Meenakshi Natarajan: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టార్గెట్ ఏంటి? ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేశారా? మంగళవారం నుంచి రెండురోజుల పాటు వివిధ పార్లమెంట్ నియోజకవర్గాలపై దృష్టి పెట్టారా? రెండు రోజులపాటు సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
హైకమాండ్ కీలక సూచనలు
ఫిబ్రవరి 19న కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే కొత్త ఇన్‌ఛార్జులతో ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలకు ఆయా ఇన్‌ఛార్జులే బాధ్యత వహించాల్సి ఉంటుందని నొక్కి వక్కానించారు. బూత్ లెవల్ నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత రాష్ట్రాల ఇన్ ఛార్జులదేనని తేల్చిచెప్పారు. ఒక విధంగా చెప్పాలంటే ఇన్‌ఛార్జులకు ఫుల్ పవర్ ఇచ్చేసింది పార్టీ హైకమాండ్.
పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా సమీక్షలు
తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన నుంచి మీనాక్షి నటరాజన్ తనదైన శైలిలో అడుగులు వేస్తున్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా మంగళవారం నుంచి సమీక్షలు చేయనున్నారు. గాంధీ భవన్‌లో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి సమీక్షా సమావేశాలు మొదలుకానున్నాయి.
మెదక్, మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించనున్నారు. బుధవారం కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంపై దృష్టి పెడతారు. ఈ సమావేశాలకు నియోజకవర్గాల మంత్రులు, ఇన్ ఛార్జి మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, పోటీ చేసిన అభ్యర్థులు, డీసీసీ అధ్యక్షులు హాజరు కావాలని పిలుపు ఇచ్చారు.
ALSO READ: బీజేపీ గెలుపుకు మూడు కారణాలు.. బీఆర్ఎస్‌కు కష్టాలు తప్పవా?
జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు
పార్టీ పరిస్థితులు, సమస్యలు, పరిష్కార మార్గాలపై ఆయా నేతలపై మీనాక్షి నటరాజన్ చర్చించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటి నుంచే ఆమె ఫోకస్ చేశారు. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమావేశాలు నిర్వహించనున్నారు. దీని తర్వాత జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కార్యకర్తలతో భేటీ కావాలని భావిస్తున్నట్లు గాంధీ వర్గాలు చెబుతున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామ స్థాయిలో జరగడంతో వాటిపై తొలుత దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం అయితే ఓటు బ్యాంక్ చెదిరిపోకుండా ఉంటుందన్నది హైకమాండ్ ఆదేశాలు. ఆ విధంగా ఆమె అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఎమ్మెల్సీ, నామినేటెడ్ పోస్టులపై నేతల దృష్టి
రాష్ట్ర ఇన్‌ఛార్జిగా నియమితులైన తర్వాత మీనాక్షి నిర్వహిస్తున్న ఫస్ట్ సమీక్ష సమావేశాలు ఇవే. నేతలు సైతం వీటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. మరో ఐదు ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. పెద్ద సంఖ్యలో నేతలు టికెట్లు ఆశిస్తున్నారు. కొత్త ఇన్‌ఛార్జిని ప్రసన్నం చేసుకునేందుకు నేతలు సైతం సిద్ధమవుతున్నవారు.
దీని తర్వాత సామాజిక వర్గాలకు నామినేటెడ్, మంత్రివర్గ విస్తరణ, పీసీసీ రాష్ట్ర కార్యవర్గ పదవులు ఇస్తారనే వార్తలు లేకపోలేదు. పీసీసీ కార్యవర్గ కూర్పు ఈ నెల 20లోగా పూర్తి అవుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నామినేటెడ్ పదవుల్లో పెండింగ్ లో ఉన్నవాటిని భర్తీ చేయడానికి జిల్లాలవారీగా ఈనెల 10లోగా అర్హులను గుర్తించాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. దీనిపై ఇన్‌ఛార్జి మంత్రులు ఆయా వివరాలు సేకరిస్తున్నారు. మొత్తానికి పార్టీ బలోపేతంపై చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు మీనాక్షి నటరాజన్.