TDP MLA Yarapathineni: ప్రజల మన్ననలు పొందాలంటే తీవ్రంగా శ్రమించడం ఒక పద్ధతి . అలాగే వారి సమస్యల పరిష్కారానికి తెలివిగా ఆలోచించి దారి చూపించడం కూడా ముఖ్యమే. సమస్యాత్మక సెగ్మెంట్ గురజాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తన అనుభవాన్నంతా రంగరించి.. సమస్యలను చక్కబెడుతూ జనం మన్ననలు పొందుతున్నారంట ఇప్పుడు. ఒకవైపు అభివృద్దికి ఆటంకం కలిగించకుండా.. మరో వైపు ప్రజల సమస్యలకు సొల్యూషన్ చూపిస్తూ… కర్ర విరక్కుండా, పాము చావకుండా అన్నట్లు వ్యవహరిస్తున్నారంట. అలసు ఆయన ఫాలో అవుతున్న రూటేంటో మీరే చూడండి..
గురజాల సెగ్మెంట్ దాచేపల్లి మండలంలో సిమెంట్ నిక్షేపాలు
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ లోని దాచేపల్లి మండలంలోని అనేక గ్రామాల్లో సిమెంట్ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి.. ఆయా గ్రామాలలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న వారికి ఉద్యోగాలు ఇస్తామంటూ అనేక ఫ్యాక్టరీల యాజమాన్యాలు వందల ఎకరాల భూములను రైతుల నుంచి కొనుగోలు చేశాయి. కొనుగోలు చేసే సమయంలో స్థానికులకు ఉపాధి అవకాశాల్లో ప్రాధ్యాన్యత ఇస్తామని ఆశపెట్టి భూములు తీసుకున్నారు. కొంతమంది సిమెంట్ ఫ్యాక్టరీలని ఏర్పాటు చేశారు. కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలేమో ఇంకా రూపుదిద్దుకోలేదు. అక్కడ భూములు కొనుగోలు చేసిన వారు ఎప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తారా? తమకు ఉపాధి అవకాశాలు ఎప్పటికి వస్తాయా అని ఆనేక గ్రామాలవాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
దాచేపల్లి మండలంలో రైతుల ఆందోళనలు
ఈ మధ్యకాలంలో దాచేపల్లి మండలంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ భూములకు సంబంధించి రైతుల ఆందోళనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ ప్లాంట్‌కి, మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు విక్రయించిన రైతులు మ ప్రాంతంలో ఎలాంటి ఇండస్ట్రీలని ఏర్పాటు చేయకపోవడంతో… ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. వివిధ గ్రామాల వాసులు పదేపదే రోడ్డెక్కుతున్నారు.
చిట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి ఆందోళనలు
దానికి తోడు ఈ మధ్య కాలంలో చిట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి స్థానికంగా ఉన్న రైతులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. చిట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే సమయంలో స్థానికంగా ఉన్న వారికి అనేక అవకాశాలు ఇస్తామని హామీలు ఇచ్చి.. భూములను తక్కువ రేటుకి కొనుగోలు చేశారు. అయితే ఆ తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు గానీ తమకు ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదని గ్రామస్థులు ధర్నాలకు దిగుతున్నారు. అంతే కాకుండా ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో స్థానికంగా రసాయనాలు విడుదలవుతూ పంటలు నష్టపోతున్నామని రైతులు ఆందోళన బాట పడుతున్నారు.
చిట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం దిగివచ్చేలా వ్యూహం
కొన్ని సంవత్సరాలుగా ఈ ఆందోళనలు జరుగుతున్నా వారి సమస్యలకు ఎలాంటి పరిష్కార మార్గాలు లభించలేదు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించిన సమస్యలకు తప్పకుండా పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చిన గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌కి రైతుల ఆందోళనలతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయంట. సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించి రైతుల వరుస ఆందోళనలు ఇబ్బందిగా మారడంతో ప్రస్తుతం ఆ సీనియర్ ఎమ్మెల్యే పరిష్కార మార్గాలు ఆలోచించే పనిలో పడ్డారంట. అందులో భాగంగా చిట్టి నాడు సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశంలో ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయంపై స్థానిక ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది . అలాగే సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా దిగివచ్చేలా చేయడంలో యరపతినేని వ్యూహం ఫలించిందంటున్నారు.
Also Read: దువ్వాడ చాప్టర్ క్లోజేనా? సస్పెండ్ వెనుక అసలు కథ..
ఆందోళనలో కొన్ని రోజులు మూతపడిన సిమెంట్ ఫ్యాక్టరీ
సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు సమయంలో స్థానికంగా ఉన్నవారికి అవకాశాలు ఇస్తామని చెప్పినయాజమాన్యం తర్వాత తమకు ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదని రైతుల ఆందోళన బాట పట్టారు.. సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఆందోళన జరగడంతో కొద్దిరోజులు పాటు సిమెంట్ ఫ్యాక్టరీని యాజమాన్యం మూసి వేసింది. ఆ సమయంలో ఎమ్మెల్యే యాజమాన్యంతో చర్చలు జరిపారంట. పంటలకు రసాయనాలు చేస్తున్న నష్టాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారంట. పొల్యూషన్ లెక్కల ప్రకారం చూస్తే అసలు సిమెంట్ ఫ్యాక్టరీనే తొలగించాల్సిన పరిస్థితులు ఉన్నాయన్న అంశాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి వారిని ఇరకాటంలో పడేసారట.
రైతులకు నష్టపరిహారం ఇవ్వడానికి అంగీకారం
దాంతో ఆ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం దిగొచ్చు.. స్థానికంగా ఉన్న రైతులకు నష్టపరిహారం ఇవ్వడానికి అంగీకరించిందంట. అలాగే స్థానికులకు తమ ఫ్యాక్టరీలో ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. కొంత మంది రైతులకు నష్టపరిహారం చెల్లింపులు జరుగుతున్నాయంట. దాంతో స్థానికులు, రైతులు తెగ హ్యాపీ అయిపోతున్నారంట. కర్ర విరక్కుండా, పాము చావకుండా ఎమ్మెల్యే యరపతినేని ఈ ఇష్యూని హ్యాండిల్ చేసిన తీరుపై పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా అభినందనలు కురిపిస్తున్నారంట.