భగవంతుడి తర్వాత చేతులు ఎత్తి మొక్కేది డాక్టర్ ను మాత్రమే. ఆ డాక్టర్ దగ్గర ఉండే నర్సులు పేషెంట్ల ప్రాణాలను కాపాడ్డంలో కీలక పాత్ర పోషిస్తారు. రోగులను కంటికి రెప్పలా చూసుకుంటూ.. క్షేమంగా ఇంటికి చేరేలా ప్రయత్నిస్తారు. అలాంటి ఓ నర్స్.. ఎవరూ ఊహించని పని చేశాడు. మత్తు మందు ఇచ్చి ఏకంగా 10 మంది పేషెంట్లను చంపేశాడు. మరో 27 మందిని చంపేందుకు ప్రయత్నించాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. తాజాగా అతడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఇంతకీ అతడు అంత రాక్షసంగా ఎలా మారాడు? ఎందుకు వారిని చంపాడు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పశ్చిమ జర్మనీల కోర్టు తాజాగా సదరు నర్స్ కు జీవిత ఖైదు విధించింది. 10 మంది రోగులను హత్య చేసి, మరో 27 మందిని చంపడానికి ప్రయత్నించినందుకు పాలియేటివ్ కేర్ నర్సుకు ఈ శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. వుర్సెలెన్ పట్టణంలోని ఓ హాస్పిటల్ లో సదరు నర్సు పని చేసేవాడు. నైట్ షిఫ్ట్ లో పని భారం ఎక్కువ కావడం వల్ల తీవ్ర అలసటకు గురయ్యేవాడు. కొద్ది రోజుల తర్వాత ఎలాగైనా పని భారం తగ్గించుకోవాలి అనుకున్నాడు. వృద్ధ రోగులకు మార్ఫిన్ మత్తుమందును ఎక్కువ మొత్తంలో ఇవ్వడం మొదలుపెట్టాడు. అతడు చేసిన పనికి 10 మంది చనిపోయారు. మరో 27 మందిని తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ హత్యలు డిసెంబర్ 2023- మే 2024 మధ్య జరిగాయి.
ఈ కిరాతకానికి పాల్పడిన నర్స్ 2007లో నర్సింగ్ ట్రైనింగ్ కంప్లీట్ చేశాడు. 2020లో వుర్సెలెన్ ఫెసిలిటీలో జాబ్ సంపాదించాడు. అప్పటి నుంచి అతడికి నైట్ షిఫ్ట్ వేయడం మొదలు పెట్టారు. రాత్రి పూట షిఫ్ట్ లో, రోగులకు సేవలు చేయలేక ఇబ్బంది పడేవాడు. పని భారం నుంచి తప్పించుకునేందుకు రోగులకు అధిక మోతాదులో మార్ఫిన్, మిడాజోలమ్ అనే మత్తుమందును ఇవ్వడం మొదలు పెట్టాడు. రాత్రిపూట ఎక్కువ మంది చనిపోవడంతో హాస్పిటల్ యాజమాన్యానికి అనుమానం కలిగింది. విచారణలో విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి. సదరు నర్స్ మీద పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 2024లో అతడిని అరెస్ట్ చేశారు.
Read Also: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!
అచ్చం ఇలాగే 1999- 2005 మధ్యలో రెండు నార్త్ జర్మనీ ఆసుపత్రులలో ఎక్కువ మోతాదులో గుండెకు సంబంధించిన మందులను ఇంజెక్ట్ చేయడం ద్వారా 85 మంది రోగుల ప్రాణాలు పోయేందుకు నీల్స్ హోగెల్ అనే నర్స్ కారణం అయ్యాడు. 2019లో అతడికి జీవిత ఖైదు విధించబడింది. ఈ కేసు కూడా అచ్చం అలాగే ఉంది. కాకపోతే, చనిపోయిన వ్యక్తుల సంఖ్య తక్కువగా ఉంది. జర్మనీ ఆధునిక చరిత్రలో హోగెల్ అత్యంత ప్రాణాంతకమైన సీరియల్ కిల్లర్లలో ఒకడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
Read Also: గొరిల్లాతో ఆ పని చేయడానికి ఏకంగా రూ.9 లక్షలు చెల్లించిన మైక్ టైసన్, చివరికి..