Posani Krishna Murali: వైసీపీ నేత పోసాని కృష్ణమురళి మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుటివరకు ఒక్క కేసుల మాత్రమే అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి ఆయనకు రెండువారాల పాటు రిమాండ్ విధించారు. ఎలాగ చూసినా కొన్నాళ్లు పోసానికి కష్టాలు తప్పవన్నది కొందరి వైసీపీ నేతల మాట. ఇంతకీ న్యాయమూర్తి ముందు వాదనల సారాంశం ఏంటి?
న్యాయస్థానంలో వాదోప వాదనలు
సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి రైల్వేకోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గురువారం రాత్రి 9.30 గంటల నుంచి శుక్రవారం ఉదయం 5 గంటల వరకు ఇరుపక్షాల మధ్య న్యాయమూర్తి ముందు వాదోప వాదనలు జరిగాయి. రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు.
దీనికితోడు కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని న్యాయస్థానం ముందు వివరించారు. అందుకు సంబంధించి సేకరించిన ఆధారాలు న్యాయమూర్తి ముందు ఉంచారు. వెంటనే పోసాని తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తన వాదనలు వినిపించారు.
బీఎన్‌ఎస్ చట్టం ప్రకారం పోసానికి 41ఏ నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని కోరారు పొన్నవోలు. అందుకు మేజిస్ట్రేట్ నిరాకరించారు. ఆరేడు గంటలు సుధీర్ఘ వాదనల తర్వాత పోసానికి రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. పోసాని మార్చి 12 వరకు రిమాండ్‌లో ఉండనున్నారు. ఆయనను కడప సెంట్రల్ జైలుకి తరలించనున్నారు.
ALSO READ: స్పీడ్ పెంచిన దువ్వాడ.. పోసానితో పోటీ వద్దంటున్న జనసేన
పోలీసుస్టేషన్‌లో ఏం జరిగింది?
అంతకుముందు హైదరాబాద్ నుంచి ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్‌కు పోసాని కృష్ణమురళిని తరలించారు పోలీసులు. వెంటనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో పోసానిని ఏడు గంటలపాటు విచారించారు పోలీసులు.
ఎస్పీ పర్యవేక్షణలో ఇద్దరు సీఐలు పోసానిపై ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు, పవన్, లోకేశ్‌లను అసభ్యకరంగా ఎందుకు తిట్టారు? మీ వ్యాఖ్యల వెనుక ఎవరున్నారు? ఎవరైనా చెబితే తిట్టారా? దీనిపై పార్టీ నుంచి ఎవరు సమాచారం ఇచ్చారు? కుటుంబసభ్యులను అనుచితంగా మాట్లాడాలని ఎవరు సలహా ఇచ్చారు? ఇలా రకరకాల ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. పోలీసుల ప్రశ్నలపై మెల్లగా సమాచారం ఇచ్చారట పోసాని.
తనను ఎవరూ ప్రేరేపించలేదని, ఎవరు చెప్పలేదని పోసాని తెలిపారట. ఆవేశంలో తాను స్వయంగా మాట్లాడానని చెప్పుకునే ప్రయత్నం చేశారట. తాను చేసిన వ్యాఖ్యలు ఇంతవరకు వస్తుందని తెలియక తప్పు చేశానని ఒప్పేసుకున్నారట. తాను అలా మాట్లాడటం ముమ్మాటికీ తప్పేనని అన్నట్టు తెలిసింది. రెండు డజను ప్రశ్నలు పోసానికి సంధించినట్టు తెలుస్తోంది. వాటిలో ఎక్కువ భాగం తెలియదు, గుర్తు లేదని మాత్రమే చెప్పినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
ప్రశ్నల సమయంలో పోసాని మాట్లాడిన వీడియోలు దగ్గరపెట్టి గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేశారు. వాటికి పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది. విచారణ తర్వాత సరిగ్గా రాత్రి తొమ్మిదిన్నర గంటలకు రైల్వేకోడూరు కోర్టులో పోసానిని హాజరు పరచారు పోలీసులు. ప్రస్తుతం న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయనను రిమాండ్‌కు తరలించారు. మరింత సమాచారం కోసం ఆయన్ని మళ్లీ పోలీసులు కస్టడీకి తీసుకునే అవకాశం ఉందా? లేదా అన్నదే ఆసక్తికరంగా మారింది.