టీడీపీకి గెలిచేందుకు 25 సంవత్సరాలు సమయం
ప్రకాశం జిల్లాలో వైసీపీకి కంచుకోటలాంటి నియోజకవర్గం సంతనూతలపాడు. 1999 నుండి ఇక్కడ టీడీపీ గెలవడానికి 25 సంవత్సరాలు పట్టిందంటనే అర్థం చేసుకోవచ్చు. అక్కడ పరిస్థితి ఏంటన్నది. అదే విధంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గెలాక్సీ గ్రానైట్, అత్యధిక సారవంతమైన నేలలు, రెండు ప్రాజెక్టులు కలిగి సంపన్నవంతమైన నియోజకవర్గం సంతనూతలపాడు. అలాంటి నియోజక వర్గంలో స్థానికులకు సీటు కేటాయించమని వైసిపి క్యాడర్ అధిష్ఠానాన్ని బలంగా కోరుతుంది.
ఇంచార్జ్‌గా కొనసాగుతున్న మేరుగు నాగార్జున
ప్రస్తుతం సంతనూతలపాడులో మాజీమంత్రి మేరుగు నాగార్జున ఇంచార్జ్‌గా కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల వరకూ బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం నుంచీ పోటీ చేస్తూ వస్తున్న నాగార్జున.. గత ఎన్నికల్లో సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడారు. ప్రస్తుతం బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా భాద్యతలు నిర్వహిస్తున్నారాయన. బాపట్ల జిల్లా అధ్యక్ష భాద్యతలు సమర్దవంతంగానే నిర్వహిస్తున్నా.. సంతనూతలపాడు నియోజకవర్గానికి వచ్చేసరికి.. పార్ట్ టైం పాలిటిక్స్‌కి పరిమితం అయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికీ తన పాత నియోజకవర్గ కేడర్‌తో టచ్‌లో
నాగార్జున తిరిగి వేమూరు నియోజకవర్గానికే వెళ్లేందుకే ఆసక్తి చూపిస్తున్నారని.. అందుకే సంతనూతలపాడుకి ఫుల్ టైం కేటాయించటం లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన ఇప్పటికీ తన పాత నియోజకవర్గ కేడర్‌తో టచ్‌లోనే ఉంటారన్న ప్రచారంతో మళ్లీ ఆయన అక్కడకే వెళ్లవచ్చేమో అన్న టాక్ నడుస్తుందట పార్టీ వర్గాల్లో. ఆయన తిరిగి వెళ్లిపోతే తమ పరిస్దితి ఏంటి.. అనే భావన కలుగుతుందట స్థానిక కేడర్‌లో.
ముఖ్యమైన కార్యక్రమాలకు మాత్రమే హాజరు
ఈ ప్రచారానికి తోడు మాజీ మంత్రి నాగర్జున కేవలం పార్టీ పిలుపునిచ్చిన ముఖ్యమైన కార్యక్రమాలకు మాత్రమే హాజరై తిరిగి వెళ్తున్నారే తప్ప.. కార్యకర్తలకు అవసరమైన సమయాల్లో అందుబాటులో ఉండటం లేదన్న టాక్ కూడా నడుస్తుందట.
ఆశించిన స్థాయిలో స్పందించలేదనే ప్రచారం
ఇటీవల సంతనూతలపాడు నియోజకవర్గంలో సంచలనంగా మారిన.. టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో.. పలువురు వైసీపీ కీలక నేతలపై ఆరోపణలు వచ్చాయి. వైసీపీ నేతల ప్రమేయం లేకున్నా విచారణల పేరుతో వారికి ఇబ్బందికర పరిస్దితులు ఏర్పడినా ఇంచార్జ్ నాగార్జున ఆశించిన స్దాయిలో స్పందించలేదన్న ప్రచారం కూడా గట్టిగానే జరుగుతుందట. మాజీమంత్రి మేరుగు నాగార్జున ప్రకాశం జిల్లాలో ఉన్న సంతనూతలపాడు నియోజకవర్గానికి ఇంచార్జ్ గా ఉంటూ.. బాపట్ల జిల్లాకు వైసీపీ అధ్యక్ష భాద్యతలు కూడా నెరవేరుస్తూ ఉండటంతో ఎక్కువ సమయం ఆ జిల్లాకు కేటాయించాల్సి వస్తుందట. ఈ నేపధ్యంలో సంతనూతలపాడు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ మార్పు ఉండొచ్చు అన్న టాక్ మొదలైంది.
ఇంట్రస్ట్ చూపిస్తున్న వరికూటి అశోక్ బాబు
మేరుగు నాగార్జున తిరిగి తన సొంత నియోజకవర్గమైన వేమూరుకు తిరిగి వెళ్తే సంతనూతలపాడుకు వచ్చేందుకు అక్కడి ప్రస్తుత ఇంచార్జ్ వరికూటి అశోక్ బాబు కూడా ఆసక్తి చూపిస్తున్నారట. ఇప్పటికే ఆయన నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలతో తాను వస్తే సపోర్ట్ చేయాలని కూడా కోరినట్లు సమాచారం. ఒకవేళ వేమూరు నుంచి తన సొంత నియోజకవర్గమైన కొండేపికి వెళ్లాలన్నా అక్కడ ప్రస్తుతం ఉన్న గ్రూపు విబేధాలు తనకు సెట్ కావన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలిసింది. మరోవైపు అశోక్ బాబు తమ నియోజకవర్గానికి వస్తే ఇబ్బందులు తప్పవని ఇప్పటికే కొందరు వైసీపీ నేతలు అధిష్టానానికి సమాచారం అందజేశారని సమాచారం.
కొండేపి నుంచి యర్రగొండపాలెం వెళ్లేందుకు సురేష్ ఆసక్తి
అదే సమయంలో కొండేపి వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న ఆదిమూలపు సురేష్ కూడా తనకు కొండేపి నుంచి తన సొంత నియోజకవర్గమైన యర్రగొండపాలెం కు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. అయితే అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా తాటిపర్తి చంద్రశేఖర్ ఉండటంతో అది వర్కవుట్ అయ్యే అవకాశాలు లేవు. దీంతో తాను 2014లో సంతనూతలపాడు నుంచి పోటీ చేసి గెలిచి ఉండటంతో కొండేపి కంటే ఈ నియోజకవర్గమే తనకు పొలిటికల్ ఫ్యూచర్‌కి ఇబ్బంది లేకుండా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారట. అయితే గతంలో సంతనూతలపాడు ఎమ్మెల్యేగా సురేష్ కొనసాగిన సమయంలో నియోజకవర్గానికి ఎప్పుడు సమయం కేటాయించలేదనే అపవాదు మాత్రం ఆయనపై ఉందట.
తనకే ఛాన్స్ ఇవ్వాలంటూ అధిష్టానంతో మంతనాలు
మరోవైపు సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే సుదాకర్ బాబు కూడా అవకాశం వస్తే మరోసారి ఇక్కడి నుంచే పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారట. గత ఎన్నికల సమయంలో తనకు సీటు లేదని చెప్పినా పార్టీ లైన్‌కే కట్టుబడి ఉన్నానని గుర్తు చేస్తున్నారట. జిల్లా వ్యాప్తంగా అన్నీ ప్రాంతాల్లో ప్రచారానికి కూడా వెళ్లి పార్టీ అభ్యర్దుల గెలుపు కోసం పనిచేశానే తప్ప పార్టీ గీత దాటలేదని చెప్పుకొస్తున్నారట. ఇప్పటికే సంతనూతలపాడులో ఆయన అనుచరులు, సన్నిహితులు కూడా బాగానే ఉండటం.. దీనికి తోడు పలు మండలాల కీలక నేతలు సుదాకర్ బాబు అయితే పర్వాలేదన్న ఆలోచనలో ఉండటంతో.. మార్పు చేసే పరిస్థితి ఉంటే తనకు ఛాన్స్ ఇవ్వాలని అధిష్టానం టచ్‌లోనే ఉన్నట్లు సమాచారం.
చీమకుర్తి, సంతనూతలపాడు మండలాల్లో బూచేపల్లికి గట్టి పట్టు
అయితే సంతనూతలపాడు ఇంచార్జ్ విషయంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట కూడా అవసరం కావటం.. అదే సమయంలో నియోజకవర్గంలోని చీమకుర్తి, సంతనూతలపాడు మండలాల్లో బూచేపల్లికి గట్టి పట్టు ఉండటంతో ఆయన మాట కూడా ఇక్కడ కీలకం అయ్యే అవకాశం ఉంది. మార్పు అనివార్యమైతే ఆయన మద్దతు ఉన్న వారికే ఇంచార్జ్ గా ప్రకటించే అవకాశం ఉండటంతో బూచేపల్లితో కూడా నేతలు టచ్ లోనే ఉంటునట్లు సమాచారం.
ఇప్పచికిప్పుడు మార్పు ఉంటుందా? లేక వేచి చూస్తుందా?
అయితే ఇంచార్జ్ పదవి కోసం ట్రై చేస్తున్న నేతలందరూ ఎవరికి వారే సైలెంట్ మోడ్‌లోనే ఆపరేషన్ నడిపిస్తున్నారని తెలుస్తోంది. మరి సంతనూతలపాడు విషయంలో వైసీపీ అధిష్టానం ఆలోచన ఏంటి..? ఇప్పటికిప్పుడు మార్పు ఉంటుందా..? లేక వేచి చూస్తుందా..? అనేది మాత్రం ప్రస్తుతానికి మిస్టరీగానే ఉంది.
-Story By vamshi krishna, Bigtv Live