Trump Love Princess Diana| అందమైన అమ్మాయిలంటే అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మక్కువ ఎక్కువ. ఆయన స్త్రీలోలుడని ఎన్నో కథనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని నిజమని ఆధారాలు కూడా నిరూపితమయ్యాయి. తన జీవితంలో ఎదురైన అందమైన అమ్మాయిలందరితో మంచి రిలేషన్ పెట్టుకోవాలని ఆయన ప్రయత్నించినట్లు సన్నిహితులు చెబుతుంటారు. ఈ లిస్టులో ఏకంగా బ్రిటన్ యువరాణి, ప్రిన్స్ హ్యారీ తల్లి ప్రిన్సెస్ డయానా కూడా ఉందన్న సంగతి ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అసలు ఈ కథ ఏంటో చూద్దామా?
ఇటీవల ప్యారిస్‌లో నోట్రెడామ్ ఓపెనింగ్ సెరమనీకి డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. ఆయనతోపాటు బ్రిటన్ ప్రిన్సెస్ డయానా పెద్దకొడుకు ప్రిన్స్ విలియమ్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సెస్ డయానాతో ట్రంప్‌నకు ఉన్న రిలేషన్ గురించి మరిన్ని వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టడం మొదలు పెట్టాయి. ట్రంప్ అనుకున్నట్లు అంతా జరిగి ఉంటే.. ప్రిన్సెస్ డయానానే ఆయన భార్యగా, అమెరికా ఫస్ట్ వుమెన్‌గా ఉండేదని పలు వార్తలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా బీబీసీ కరస్పాండెంట్, ప్రిన్సెస్ డయానా స్నేహితురాలు సెలీనా స్కాట్ గతంలో రాసిన ఒక కథనం ఇప్పుడు మరోసారి వెలుగులోకి వచ్చింది. నాజూకైన అందంతోపాటు అందరి పట్ల మంచి స్నేహం కనబరిచే ప్రిన్సెస్ డయానాను అందరూ ‘ప్రజల యువరాణి’ అని పిలిచేవారు. 1995లో మ్యాన్‌హాటన్‌లో జరిగిన ఒక ఛారిటీ ఈవెంట్‌లో ఆమెను తొలిసారి కలిశారట ట్రంప్. ఆమె అందానికి ఫిదా అయిన ట్రంప్.. ఆ తర్వాత ఆమెకు పూలబొకేలు పంపడం మొదలు పెట్టారట.
Also Read: నరకం చూపిస్తా.. హమాస్‌కు డెడ్ లైన్ విధించిన ట్రంప్
అంతేకాదు, ఫ్లోరిడాలోని తన ‘మార్ ఎ లాగో’ క్లబ్‌లో కాంప్లిమెంటరీ మెంబర్‌షిప్ ఇస్తానని ఆఫర్ కూడా ఇచ్చారట. అయితే అప్పటికే ట్రంప్ మాటిమాటికీ పూలబొకేలు పంపడంతో ఇబ్బంది పడుతున్న డయానా.. మార్ ఎ లాగో మెంబర్‌షిప్ వద్దని సున్నితంగా తిరస్కరించిందట. ఆయన తన మీద మరీ కాన్‌సన్‌ట్రేట్ చేస్తున్నట్లు డయానా అనుకుందని సెలీనా తన కథనంలో రాసుకొచ్చింది. ఆమె సున్నితంగా దూరం పెడుతున్నప్పటికీ ట్రంప్ మాత్రం.. అవకాశం దొరికిన ప్రతిసారీ డయానాతో మాటలు కలిపేందుకే ప్రయత్నించేవారట.
ఒకసారి 1997లో ఒక ఇంటర్వ్యూలో కూడా ప్రిన్సెస్ డయానా గురించి ట్రంప్ ప్రస్తావించారు. ‘ఆమె టాప్ మోడల్స్ కన్నా అందగత్తె. పొడవు, అందం.. ఆమెకు అన్నీ ఉన్నాయి’ అని చెప్పారు. ఆమెను పెళ్లిచేసుకునేవారా? అని ఆ ఇంటర్వ్యూయర్ అడిగితే ‘కుదిరితే కచ్చితంగా చేసుకునేవాడిని’ అని చెప్పారు. ఆ తర్వాత మరోసారి 2000 సంవత్సరంలో కూడా ఒక రేడియో ఇంటర్వ్యూలో ప్రిన్సెస్ డయానా గురించి ట్రంప్ మాట్లాడాడు. ‘ఛాన్స్ దొరికి ఉంటే ఆమెతో ఒక రాత్రి గడిపేవారా?’ అని అడిగితే.. ‘డౌటే లేకుండా’ అని చెప్పాడీ రిపబ్లికన్ ప్రెసిడెంట్.
డయానా అంటే ట్రంప్‌నకు ఉన్న మోజు గురించి తన కథనంలో రాసుకొచ్చిన సెలీనా.. ట్రంప్ దృష్టిలో డయానా ఒక ‘ట్రోఫీ వైఫ్’ (అందరికీ గొప్పగా చూపించుకునే బహుమతి వంటి భార్య) అని, అదే సమయంలో డయానాకు మాత్రం ట్రంప్ తన వెంటపడుతున్నాడనే ఫీలింగ్ ఉండేదని వివరించింది. ప్రిన్సెస్ డయానాతో డేటింగ్ చెయ్యలేకపోవడమే తన కెరీర్‌లో ‘అమ్మాయిల విషయంలో’ తనకు ఉన్న అతిపెద్ద బాధ అని ట్రంప్ ఒకసారి చెప్పారు. తన పుస్తకం ‘ది ఆర్ట్ ఆఫ్ ది కంబ్యాక్’లో కూడా డయానా గురించి ప్రస్తావించిన ట్రంప్.. ‘తను వస్తే ఆ గది అంతా వెలుతురుతో నిండిపోయినట్లుండేది. అందరూ ఆమెను మెప్పించడానికే ప్రయత్నించేవారు. ఆమె నిజమైన యువరాణి-ఎవరికైనా కలల రాణి’ అని రాసుకొచ్చారంటేనే ఆయనపై డయానా ప్రభావం అర్థం చేసుకోవచ్చు.