Operation Kagar: వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి మావోయిస్టుల నుంచి దేశాన్ని విముక్తి కల్పిస్తాం. ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దానికి అనుగుణంగా బలగాలు మోహరిస్తున్నారు. ఈ క్రమంలో నక్సల్స్ ఏరివేతకు వివిధ ఆపరేషన్లు చేపడుతున్నాయి బలగాలు. తాజాగా చత్తీస్‌గఢ్-తెలంగాణ బోర్డర్ ములుగు జిల్లా కర్రె గుట్టల అడవుల్లో ‘ఆపరేషన్ కగార్’ కొనసాగుతోంది. ఒకవిధంగా చెప్పాలంటే అడవుల్లో తుపాకుల మోత మొదలైంది. తాజాగా జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి.
ఆపరేషన్ ‘కగార్’
ములుగు జిల్లా కర్రె గుట్టల అడవుల్లో దాదాపు 2,500 మంది మావోయిస్టులు సమావేశం అయ్యారన్న వార్త బలగాలకు చెవిలో పడింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వేలాది మంది పోలీసులు, ఆపై కేంద్ర బలగాలు కర్రగుట్టను రౌండప్ చేశాయి. కేవలం భూమిపై నుంచి మాత్రమే కాకుండా హెలికాఫ్టర్ సాయంతో అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడతున్నాయి.
బలగాలకు నీరు, ఆహారం, మందు గుండు సామాగ్రిని ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు అధికారులు. ఆపరేషన్ మొదలుపెట్టి ఇప్పటికి మూడు రోజులు గడిచింది. ఆ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరగవచ్చని నిఘా వర్గాల అంచనా. అయితే ఎదురు కాల్పులను పోలీసులు ధృవీకరించలేదు. కేవలం కూంబింగ్ మాత్రమే చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
మావోలకు కోట ఆ ప్రాంతం
కర్రె గుట్ట ప్రాంతం తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ వరకు విస్తరించింది. దీన్ని మావోలకు పెట్టని కోటగా కొందరు చెబుతున్నారు. ఎత్తైన కొండలు, పొడవైన చెట్లు కింద ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. సింపుల్‌గా చెప్పాలంటే టెక్నాలజీ సాయంతో మావోలను అంచనా వేయడం కష్టమైన పని. అందుకే బలగాలు భారీ ఎత్తున మొహరించాయి.
ALSO READ: అమ్మాయిలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
బలగాలు వస్తున్న విషయం తెలియగానే మావోలు అలర్ట్ అయ్యారు. ఈ ప్రాంతానికి ఎవరూ రాకుండా బాంబులు అమర్చినట్టు వార్తలు వస్తున్నాయి. దయచేసి గుట్టల్లోకి ఎవరు రావొద్దని లేఖ విడుదల చేశారు. దీనిపై ములుగు ఎస్పీ శబరీష్ రియాక్ట్ అయ్యారు. అడవి తల్లిని నమ్ముకుని ఆదివాసులు బతుకుతున్నారని అన్నారు. బాంబుల పేరుతో బెదిరించడం సరైన పద్దతి కాదని అన్నారు.
టెన్షన్‌లో ఆ ప్రాంత ప్రజలు
చట్టవిరుద్ధ పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రాంతంలో మావోయిస్టుల కీలక నేతలు సుప్రీం హిడ్మాతోపాటు కీలక నేతలు ఉన్నట్లు అంతర్గత సమాచారం. దీంతో తమ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలియక బెంబేలెత్తుతున్నారు అక్కడి ప్రజలు.