Congress MLC Candidate: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఐదు ఖాళీ అవుతున్నాయి. వాటి ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. ఖచ్చితంగా ఆ అయిదు స్థానాల్లో నాలుగు కాంగ్రెస్ మద్దతు దారులకు దక్కనున్నాయి. ఆ నాలుగు స్థానాలు కోసం ఏకంగా 40 మంది వరకు ఆశావహులు క్యూ కడుతున్నారు. సామాజిక సమీకరణ వారీగా ఆ పోస్టుల కోసం కాంగ్రెస్‌లో విపరీతమైన పోటీ నెలకొంది. ఇప్పటి వరకు అవకాశం రాని నేతలు, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు, సీనియర్లు ముమ్మర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఆ క్రమంలో అదృష్టం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తి రేపుతోంది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్
తెలంగాణలో అయిదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 3 న నోటిఫికేషన్ వెలువడనుండగా, మార్చి 20 న ఎన్నికలు, అదే రోజు ఫలితాలు వెలువడతాయి. అసెంబ్లీలో సంఖ్యాబలాలను బట్టి వాటి ఒక స్థానం బీఆర్ఎస్ ఖాయమైనా.. మిగిలిన నాలుగు కాంగ్రెస్ మద్దతుదారులకు దక్కనున్నాయి. దాంతో పలువురు ఆశావహులు ఎవరి స్థాయిల్లో వారు లాబీయింగ్ చేసుకుంటున్నారు.. బీసీ కులగణనను హైలెట్ చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎమ్మెల్యేల నియామకంలో సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.
సొంత బలంతో 3 స్థానాలు గెలుచుకోనున్న కాంగ్రెస్
అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్య బలం ఆధారంగా.. ఎమ్మెల్యే కోటా కింద ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ మూడు స్థానాలను సులభంగా గెలుచుకోగలదు. మరో అదనపు సీటు గెలవాలంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోని చేరిన 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కీలకం కానుంది. అయితే ఎంఐఎం, సీపీఐలు ఒక సీటును ఆశిస్తున్నాయి. కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా సీపీఐ ఒక్క సీటు కాంగ్రెస్‌ను అడుగుతుంది. దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రస్తుతం ఖాళీ అవుతున్న ఒక్క స్థానంలో తమ అభ్యర్థికి సహకరించాలని ఎంఐఎం పట్టుబడితే… అవగాహనలో భాగంగా కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? అనేది కూడా చూడాల్సి ఉంది.
సీపీఐతో కలిపి కాంగ్రెస్ కు అసెంబ్లీలో 66 మంది ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలుగా ఉన్న మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, షేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, మీర్జా రియాజుల్ హాసన్‌ల పదవీకాలం ఈ ఏడాది మార్చి 29తో ముగియనుంది. మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, షేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశంలు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీలుగా గెలుపొందగా.. ఎంఐఎం నేత మీర్జా రియాజుల్ హాసన్ మాత్రం బీఆర్ఎస్ మద్దతుతో ఎంఐఎం సభ్యుడిగా శాసనమండలికి ఎన్నికయ్యారు. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు సీపీఐ సభ్యుడితో కలిపి అధికారికంగా 66 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను మినహాయిస్తే బీఆర్ఎస్‌కు 28 మంది ఎమ్మెల్యేలున్నారు. ఒక్క ఎమ్మెల్సీ సీటు గెలవడానికి 20 మంది ఎమ్మెల్యేల మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం.
ఈ నెల28న గాంధీ భవన్2లో విస్తృత స్థాయి సమావేశం
కాంగ్రెస్ ఈ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి ఈ నెల 28న గాంధీ భవన్ లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌లు ఈ కీలక సమావేశంలో ఏ నిర్ణయం తీసుకొంటారో అని నేతల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంఐఎం మద్దతుతో ఖాళీ కానున్న ఐదు స్థానాలలో నాలుగింటిని కచ్చితంగా కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది .. అయితే ఎవరికి ఇవ్వాలని కాంగ్రెస్ తర్జన భర్జన పడుతుంది.
రేసులో ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నేతలు
మొత్తమ్మీద నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు తీవ్ర పోటీ నెలకొందని చెప్పొచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో కి రావడానికి కష్టపడ్డవారు కావొచ్చు, కార్పొరేషన్ పదవులలో అవకాశం రాని వారు, పార్టీ పదవులలో చోటు దక్కని వారు ఇలా చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అన్ని జిల్లాలలోని సీనియర్ నేతలు, పాత, కొత్త భేదం లేకుండా అందరూ సీరియస్ గా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడి పోయిన వారికి ఏడాది వరకు ఎలాంటి అవకాశాలు లేవని పార్టీ కండిషన్ పెట్టింది. కానీ ఇప్పటికే ఏడాది పూర్తి అయింది కాబట్టి వారు కూడా రేసులోకి వస్తున్నారు.
Also Read: గూడెం మహిపాల్ యూటర్న్
అవగాహనలో భాగంగా ఎంఐఎంకి ఒక స్థానం కేటాయిస్తారా?
సామాజిక వర్గాల వారిగా నాలుగు స్థానాలకు 40మంది వరకు పోటీ పడుతున్నారని తెలుస్తుంది. అయితే బీసీ కులగణన జరగడం, తెలంగాణ లో 50 శాతం పైగా బీసీలు ఉన్న నేపథ్యంలో, బీసీలకే ఎక్కువ అవకాశం ఇవ్వాలని ఆ సామాజిక వర్గ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ఎస్సీ లకే అవకాశం ఇవ్వాలని ఆ సామాజిక నేతలు పట్టు పడుతున్నారు. ఎస్టీ నేతలకు ఇప్పటివరకు ప్రాధాన్యత దక్కలేదని, ఖచ్చితంగా చాన్స్ ఇవ్వాలని ఆ వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడా హై కామాండ్ పై ప్రెజర్ తెస్తుండటంతో హై కమాండ్ ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉందంట.
పోటీ పడుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు
ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్ వంటి సీనియర్లు కూడా ఎమ్మెల్సీ పదవులు రేసులోకి రావడం ఉత్కంఠ రేపుతోంది. ఈ ముగ్గురు సీఎంకు అత్యంత సన్నిహితులు. హైకమాండ్ దగ్గర తమకున్న పలుకుబడితో వారు లాబీయింగ్ చేసుకుంటున్నారంట. ఇక మాజీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి , జీవన్ రెడ్డి లాంటి వారు కూడా ట్రై చేస్తున్నారంట. మొత్తానికి 4 ఎమ్మెల్సీ పదవుల కోసం 40 మంది పోటీ పడుతుండటంతో.. ఆ లక్కీ ఫోర్ ఎవరనేది చూడాలి.