
Sharmila News Telangana: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పవర్‌ఫుల్ సీఎంగా ఉన్నారు. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ల నాయకత్వంలో అంతకంటే పవర్‌ఫుల్ విపక్షం ఉంది. ఆ ముగ్గురు, మూడు పార్టీల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ఎవరూ తగ్గట్లే. ఎవరూ వదలట్లే. ఈ ట్రయాంగిల్ వార్‌లో ఎవరిది అప్పర్ హ్యాండో.. ఎవరు విజేతలో చెప్పడం కష్టం. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య.. ఇంతలా రాజకీయ యుద్ధం నడుస్తున్న సమయంలో.. నాలుగో పార్టీకి స్పేస్ ఉందా? అనే డౌట్. ఇదంతా షర్మిల గురించే.
అవును, షర్మిల పోరాటం, ఆరాటం మామూలుగా లేదు. ఆమె చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం కూడా లేదు. రాజన్న బిడ్డనంటూ.. తెలంగాణ కోడలంటూ.. కాలికి బలపం కట్టుకుని మరీ రాష్ట్రమంతా తిరుగుతున్నారు. ఆమె వెనుక పట్టుమని 10 మంది కూడా ఉండట్లేదు. అయినా, షర్మిల నిరుత్సాహ పడటం లేదు. అలుపన్నదే లేకుండా సర్కారుతో సమరం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ లాంటి లీడర్లకు ఏమాత్రం తీసిపోకుండా పదునైన విమర్శలు చేస్తున్నారు. పాదయాత్ర, దీక్ష, నిరసన, ధర్నాలతో రాజకీయంగా బాగా కష్టపడుతున్నారు.
ఇంత చేస్తుంటే ఆమెకు దక్కుతున్న ప్రతిఫలం ఎంతన్నదే చర్చ. వైఎస్సార్‌టీపీలో ఆమె కాకుండా కాస్త ఫేస్ వ్యాల్యూ ఉన్న లీడర్ ఒక్కరంటే ఒక్కరు కూడా లేరనే చెప్పాలి. పార్టీలో కమిటీలు లేవు, నాయకులు లేరు, పెద్దగా కార్యకర్తలూ లేరు. ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయరు. ఓ ప్రైవేట్ ఈవెంట్‌లా పార్టీని నడిపిస్తున్నారనే విమర్శ అయితే ఉంది. ఇలాంటి పార్టీతో ఏం చేద్దామని? ఏం సాధిద్దామని?
పాలేరులో పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు షర్మిల. అక్కడ పార్టీ కార్యాలయం కూడా కడుతున్నారు. పోటీ అయితే చేస్తారు కానీ.. గెలుస్తారా? అంటే అవునని నమ్మకంగా చెప్పలేని పరిస్థితి. పాలేరు సరే.. మిగతా చోట్ల బరిలో దిగుతారా? 119 స్థానాల్లో పోటీ చేయడం బీజేపీ లాంటి పార్టీలకే గతంలో సాధ్యం కాలేదు.. అందుకే, షర్మిల నుంచి ఆ నెంబర్ ఆశించలేము. మరి, గట్టిగా 10 చోట్ల పోటీ చేస్తే ఎక్కువే అంటున్నారు. అక్కడ కూడా బలమైన అభ్యర్థులు దొరుకుతారా? ఏదో పోటీ చేశామా అంటే చేశామనేలా మమ అనిపిస్తారా? ఈసారి అసెంబ్లీలో వైఎస్సార్‌టీపీ ఎమ్మెల్యేను చూడగలమా? కేసీఆర్, రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లను, వారి పార్టీలను కాదని.. షర్మిల వెంట నడిచేనా? వైఎస్సార్ అభిమానులైనా రాజన్న బిడ్డ వెనుక నిలిచేనా?
ఇంతటి నిరుత్సాహకరమైన రాజకీయ వాతావరణంలోనూ వైఎస్ షర్మిల చేస్తున్న పోరాటాన్ని మాత్రం అభినందించాల్సిందే. న్యూస్‌లో ఉండాలనో.. మరే కారణమో.. నిత్యం షర్మిల పేరు ఏదో ఒక రూపంలో వినిపించాల్సిందే. ప్రధాన పార్టీలకు మాదిరే షర్మిల గురించి మాట్లాడుకోవాల్సిందే అనేలా కార్యక్రమాలు చేపడుతున్నారామె. ఆ క్రమంలో తరుచుగా పోలీసులకు, అధికార పార్టీకి టార్గెట్‌గా మారుతున్నారు. అరెస్టులతో అనేకసార్లు ఇంటికే పరిమితం అయ్యారు. అయినా, తగ్గేదేలే అంటూ బయటకు రావడం.. పోలీసులు ఎప్పటిలానే అడ్డుకోవడం.. ఈసారి ఆమె తిరగబడటం.. తమను కొట్టారంటూ ఖాకీలు కేసులు పెట్టడం.. ఆమె అరెస్ట్ కావడం.. జైలుకు వెళ్లడం.. ఇదంతా చూస్తుంటే.. షర్మిలకు ఇంత కష్టం అవసరమా? అనేవాళ్లూ లేకపోలేదు. బోనులో ఉంచినా పులి పులే.. రాజశేఖర్‌రెడ్డి బిడ్డ తగ్గేదేలే.. ఇదే షర్మిల ఆన్సర్.
Nawaz Sharif about India : భారత్ సూపర్ సక్సెస్.. పాక్ అడుక్కుంటోంది.. నవాజ్ షరీఫ్ సంచలన కామెంట్స్..