Himalayas: ప్రపంచంలోనే అద్భుతమైన ప్రదేశంగా ఉన్న హిమాలయాలకు భూకంపం టెన్షన్ పట్టుకుంది. చల్లని వాతావరణాన్ని పంచే హిమాలయాల భూగర్భంలో తీవ్రమైన యుద్ధమే జరుగుతుంది. ఖండాలను చీల్చే టెక్టోనిక్ ప్లేట్ల మధ్య ఘర్షణతో.. హిమాలయన్ రీజన్ భయంకరమైన భూకంపాలకు కారణం అవుతోంది. అసలు, ఆ ప్రాంతంలో ఏం జరుగుతోంది..? టెక్టోనిక్ ప్లేట్ల సంఘర్షణతో వచ్చిన టెన్షన్ ఏంటీ..? రీసెంట్‌గా వచ్చిన టిబెట్ భూకంపానికి మించిన డేంజర్ భవిష్యత్తును భయపెడుతోందా..?
రెండు భూ ఫలకాల మధ్య భారీ ఒత్తిడి
విశ్వంలోనే అత్యంత అందమైన గ్రహం భూమి అంటారు. భూమిపైన వాతావరణం ఎంత అందంగా ఉంటుందోనని సంబరపడతారు. అయితే, భూమి లోపల ఏం జరుగుతుందో అందరికీ తెలియకపోవచ్చు. ఈ అందం కింద ఎంత విధ్వంస్వం దాగుందో అర్థం కాదు. ఇక, భారతదేశానికి తలమానికైన అద్భుత హిమాలయ ప్రాంతం కింద కూడా ఘోరమైన సంఘర్షణ జరగుతోందని ఎప్పటి నుండో అధ్యయనాలు చెబుతున్నాయి. హిమాలయన్ రీజన్‌లో రెండు భూ ఫలకాల మధ్య భారీ వత్తిడి పెరుగుతోంది. ఇది, భారత్, టిబెట్ దేశాల్లో దేనినైనా చీల్చడానికి అవకాశం ఉంది.
ఏడాదికి 2 మిల్లీ మీటర్ల చొప్పున తగ్గుతున్న భారత భూభాగం
ఈ ఏరియాలో రాబోయే తీవ్రమైన భూకంపాలతో ఒక ప్రాంతం సర్వనాశనమయ్యే ప్రమాదమూ ఉందనేది నిపుణుల అభిప్రాయం. ఇదే ఇప్పుడు భారత్‌ను కూడా భయపెడుతోంది. కొన్నేళ్లుగా హిమాలయన్ ప్రాంతంలో టెక్టోనిక్ ప్లేట్ల మధ్య మార్పులు కనిపిస్తున్నాయి. చాప కింద నీరులా.. ఈ ప్రాంత భూభాగం కింద టెక్టోనిక్ ప్లేట్లు జారిపోతూ ఉన్నాయి. టిబెట్ భూభాగంతో ఉన్న టెక్టోనిక్ ప్లేట్లతో సంఘర్షిస్తున్నాయి. ఇప్పటికే, ఏడాదికి 2 మిల్లీ మీటర్ల చొప్పున భారత భూభాగం కూడా తగ్గుతున్నట్లు ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది, రాబోయే కాలంలో మరింత భయానక భూకంపాలకు కారణమవుతుందా..?
జనవరి 7న టిబెట్‌లో సంభవించిన భయానక భూకంపంలో..
తాజాగా టిబెట్, నేపాల్ సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. జనవరి 7న సంభవించిన ఈ భయానక భూకంపంలో 126 మంది ప్రాణాలు కోల్పోగా.. 188 మంది గాయపడ్డారు. 400 వందల కంటే ఎక్కువ మంది భవన శిథిలాల కింద చిక్కుకున్నారు. ఇప్పటికీ ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఎంత తీవ్రంగా వచ్చిందంటే.. 24 గంటల్లో దాదాపు 20 సార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. జనవరి 8న సంభవించిన భూకంప తీవ్రంత 6.58గా నమోదయ్యింది.
20వ శతాబ్ధం నుండి 7 తీవ్రత దాటిన భూకంపాలు 9 సార్లు
వరుసగా వచ్చిన ప్రకంపనల్లో 10 సార్లు 6 తీవ్రతతో భూకంపం ఏర్పడింది. భూకంపాలకు ప్రసిద్ధి చెందిన టిబెట్ ప్రాంతంలో గత సంవత్సరం 100 భూకంప సంఘటనలు జరగ్గా అవి కనీసం 3.0 తీవ్రతతో వచ్చినట్లు డేటా వెల్లడిస్తోంది. అయితే, 7 తీవ్రతకు మించిన చాలా తక్కువే అయినప్పటికీ.. 20వ శతాబ్ధం ప్రారంభం నుండి ఇప్పటి వరకూ 7 తీవ్రత దాటిన భూకంప సంఘటనలు 9 సార్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక, ఇప్పుడొచ్చిన భూకంప తీవ్రతకు వెయ్యి కంటే ఎక్కువ ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతంలో భారీ జనసాంద్రత ఉండటం వల్ల వందల మంది నిరాశ్రయులుగా మారాల్సి వచ్చింది.
టిబెట్‌లోని డింగ్రీ కౌంటీ చుట్టుపక్కల తీవ్ర భూకంపం
ఈ భూకంప ప్రభావం ఒక్క టిబెట్‌ను మాత్రమే కాకుండా నేపాల్, భారత్‌లలో కూడా కనిపించింది. టిబెట్‌లోని డింగ్రీ కౌంటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూకంప తీవ్రత అధికంగా ఉంది. ఈ భూకంపం ధాటికి భవనాలు నేలమట్టం అయ్యాయి. టిబెట్ సరిహద్దుని ఆనుకుని ఉన్న నేపాల్‌లోని 7 జిల్లాల్లో భూకంపం ప్రభావం కనిపించింది. నేపాల్-టిబెట్ సరిహద్దుకు 93 కిలోమీటర్ల దూరంలోని లబుచె ప్రాంతంలో ఉదయం 6.30 గంటలకు ఈ భూకంపం సంభవించింది. టిబెట్‌లోని షిజాంగ్‌లో 10 కి.మీ లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం ఆరుసార్లు భూకంపం వచ్చినట్టు చెప్పారు.
ఢిల్లీ-ఎన్సీఆర్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బిహార్‌లల్లో ప్రకంపన
అయితే, టిబెట్‌లో ఏర్పడ్డ భూకంపానికి 13 వేల 800 అడుగుల ఎత్తు కొండలపై ఉన్న ఇళ్లు నేలకూలాయి. దీనితో, అక్కడ సహాయ చర్యలకు కూడా తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఇక, టిబెట్ హిమాలయన్ రీజియన్‌లో ఏర్పడ్డ భూకంపంతో భారతదేశంలోని ఢిల్లీ-ఎన్సీఆర్‌తో పాటు నేపాల్‌కు ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, సిక్కిం, బిహార్ రాష్ట్రాల్లో పలుచోట్ల ప్రకంపనలు నమోదయ్యాయి. అలాగే, అస్సాం వంటి ఇతర ప్రాంతాల్లో.. భారత్- నేపాల్ సరిహద్దుల్లో ఉండే పలు ప్రాంతాల్లో కూడా స్వల్ప స్థాయిలో భూమి కంపించింది.
ఎవరెస్టు శిఖరానికి కేవలం 80 కిలోమీటర్ల దూరంలోనే భూకంపం
అయితే, టిబెట్‌లో విధ్వంసం సృష్టించిన ఈ భూకంప కేంద్రం.. నేపాల్-భూటాన్ సరిహద్దు వైపు ఉన్న ఎవరెస్టు శిఖరానికి కేవలం 80 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. భూకంపానికి కారణమైన కేంద్ర భాగం.. భూ ఉపరితలం నుంచి 10 కి. మీ. లోతులో ఉన్నట్లు భూకంప పరిశీలకులు వెల్లడించారు. ఈ ప్రాంతాన్ని లాసా రీజియన్ అని పిలుస్తున్నారు. ఇది హిమాలయన్ ప్రాంతంలో భౌగోళికంగా అత్యంత కీలకమైన ప్రదేశంగా ఉంది. ఈ ప్రాంతానికి ఉత్తరం వైపు.. బ్యాంగాంగ్- నుజి యాంగ్ జోన్ ఉండగా.. దక్షిణం వైపు ఇండస్- యార్లింగ్ జాంగ్బో సరిహద్దులు ఉంటాయి.
దక్షిణం వైపు ఇండస్- యార్లింగ్ జాంగ్బో సరిహద్దులు
ఇక్కడ భూ ఫలకాల్లో మార్పులు సంభవించినప్పుడల్లా దాని ప్రభావం ఈ ప్రాంతంపై పడుతుంది. అందుకే తరచూ ఇక్కడ భూకంపాలు ఏర్పడుతుంటాయి. గత రికార్డులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసాయి. ఇండియన్, యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల మధ్య నిత్యం జరుగుతున్న ఘర్షణలు ఈ భూకంపాలకు కారణం అవుతున్నాయి. అయితే, భవిష్యత్‌లో మరింత ప్రమాదకరమైన భూకంపాలు వచ్చే అవకాశమున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
10 కోట్ల ఏళ్ల క్రితం టెక్టోనిక్ ఫలకగా విడిపోయిన భారత్
పురాతన ఖండం గోండ్వానాలో ఒక భాగంగా ఉన్న భారత భూభాగం.. 10 కోట్ల సంవత్సరాల క్రితం ఇతర శకలాల నుంచి భారత టెక్టోనిక్ ప్లేట్‌గా విడిపోయింది. ఇది ఉత్తరం వైపు కదులుతూ వచ్చింది. ప్రస్తుతం, భారత ఉపఖండం, దక్షిణ చైనా, పశ్చిమ ఇండోనేషియాలో కొంత భాగం వరకు ఈ ప్లేట్ విస్తరించి ఉంది. ఇది 5 కోట్ల సంవత్సరాల నుంచి యురేషియన్ ప్లేట్‌ను ఢీ కొడుతూ ఉంది. దాని ప్రభావంతోనే హిమాలయ శ్రేణులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం, ఈ టెక్టోనిక్ ప్లేట్.. యురేషియన్ ప్లేట్ వైపు ఏటా 5 సెంటీమీటర్ల మేర కదులుతూ.. దాన్ని ఢీకొంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
యురేషియన్ ఫలక వైపు ఏటా 5 సెం.మీ. మేర కదులుతున్న భూమి
దాంతో హిమాలయాలు మరింత ఎత్తు పెరిగి, టిబెట్ ప్రాంతం రెండుగా విడిపోయే ప్రమాదానికి దారి తీయనుంది. మరో కోణంలో చూస్తే.. టెక్టోనిక్ ప్లేట్లలో ఏర్పడుతున్న ఈ సంఘర్షణ వల్ల భారత భూభాగం కూడా విడిపోయే ప్రమాదమున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే, భారత టెక్టోనిక్ ప్లేట్ ప్రతి సంవత్సరం కొంత మేర కదులుతుందని శాస్త్రవేత్తలు గమనించారు. దీనివల్ల హిమాలయన్ రీజియన్‌లో ఒత్తిడి ఎక్కువవుతుందనీ.. ఇది అది పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
మధ్య హిమాలయ ప్రాంతంలో భారీ భూకంపం అంచనా
టెక్టోనిక్ ప్లేట్ల మధ్య సంఘర్షణల వల్ల భవిష్యత్తులో మధ్య హిమాలయ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించే అవకాశముంది. అయితే, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.5 ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూగర్భ డేటా, భారతీయ భూ వైజ్ఞానిక పరిశోధన సంస్థ, గూగుల్ ఎర్త్‌తో పాటు ఇస్రో కార్టోసాట్-1 శాటిలైట్ తీసిన చిత్రాల ఆధారంగా ఈ విషయాన్ని తెలిపినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.5 ఉంటుందంటున్న శాస్త్రవేత్తలు
బెంగళూరులోని జవహర్ లాల్ నెహ్రూ ఆధునిక శాస్త్రీయ పరిశోధన సంస్థ ఇటీవల ఈ పరిశోధన వివరాలను ప్రచురించింది. ఉత్తరాఖండ్ నుంచి పశ్చిమ నేపాల్ మధ్య.. భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ విపత్తు సంభవించే అవకాశముందని తాజా పరిశోధనల ఆధారంగా వెల్లడించారు. భూ పొరల్లో కదలికలు, ఘర్షణల ఫలితంగా తీవ్ర ఒత్తిడి నెలకొనడంతో ఈ విపత్తు సంభవించే అవకాశముందని తెలిపారు.
నేషనల్ సిస్మోలాజికల్ డేటాబేస్ సెంటర్
20వ శతాబ్దపు తొలి దశాబ్దాల నుండి హిమాలయాల్లో భూకంపాలకు సంబంధించిన డేటాబేస్ మన దగ్గర ఉంది. ప్రపంచవ్యాప్తంగా భూకంపాలను పర్యవేక్షించే భూకంప స్టేషన్ల నెట్‌వర్క్, కమ్యూనికేషన్ వ్యవస్థల అభివృద్ధితో ఈ డేటా అంతా ఇప్పుడు మరింత మెరుగైన చర్యలు తీసుకోడానికి ఉపయోగపడుతుంది. న్యూ ఢిల్లీలోని భారత వాతావరణ శాఖ, నేషనల్ సిస్మోలాజికల్ డేటాబేస్ సెంటర్‌ను నడుపుతోంది. అలాగే, హిమాలయ ప్రాంతంలో డజనుకు పైగా ఉన్న 54 భూకంప శాస్త్ర అబ్జర్వేటరీలు కూడా ఎప్పటికప్పుడు హిమాలయన్ రీజియన్‌లో భూకంపాలను పర్యవేక్షిస్తున్నారు.
1505 జులై భూకంపంతో ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్ అతలాకుతలం
ఇక, ఇప్పటికున్న డేటా ప్రకారం చూస్తే… రికార్డు స్థాయిలో, మొదటి హిమాలయ భూకంపం ఖాట్మండులో 1255 నాటిది. ఈ భూకంపంలో నాటి నేపాల్ రాజ్యంలో మూడింట ఒక వంతు నశించినట్లు తెలుస్తోంది. అలాగే, జూన్ 1505లో ఒక భూకంపం దక్షిణ టిబెట్‌లో విధ్వంసం సృష్టించింది. అదే ఏడాది జులై నెలలో మరో భూకంపం ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌ను అతలాకుతలం చేసింది. 1555లో భారత్‌లోని శ్రీనగర్‌లో వచ్చిన భూకంపం వందలాది మందిని బలి తీసుకుంది. ఇది, కాశ్మీర్ భూకంపాలకు సంబంధించిన మొదటి చారిత్రక రికార్డు. ఇక, అప్పటి నుండి, హిమాలయ ప్రాంతం నుండి భారీ భూకంపాలు నమోదయ్యాయి.
1991లో సంభవించిన ఉత్తర కాశీ భూకంపం
1990ల నుండీ చూసుకుంటే.. 1991లో సంభవించిన ఉత్తర కాశీ భూకంపం నుండి 1999లో ఉత్తర ప్రదేశ్‌లోని చమౌలీ భూకంపం, 2005 నాటి గ్రేట్ కాశ్మీర్ భూకంపం వరకూ వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. నాటి కాశ్మీర్ భూకంపం 7.6 తీవ్రతతో వచ్చింది. నాటి పాకిస్తాన్ రాజధాని ముజఫరాబాద్‌కి ఈశాన్యంగా 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారత్, ఆసియా సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంది. ఈ ప్రకంపనలు ఉత్తరాన కాబూల్ వరకు.. దక్షిణాన ఢిల్లీ వరకు కనిపించాయి. బాలాకోట్ ప్రాంతంలో వందల మందిని బలితీసుకుంది. ఈ భూకంపం 6.2 తీవ్రతతో దాదాపు 12 కంటే ఎక్కువ సార్లు వచ్చి, కాశ్మీర్‌ను వణికించాయి.
150 ఏళ్లలో హిమాలయ ప్రాంతంలో 4 భారీ భూకంపాలు
ఈ భూకంపం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో కొండలపైన అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. రోడ్లు మూసుకుపోయాయి. మృతుల సంఖ్య పరంగా, హిమాలయ చరిత్రలో ఇది అత్యంత ఘోరమైన భూకంపంగా పేర్కొంటారు. ఇలా, గత 150 సంవత్సరాల్లో హిమాలయ ప్రాంతంలో నాలుగు భారీ భూకంపాలు సంభవించాయి. అయితే, భవిష్యత్తులో ఇంతకంటే తీవ్రమైన భూకంప దాడి, 8 లేదా అంతకంటే ఎక్కవ తీవ్రతతో వస్తుందనే సంకేతాలు ఇప్పుడు హిమాలయన్ రీజియన్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.
సుమారు 15 కోట్ల ఏళ్ల క్రితం 2 మహా ఖండాలుగా భూభాగం
నిజానికి, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఖండాలు ఇప్పటిలా ఉండేవి కాదు. అన్నీ కలిసి దగ్గర దగ్గరగా ఉండేవి. దానినే ‘పాంజియా’ అని పిలిచేవారు. ఈ ఖండాలు క్రమంగా ఒక దానికొకటి దూరంగా జరుగుతూ.. సుమారు 15 కోట్ల సంవత్సరాల క్రితం రెండు మహా ఖండాలుగా విడిపోయినట్లు తెలుస్తోంది. ఈ మహా ఖండాలే.. గోండ్వానా లాండ్, లారేసియాగా ఏర్పడ్డాయి. అయితే, ఇప్పటి భారత భూభాగం ఒకప్పుడు గోండ్వానా లాండ్లో ఓ చిన్న భూ పలకంలా ఉండేది.
ఇప్పటి ఆసియాలో మరో భూ ఫలకాన్ని గట్టిగా ఢీ
అది లక్షల సంవత్సరాల పాటు అలా నెమ్మదిగా జరుగుతూ.. ఇప్పటి ఆసియాలో మరో భూ ఫలకాన్ని గట్టిగా ఢీ కొట్టడంతో హిమాలయాలు ఏర్పడ్డాయి. ఆ స్థానంలో గతంలో తెథిస్ సముద్రం ఉండేదని చరిత్ర చెబుతోంది. అయితే, ఈ భూఫలకాల మధ్య ఘర్షణ ఇప్పటికీ నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే భూగర్భంలో మార్పులు చోటు చేసుకొని భూకంపాలు సంభవిస్తున్నాయి. సాధారణ భూకంపాలతో పోలిస్తే.. హిమాలయాల్లో ఏర్పడే భూకంపాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే, తాజాగా టిబెట్‌లో ఏర్పడిన భూ ప్రకంపనలు, భూకంప కేంద్రం నుంచి సుమారు 400కి.మీ. వరకు విస్తరించినట్లు తెలుస్తోంది.
టెక్టోనిక్ ఒత్తిడి జరిగి, పెద్ద భూకంపంగా మారడానికి సమయం
నిజానికి, పెద్ద భూకంపాలు ఒక ‘సీస్మిక్ సైకిల్’ను అనుసరిస్తాయని అంటారు. ఎందుకంటే ఒక ప్రాంతంలో టెక్టోనిక్ ఒత్తిడి జరిగి, అది పెద్ద భూకంపంగా మారడానికి సమయం పడుతుంది. ఉదాహరణకి, రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో వచ్చిన భూకంపం హిమాలయాలోని కొంత ప్రాంతాన్ని తాకినప్పుడు.. అదే ప్రాంతంలో మరో భూకంపం తాకడానికి దశాబ్దాల సమయం పట్టొచ్చు. దీన్ని బట్టి, చాలా కాలంగా ఒక ప్రాంతంలో పెద్ద భూకంపం రాలేదంటే.. అక్కడ, పెద్ద భూకంపం తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది.
భవిష్యత్తులో మరో పెద్ద భూకంపం వస్తుందని అంచనా
గతంలో కూడా హిమాలయాల మధ్య భాగాలైన నేపాల్‌లోని ఖాట్మండు, భారతదేశంలోని డెహ్రా డూన్ మధ్య గతంలో పెద్ద భూకంపం సంభవించిందనీ.. భవిష్యత్తులో అలాంటి మరో భూకంపం వస్తుందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. అందులోనూ, భారతీయ టెక్టోనిక్ ప్లేట్ హిమాలయాల క్రింద సంవత్సరానికి 1.8 సెంటీమీటర్ల మేర ఒక పెద్ద లోపంతో కదులుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఆసియా వైపు భారతదేశ మొత్తం ప్లేట్ కదలికలో మూడింట ఒక వంతు. అంటే, సంవత్సరానికి 5.4 సెంటీమీటర్లు. ఇక, మిగిలిన ప్లేట్ కదలిక రేటు టిబెట్, మధ్య ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో ఉంది.
హిమాచల్, నేపాల్ వంటి ప్రాంతాల్లో తీవ్రమైన భూకంపం
అయితే, ఈ టెక్టోనిక్ ప్లేట్ల కదలిక ప్రభావంతో భవిష్యత్తులో హిమాలయ ప్రాంతాలైన హిమాచల్ ప్రదేశ్, నేపాల్ వంటి పలు ప్రాంతాల్లో కూడా తీవ్రమైన భూకంప ప్రభావం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రభావం భారత ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతదేశంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టెక్టోనిక్ ప్లేట్ల నిరంతరం వస్తున్న ఈ మార్పులు… టిబెట్‌తో పాటు భారత భూభాగాన్ని కూడా విడదీస్తూ చివరికి భూమి మధ్యలో ఉన్న మెన్టెల్‌లో కలిపేస్తాయనే సిద్ధాంతం కూడా గట్టిగానే వినిపిస్తుంది.
మెన్టెల్ అనేది 70 నుండి సుమారుగా 2,890 కి.మీ. లోతు
సాధారణంగా, భూమి లోపల క్రస్ట్ అనే ప్రాంతం 0 నుండి 70 కిలో మీటర్ల లోతు ఉంటుంది. తర్వాత మెన్టెల్ అనేది 70 నుండి సుమారుగా 2 వేల 890 కిలోమీటర్ల పైనే ఉంటుంది. అయితే, టిబెట్‌లో సేకరించిన మట్టి నమూనాల ఆధారంగా అక్కడ టెక్టోనిక్ ప్లేట్ల భూభాగం మెన్టెల్‌కు చాలా సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. అంటే, హిమాలయాలు భగభగ మండే భూ పదార్థానికి దగ్గరౌతున్నాయి. ఇది, భూకంపాలను సృష్టించడంతో పాటుగా అకాల వర్షాలకు, వరదలకు కూడా కారణమవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
టెక్టోనిక్ ప్లేట్ల మార్పులతో విపరీత పరిణామాలు
ఏది ఏమైనప్పటికీ, సృష్టిని దాని పరిణామాన్ని మార్చడం మనిషికి సాధ్యం కాకపోవచ్చు. కానీ, పకృతిని కాపాడుకోవడం మాత్రం మనిషి చేతిలోనే ఉంది. హిమాలయాల్లో పెరుగుతున్న మైనింగ్, పెరుగుతున్న భవనాల నిర్మాణం, అడవులను నరికివేయడం వంటి చర్యలు అక్కడ పర్యావరణాన్ని పూర్తిగా మారుస్తున్నాయి. ఇది, హిమాలయాల్లో మంచు భారీగా కరిగిపోవడం నుంచి.. మెన్టెల్‌కు దగ్గరగా ఉన్న నేలను మరింత క్రుంగిపోయే విధంగా చేస్తుంది. టెక్టోనిక్ ప్లేట్లలో మార్పులతో పాటు పలు విపరీత పరిణామాలకు కారణం అవుతుంది. అందుకే, ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ పర్యవరణ మార్పుకు సంబంధించిన కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాన్ని అంతర్జాతీయంగా భౌగోళిక శాస్త్రవేత్తలు, పరిశోధకులందరూ గుర్తు చేస్తున్నారు.
హిమాలయ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.. భూమి కింద ఉన్న టెక్టోనిక్ ప్లేట్లు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నాయి. ఏ ఖండాన్ని ఎటు చీల్చుతాయో తెలియకుండా కలవరం పుట్టిస్తున్నాయి. దేని కోసం మనుషులు ఘర్షణ పడుతున్నారో.. అది శాశ్వతం కాదని చెప్పకనే చెబుతున్నాయి.