BigTV English

Nani Vs Chinni: చిన్ని VS నాని.. కేశినేని కొత్త కొట్లాట

Nani Vs Chinni: చిన్ని VS నాని.. కేశినేని కొత్త కొట్లాట

Nani Vs Chinni: సొంత తమ్ముడు, విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్న లక్ష్యంగా మాజీ ఎంపీ కేశినేని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. విశాఖలో చిన్ని బినామీ సంస్థకు భారీగా ప్రభుత్వభూమి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని, దాని వెనుక చిన్ని ఉన్నారని నాని ఆరోపించారు. పెట్టుబడుల ముసుగులో ప్రభుత్వ భూమిని కొట్టేసే ప్రయత్నమని నాని తన ట్వీట్లో పేర్కొన్నారు. కేశినేని నాని చేసిన ట్వీట్‌కు చిన్ని కౌంటర్ ట్వీట్ ఇచ్చారు. సోషల్ మీడియా రోడ్లపై మతి భ్రమించి ఓ సైకో కసి, పగ, ద్వేషంతో రగిలిపోతున్నారని ధ్వజమెత్తారు. విజయవాడ అభివృద్ధిపై ఆ సైకో విషం చిమ్ముతున్నారని, అలాంటి ట్వీట్‍లకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. దాంతో అన్నదమ్ముల మధ్య మళ్లీ మొదలైన వార్ హాట్‌టాపిక్‌గా మారింది..


సోషల్ మీడియాలో కేశినేని బ్రదర్స్ వార్

విజయవాడ కేశినేని బ్రదర్స్ రేపిన రచ్చపై పెద్ద చర్చే జరుగుతోంది. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు, ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ మొదలైంది. ఎంపీ చిన్నిపై ఎక్స్‌లో విమర్శలు చేస్తూ నాని ట్వీట్ చేశారు. తన సొంత తమ్ముడు, విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని లక్ష్యంగా మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విశాఖపట్నంలో ‘ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థకు భారీగా ప్రభుత్వ భూమిని కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని, దీని వెనుక ఎంపీ చిన్ని ఉన్నారని నాని ఆరోపించారు. ఇది పెట్టుబడుల ముసుగులో ప్రభుత్వ భూమిని కొట్టేసే ప్రయత్నమని ఆయన విమర్శించారు.


విశాఖలో రూ. 5,728 కోట్ల డేటా సెంటర్ ప్రాజెక్ట్..

విశాఖలో రూ. 5,728 కోట్ల డేటా సెంటర్ ప్రాజెక్ట్ పేరుతో ఉర్సా క్లస్టర్స్ సంస్థకు మొత్తం 60 ఎకరాల భూమిని కేటాయించేందుకు రంగం సిద్ధమైందని కేశినేని నాని పేర్కొన్నారు. ఇందులో ఐటీ పార్క్‌లో 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో 56.36 ఎకరాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, ఈ ఉర్సా క్లస్టర్స్ అనేది కేవలం కొన్ని వారాల క్రితమే నమోదైన సంస్థ అని, దానికి ప్రాజెక్టును చేపట్టే అనుభవం గానీ, ఆర్థిక సామర్థ్యం గానీ లేవని నాని ఆరోపించారు. ఈ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్, ఎంపీ కేశినేని చిన్నికి ఇంజినీరింగ్ క్లాస్‌మేట్ అని, అంతేకాకుండా వ్యాపార భాగస్వామి కూడా అని నాని ఆరోపణలు గుప్పించారు.

21st సెంచరీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఫ్రై.లి. పేరుతో మోసం చేశారని ఆరోపణలు

గతంలో వారిద్దరూ కలిసి 21st సెంచరీ ఇన్వెస్ట్‌మెంట్స్, ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్… పేరుతో ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేశారని నాని ఆరోపణలు చేశారు. ఇప్పుడు అదే తరహాలో ‘ఉర్సా’ పేరుతో ప్రభుత్వ భూమిని బినామీ పద్ధతిలో చేజిక్కించుకునేందుకు చిన్ని ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ భూ కేటాయింపుల వెనుక ఎంపీగా తనకున్న అధికారాన్ని, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తనకున్న పరపతిని చిన్ని దుర్వినియోగం చేస్తున్నారని నాని ఆరోపించారు.

సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన కేశినేని నాని

అంతేకాకుండా ఇసుక, ఫ్లై యాష్, రియల్ ఎస్టేట్ మాఫియాలతో కుమ్మక్కై చిన్ని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు కూడా ఫిర్యాదులున్నాయని పేర్కొన్నారు. ఉర్సా క్లస్టర్స్‌కు భూ కేటాయింపుల ప్రతిపాదనను తక్షణమే రద్దు చేయాలని, పెట్టుబడుల పేరుతో ప్రభుత్వ భూమిని దోచుకునే ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేసినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు.

మతి భ్రమించి ఓ సైకో తిరుగుతున్నారని చిన్ని ట్వీట్

దానిపై ఎంపీ కేశినేని చిన్ని అన్న నానికి అంతే ఘాటుగా రిటార్ట్ ఇచ్చారు. కేశినేని నాని చేసిన ట్వీట్‌కు ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ట్వీట్ ఇచ్చారు. సోషల్ మీడియా రోడ్లపై మతి భ్రమించి ఓ సైకో తిరుగుతున్నారని, సోషల్ మీడియాలో కసి, పగ, ద్వేషంతో రగిలిపోతున్నారని పేర్కొన్నారు. విజయవాడ అభివృద్ధిపై ఆ సైకో విషం చిమ్ముతున్నారని, అలాంటి ట్వీట్‍లకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఎంపీ కేశినేని చిన్ని ట్వీట్ చేశారు.

కేశినేని చిన్ని చేతిలో ఓడిపోయిన కేశినేని నాని

వైసీపీ త‌ర‌పున విజ‌య‌వాడ లోక్‌స‌భ స్థానం నుంచి పోటీ చేసిన మాజీ ఎంపీ కేశినేని నాని.. తన త‌మ్ముడు కేశినేని చిన్నిపై పోటీ చేసి ఓడిపోయారు. కూట‌మి ప్రభుత్వం వ‌చ్చిన త‌ర్వాత రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్నట్టు ఆయ‌న ప్రక‌టించారు. అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుజన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టు పెట్టారు. అయితే తాజాగా రాజ‌కీయంగా చిన్నిపై విరుచుకుప‌డ‌డం తీవ్ర చ‌ర్చనీయాంశంగా మారింది.

Also Read: యరపతినేని.. అలా సెట్ చేశారు 

తీవ్ర దూమారం రేపుతున్న ఉర్సా భూముల వ్యవహారం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉర్సా భూముల వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌‌కు విశాఖపట్నంలోని ఐటీ పార్క్‌లో మూడున్నర ఎకరాలు, కాపులుప్పాడ వద్ద 56.36 ఎకరాలను కేటాయించిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పదం అవుతోంది.. అసలు ఊరు, పేరు లేని డొల్ల కంపెనీకి ప్రభుత్వం వేల కోట్ల విలువగల భూమిని ఎలా అప్పగించిందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదే సమయంలో విజయవాడ మాజీఎంపీ కేశినేని మరో బాంబ్ పేల్చడం హాట్ టాపిక్‌గా మారింది.

కూటమి ప్రభుత్వం వచ్చాక ఉర్సా కంపెనీ ఏర్పాటు చేశారని విమర్శలు

నానికి ట్వీట్‌కు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకటన్న కూడా కౌంటర్ ఇచ్చారు. కేశినేని చిన్నిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా ఎదురుదాడికి దిగారు . కేశినేని ట్రావెల్స్ బంద్ చేసి కార్మికులకు జీతాలు, బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన నువ్వు ఇప్పుడు నీతులు చెబుతున్నావా అంటూ కేశినేని నానిపై ధ్వజమెత్తారు. ఇక అన్నదమ్ముల మధ్య యుద్దంతో అందివచ్చిన అవకాశాన్ని క్యాష్ చేసుకోవడానికి వైసీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. లోకేష్, చంద్రబాబులు అధికారంలోకి రాగానే ఉర్సా కంపెనీని ఏర్పాటు చేశారని దానివెనక ఉన్నది వారేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టింది. బీహార్ దాణా కుంభకోణం కంటే ఇది పెద్దదని ఆరోపణలు మొదలుపెట్టింది.
మొత్తమ్మీద సొంత తమ్ముడిని ఉద్దేశించి కేశినేని నాని చేసిన ఈ ఆరోపణలతో మొదలైన యుద్దం ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.

Related News

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

Big Stories

×