. డబ్బులు కట్టి ఏజెంట్లుగా జాయిన్ అయ్యే వాళ్ల నుంచే కంపెనీకి ఎక్కువ లాభాలు వస్తుంటాయ్. అంటే.. ఈ ఏజెంట్లకు వస్తాయని చెప్పే లాభాలు.. వాళ్ల పైనున్న వాళ్లకొస్తాయ్. మరింత మంది ఏజెంట్లని నియమించుకునేందుకు.. కిందున్న వాళ్లపై కంపెనీలు విపరీతంగా ఒత్తిడి చేస్తాయ్. దానికోసం.. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఏజెంట్లు ఎంతదూరమైనా వెళ్తారు. మరోవైపు.. తమ డబ్బులు షెల్ కంపెనీల ద్వారా చేతులు మారుతున్న విషయం.. ఈ స్కీమ్‌లో చేరే వారికి కూడా తెలియదు.
అద్భుతమైన వ్యాపార అవకాశం అంటూ ప్రకటన
ముందుగా.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో తక్కువ పెట్టుబడితో.. అద్భుతమైన వ్యాపార అవకాశం అంటూ ప్రకటనలిస్తారు. వాటికి ఆకర్షితులై స్కీమ్‌లో చేరాక.. ప్రొడక్ట్స్ అమ్మడం కంటే కొత్త వారిని చేర్పించడం మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారు. వాళ్ల టార్గెట్ కూడా అదే. అలా.. కొత్తగా చేరిన వారితో.. మొదట వారి కుటుంబ సభ్యులు, తర్వాత స్నేహితులు, సోషల్ మీడియా ఫ్రెండ్స్, డేటింగ్ యాప్స్.. ఇలా చాలా మార్గాల ద్వారా కొత్త ఏజెంట్లని నియమించాలని ఒత్తిడి చేస్తారు. తమ ఫోన్లలో తమకు బాగా తెలిసిన వారు, పరిచయం ఉన్నవారి నెంబర్లతో.. కాంటాక్ట్‌లోకి వెళ్లాలని సూచిస్తారు. మీరు ప్రొడక్ట్స్ అమ్మాలనుకుంటే.. మొదటగా మీకు నెట్‌వర్క్ ఉండాలని చెబుతారు. అంతేకాదు.. సోషల్ మీడియా ప్రొఫైల్ కూడా ఆకర్షణీయంగా కనిపించాలని ప్రెజర్ చేస్తారు.
ఏజెంట్లని ఫ్యామిలీ కంటే ఎక్కువ నమ్మాలని కొత్తవారికి సూచన
ఇతరుల దగ్గర్నుంచి తీసుకున్న ఖరీదైన ఆభరణాలు, బట్టలు వేసుకొని ఫోటోషూట్లు కూడా చేయమంటారు. ఏదైనా బ్రాండెడ్ వస్తువుతో ఫోటోలు దిగితే.. చాలా మంది వాళ్లంతట వాళ్లే మీ టచ్‌లోకి వస్తారని చెబుతారు. ఆ సమయంలో.. ఈ స్కీమ్ విషయం గురించి చెప్పి.. తమకెంతో ఆదాయం వస్తోందనే విషయం చెప్పాలని సూచిస్తారు. ఈ విధమైన మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్‌లతో చేరే వారి కోసం.. భారీ జూమ్ మీటింగ్‌లు, డ్యాన్స్ ప్రోగ్రామ్‌లు, పార్టీలు కూడా ఏర్పాటు చేస్తారు. ఏజెంట్లని.. ఫ్యామిలీ కంటే ఎక్కువ నమ్మాలని.. కొత్తవారికి సూచిస్తారు. వారికి వ్యతిరేకంగా మాట్లాడినా.. ఎదురు ప్రశ్నించినా దారుణంగా ప్రవర్తిస్తారు. వందలాది మంది సీనియర్ ఏజెంట్లు ఉండే వాట్సాప్ గ్రూపులో.. తమ పేరుని పదే పదే చెబుతూ అవమానిస్తారు.
అతి తక్కువ సమయంలో అధిక లాభాలంటే.. అది మోసమే!
అయితే.. అతి తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని ఎవరైనా చెబితే.. కచ్చితంగా అది మోసమేనని గ్రహించాలి. లేకపోతే.. మిమ్మల్ని ఆ స్కామ్‌లోకి దించి.. మీ డబ్బులు కొల్లగొడతారు. అత్యాశకు పోతే మోసపోవడం ఖాయం. ఈ చైన్ మార్కెటింగ్‌లో.. ముందు చేరిన వారికే లాభాలు వస్తాయి. ఆ తర్వాత చేరిన వారంతా తీవ్రంగా నష్టపోవాల్సిందే. అందువల్ల.. ఇలాంటి నెట్‌వర్క్‌ల్లో ఎవరూ చేరొద్దు. ఆ కంపెనీలు పెట్టే మీటింగ్‌లకు కూడా వెళ్లొద్దు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మోసపూరిత ప్రకటనలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. పిరమిడ్ విధానంలో చేసే మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్‌ల్లో.. మొదట జాయిన్ అయిన వారికే డబ్బులొస్తాయని చెబుతున్నారు. కొన్నాళ్ల తర్వాత.. చివరికి జాయిన్ అయినవారు పెద్ద ఎత్తున నష్టపోతారని హెచ్చరిస్తున్నారు.
కూర్చున్న చోటే.. కాసుల వర్షం!
ఒకప్పుడు వారం స్కీములు, నెలవారీ లాటరీలు అంటూ మోసం చేసేవారు. మాయమాటలు చెప్పి డబ్బులు కట్టించుకునేవారు. తర్వాత.. పెద్ద మొత్తంలో జమవగానే ఆ సొమ్ముతో ఉడాయించేవారు. ఇప్పుడు.. రోజులు మారాయ్. టెక్నాలజీ పెరిగింది. అంతా హైలెవెల్ మార్కెటింగ్ మోసాల ట్రెండ్ నడుస్తోంది. తక్కువ పెట్టుబడి.. ఎక్కువ సంపాదన! కూర్చున్న చోటే.. కాసుల వర్షం! లాంటి ఏదో ఒక స్కీమ్ పేరుతో.. భారీ స్కామ్‌లకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. అందువల్ల.. మల్టీ లెవెల్ మార్కెటింగ్ బిజినెస్‌ల జోలికి వెళ్లొద్దని నిపుణులు సూచిస్తున్నారు.
మల్టీ లెవల్ మార్కెటింగ్ బిజినెస్ లు జోలికి వెళ్లొద్దని సూచన
ఇలా నిబంధనలకు విరుద్ధంగా నడిచే ఈ విధమైన స్కీమ్‌లకు వ్యతిరేకంగా ఎన్నో చట్టాలున్నాయ్. ప్రధానంగా.. సెమీ అర్బన్, రూరల్ ఏరియాల్లోని ప్రజల్ని ఆకర్షించి ఈ స్కీముల్లో జాయిన్ చేస్తున్నారు. హోటల్స్, ఫంక్షన్ హాల్స్‌లో మీటింగ్స్ ఏర్పాటు చేసి.. వీటి గురించి చెబుతుంటారు. ఇలాంటి స్కీముల్లో ఎవరూ చేరొద్దు. ఒకవేళ మీ దగ్గరలో ఇలాంటి మీటింగులు జరిగితే.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి.