Prashant Kishor: బిహార్ లో కొత్త రాజకీయం పురుడుపోసుకుంటోంది. ఓవైపు ఇండియా కూటమి, ఇంకోవైపు ఎన్డీఏ.. మధ్యలో మరో పార్టీ. ఈ ఏడాది నవంబర్ లో జరగబోయే బిహార్ అసెంబ్లీ సమరంలో కథలు మారుతున్నాయ్. వ్యూహాలు పదునెక్కుతున్నాయ్. జన్ సురాజ్ పార్టీ పేరుతో తెరపైకి వచ్చిన ప్రశాంత్ కిషోర్ గేమ్ ఛేంజర్ కాబోతున్నారా? బిహార్ లో ఇప్పటి నుంచే సైలెంట్ గేమ్ నడిపిస్తున్నారా?
బిహార్ లో ప్రశాంత్ కిషోర్ పాచిక పారుతుందా?
అవును అతడే రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉండే వారికి పరిచయం అక్కర్లేని పేరు ప్రశాంత్ కిషోర్. ఒకదశలో ఆయన టైం బాగా నడిచింది. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో మోడీ మూడోసారి సీఎం అయ్యేందుకు పీకే సలహాలే ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంతో పాటే ఆయన పేరు కూడా మార్మోగింది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.
2021లో తృణమూల్, డీఎంకేకు సలహాలు
అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండు పార్టీలకు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పని చేశారు. 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయ్యేందుకు పీకే వ్యూహాలు చాలా బాగా పని చేశాయి. 2021లో బెంగాల్ లో తృణమూల్ కు, ఆ తర్వాత తమిళనాడులో డీఎంకేకు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రధాన పార్టీల వ్యూహాలకు అతడే ఆయువు పోశాడు.
జేడీయూలో చేరినా పీకేకు కలిసిరాని కాలం
కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఎన్నో పార్టీలకు సరికొత్త వ్యూహాలు చెప్పి, నేర్పించిన ప్రశాంత్ కిషోర్ సొంతంగా పార్టీ పెట్టి వర్కవుట్ మాత్రం చేసుకోలేకపోయారు. ఆయన వ్యూహాలు ఆయన సొంత పనికి అస్సలు ఉపయోగపడకుండా పోయాయి. సొంత రాష్ట్రం బిహార్ లో ఏం చేసినా కలిసి రాలేదు. ఆ మధ్య జేడీయూలో చేరారు. సీఎం నితీష్ కుమార్ కు రైట్ హ్యాండ్ గా ఎదుగుదామనుకున్నాడు. పార్టీలో కీలకమవుదామన్నాడు. అయితే సీఎంపైనే విమర్శలు ఎక్కు పెట్టడంతో మెల్లగా ఆయనను అక్కడి నుంచి సైడ్ చేసేశారు. దీంతో గతేడాది అక్టోబర్ 2న జన్ సురాజ్ పార్టీని అధికారికంగా ప్రకటించారు పీకే.
తన పాచికలు ఎలా పారవో చూస్తానంటూ సవాల్
ప్రశాంత్ కిషోర్ దగ్గర నిధులు లేవు ఏమీ లేవు. ఆయన వెంట ఎవరు నడుస్తారని ప్రత్యర్థులు కౌంటర్లు వేస్తుంటే కడిగి పారేశారు. తాను రాజకీయ పార్టీలకు సలహా ఇచ్చానంటే వంద కోట్లు తీసుకునేవాడినని తన ఆదాయం లెక్కలు చెప్పడం ద్వారా క్యాడర్ చెల్లాచెదురు కాకుండా జాగ్రత్త పడుతున్నారు. స్ట్రాటజీలు వర్కవుట్ చేయడం ఏంటో గానీ తన వ్యూహాలను ఈజీగా బయటపెట్టుకున్నారన్న చర్చ నడిచింది. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే బిహార్ లో ఈ ఏడాది అక్టోబర్ లేదంటే నవంబర్ లో షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. సో వాటిలో తన సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ షురూ చేశారు పీకే. తన పాచికలు ఎలా పారవో ఇప్పుడు చూస్తానంటున్నారు. బిహార్ లో గేమ్ ఛేంజర్ ఎలా అవ్వాలో తేల్చేస్తానంటున్నారు.
BPSC ప్రిలిమినరీ పరీక్షల అవకతవకలపై పోరాటం
ఏదో ఒక ఇష్యూ గట్టిగా తగలాలి. అటెన్షన్ అంతా అటువైపే ఉంటుంది. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు.. ఇటీవల బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో అదే ఇష్యూను పీకే ఎత్తుకున్నాడు. ఆ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రశాంత్ కిశోర్ జనవరి 2న గాంధీ మైదానంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. గత కొన్ని రోజులుగా బీపీఎస్సీ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలు చేపడుతున్నా, ప్రభుత్వంలో ఎలాంటి కదలిక రావట్లేదని, ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసి.. మళ్లీ కొత్తగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే చాలా జరిగాయి.
విద్యార్థులు, నిరుద్యోగుల తరపున పోరాటం
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం చేయడం, ప్రశాంత్ కిశోర్ చట్టవిరుద్ధంగా నిరసన చేపట్టారని ఆరోపిస్తూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి.. కోర్టు ముందు హాజరుపరిచడం, మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని కోర్టు షరతులతో బెయిల్ ఇవ్వడం, ప్రశాంత్ దాన్ని తిరస్కరించడం, బెయిల్ వచ్చినా ఆ పేపర్లపై పీకే సంతకం చేయకపోవడం జైలుకెళ్లడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. అనంతరం కోర్టు షరతులు లేని బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. విద్యార్థులు, నిరుద్యోగుల తరపున పోరాటం కంటిన్యూ చేస్తున్నారు. ఎన్నికల దాకా ఇదే కథ నడిపిస్తానంటున్నారు.
బిహార్ ట్రయాంగిల్ వార్ అవుతుందా?
బిహార్ లో ఓవైపు ఆర్జేడీ-కాంగ్రెస్, ఇంకోవైపు జేడీయూ, బీజేపీ ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు. ఇప్పుడు మధ్యలో జన్ సూరజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఇచ్చారు. మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇది ట్రయాంగిల్ వార్ గా మారుతుందా అన్నది హాట్ డిబేట్ గా మారింది. ఇది నిజమే అన్నట్లుగా గ్రౌండ్ లో పీకే.. గేమ్ షురూ చేశారు. ఎడ్యుకేషన్ పై ఫోకస్ పెంచుతున్నారు. మంచి చదువులు ఉంటే ఏం జరుగుతుందో జనానికి మ్యాటర్ ఎక్కిస్తున్నారు.
గంటలో లిక్కర్ బ్యాన్ ఎత్తేస్తానని హామీలు
బిహార్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే మద్యంపై నిషేధాన్ని గంటలో తొలగిస్తామన్నారు. లిక్కర్ బ్యాన్ తో బిహార్ కు ఏటా 20వేల కోట్ల రూపాయల ఆదాయం నష్టపోతోందన్నారు. మద్యం కావాలనుకున్న వారికి ఏదో రూపంలో దొరుకుతూనే ఉంది. ఆ లాస్ ప్రభుత్వానికి ఎందుకు అన్నది పీకే పాయింట్. బిహార్‌లో ఎడ్యుకేషన్ ప్రక్షాళన జరగాలంటే 4లక్షల కోట్లకుపైగా నిధులు అవసరమంటున్నారు. మద్యంపై నిషేధం ఎత్తివేసి విద్యకు అవసరమైన నిధులను సమకూరుస్తామంటూ చెప్పడంపై జనంలో చర్చ జరుగుతోంది.
ముస్లింలు, EBC-OBC, అగ్రవర్ణాల ఓట్లే లక్ష్యం
గత 30 ఏళ్లుగా బిహార్ ప్రజలు ఆర్జేడీ లేదా జేడీయూ లేదా బీజేపీకి మాత్రమే ఓటేస్తున్నారని, ఈ సంప్రదాయం మారాలని పిలుపునిచ్చారు ప్రశాంత్ కిషోర్. తమ పార్టీ రాజవంశానికి చెందింది కాదంటూ ప్రత్యర్థులకు సెటైర్లు కూడా వేశారు. ఇందులో భాగంగా అటు అధికార జేడీయూ-బీజేపీ టార్గెట్ గా పోరాటం షురూ చేశారు. ఇటు ఆర్జీడీనీ టార్గెట్ చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల బలహీనతలు ఏంటో లెక్కలు కట్టేశారు. కథ నడిపిస్తున్నారు. బిహార్ ముస్లిం ఓటర్లు, EBC-OBC అలాగే అగ్రవర్ణ ఓటర్లను వేర్వేరు రూట్లలో ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
ఆర్జేడీ, జేడీయూ, బీజేపీ ఓటుబ్యాంకుపై పీకే ఫోకస్
సో ఇది మిశ్రమ స్ట్రాటజీ. పీకే పార్టీతో ఏ కూటమికి నష్టం జరుగుతుందన్న అంచనాలపై చర్చ జరుగుతోంది. అటు ముస్లింలను, ఇటు ఓబీసీలను, ఆపై అగ్రవర్ణాల వారిని ఆకర్షించే వ్యూహాలు అప్లై చేస్తున్నారు. దీంతో ఆర్జేడీ, జేడీయూ, బీజేపీ ఈ మూడు పార్టీల ఓటు బ్యాంకుపై పీకే కన్నేశాడు. సో బైపోలార్ ఫైట్ ను ట్రయాంగిల్ వార్ గా మార్చేస్తానంటున్నాడు.
నిరుద్యోగుల్ని తనవైపు తిప్పుకునే యత్నం
నిజానికి ప్రశాంత్ కిషోర్ బిహార్ లో ఎన్ని వ్యూహాలు అమలు చేయాలని చూసినా పెద్దగా వర్కవుట్ కావడం లేదు. అయితే గతేడాది డిసెంబర్ 25న పాట్నాలో నిరుద్యోగులపై లాఠీఛార్జ్ జరిగింది. డిసెంబర్ 30న వాటర్ కెనాన్లు ప్రయోగించారు. మరోసారి లాఠీఛార్జ్ చేశారు. ఇది ఆందోళనకారుల్లో మరింత ఆగ్రహజ్వాలలు రగిల్చింది. అందులో ప్రశాంత్ కిషోర్ కీరోల్ పోషించారు. ఆమరణ నిరాహార దీక్షకు దిగడం, ఆ ఉద్యమాన్ని తనవైపు తిప్పుకోవడం, రాష్ట్రమంతా అటెన్షన్ లోకి రావడం, హైలెట్ అవడం ఇవన్నీ పీకేకు ఎన్నికలకు ముందు అనుకూల పరిణామాలుగా మారాయి. ఈ ఉద్యమం ఇంతటితో ఆపకుండా 51 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడం దానికి యువ సత్యాగ్రహ కమిటీ అని పేరు పెట్టడం ఇవన్నీ వ్యూహాత్మకమే.
క్యాస్ట్ డైనమిక్స్ ను డీల్ చేసేలా తొలి వ్యూహం
పీకే పార్టీపై వస్తున్న మ్యాటర్ ఏంటంటే.. ప్రతిపక్షాల ఓట్లను విచ్చిన్నం చేయడానికి బీజేపీ వ్యూహంలో భాగంగా ఉంటోందని కొందరంటున్నారు. సో ఓవరాల్ గా చూస్తే బిహార్ ఎన్నికలు అంటేనే కులాల లెక్కలు చాలా ఇంపాక్ట్ చూపుతుంటాయి. వీటి ముందు ఎన్ని వ్యూహాలు రచించినా వట్టిదే. అందుకే ముందు క్యాస్ట్ డైనమిక్స్ ను డీల్ చేయాలి. అది ప్రశాంత్ కిషోర్ కు బాగా తెలుసు. బిహార్ లో వెనుకబడిన కులాలు, ముస్లింలు 53 శాతంగా ఉన్నారు. సో వీరిని ప్రసన్నం చేసుకోవడం కీలకం. వచ్చే ఎన్నికల్లో ఈ వర్గాల నుంచే ఎక్కువ మందిని నిలబెట్టాలని లీకులు ఇస్తున్నారు. తనకు నిధుల సమస్య లేదని చెబుతున్నారు. జన్ సురాజ్ పార్టీ తొలి వర్కింగ్ ప్రెసిడెంట్ గా దళితున్నే ఎంపిక చేయడం ఈ వ్యూహంలో ఒక భాగం. JDU యొక్క మహాదళిత్ కార్డుకు కౌంటర్ గా కూడా వెళ్తున్నారు.
రెండేళ్లుగా బిహార్లో ప్రశాంత్ కిషోర్ పాదయాత్రలు
నిజానికి జన్ సురాజ్ పార్టీ స్థాపనకు ముందు రెండేళ్లుగా ప్రశాంత్ కిషోర్ బిహార్ అంతటా గ్రౌండ్ వర్క్ చేశారు. పాదయాత్రలు చేశారు. గ్రామాలు, పట్టణాల్లో తిరిగారు. సభలు, సమావేశాలు నిర్వహించారు. గ్రౌండ్ లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడ గ్యాప్ ఉందో పసిగట్టారు. అందుకే ఇప్పుడు కథ మొదలు పెట్టారు. బిహార్ చాలా కాలంగా నిరుద్యోగం, సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం, నేరాలు విపరీతంగా పెరగడం వంటి సవాళ్లతో పోరాడుతోంది. వీటికి తాను మందు వేస్తానంటున్నాడు పీకే. మరి జనం ఎంత వరకు కలిసి వస్తారన్నదే పాయింట్.
ఇటీవలి బైపోల్స్ లో పీకే పార్టీకి మంచి ఓట్ షేర్
అక్టోబర్ 2, 2024న పార్టీ పెట్టి.. మరుసటి నెలలో జరిగిన 4 అసెంబ్లీ బైపోల్స్ లో పోటీ పెట్టారు పీకే. నెల రోజుల్లోనే మంచి ఓట్ షేర్ రాబట్టారు. అక్కడ తొలి సక్సెస్. జనం మార్పు కోరుకుంటున్నారన్న చర్చకు ఆ ఫలితాలు దారి తీశాయి. తనకున్న తక్కువ వనరులతోనే పార్టీ సింబల్ ను సిద్ధాంతాలను జనంలోకి తీసుకెళ్లడం ద్వారా మంచి మార్కులైతే రాబట్టారు. అదే ఉత్సాహంతో ఇప్పుడు బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు పీకే. జై బిహార్ నినాదాన్ని ఎత్తుకున్న ప్రశాంత్ కిషోర్ ఏమేరకు సక్సెస్ అవుతారన్నది ఉత్కంఠగా మారుతోంది.