SC Sub-Classification: తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన ఎస్సీ వర్గీకరణ అంశంపై బీజేపీ ఎందుకు నోరు మెదపడం లేదు ? మొదటి నుంచి వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని పదే పదే చెప్పిన తెలంగాణ నేతలు.. తీరా సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక.. సైలెంట్ అయిపోవడం పట్ల ఆంతర్యం ఏంటి? వర్గీకరణ అంశంలో ఇంకేమైనా లొసుగులు ఉన్నాయా..? వర్గీకరణ అంశంపై దూరంగా ఉండాలని నేతలకు హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చాయా ?
రాష్ట్రాలు ఎస్సీ కులాల ఉపవర్గీకరణ చేసుకోవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పు కేంద్రంలోని ఎన్డీయేను కుదిపేస్తోంది. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని.. వర్గీకరణ సాధించేందుకు తమ వంతుగా శ్రమిస్తామని.. ప్రధాని మోడీ పార్లమెంట్ ఎన్నికలకు ముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సాక్షిగా హామీ ఇచ్చారు. మాదిగ సామాజిక అభివృద్ధికి అవసరమైన ఆర్థిక విధానాలు మెరుగు పరిచేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వర్గీకరణను లీగల్ గా ఎదుర్కొనేందుకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట మేరకు మోడీ కేంద్ర కేబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీని కూడా నియమించారు.
కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కమిటీ నివేదికతో పాటు ప్రభుత్వ ఆలోచనను కూడా పరిగణలోకి తీసుకుని వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇక ఈ తీర్పుతో ఎన్నికల సందర్భంగా మోడీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని బీజేపీ వర్గాలో చర్చ జరుగుతోంది. అయితే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పుపై బీజేపీ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
Also Read: 15 ఏళ్ల పాలన ఒక నిర్ణయం తో ఆవిరి!
బీజేపీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాలతోనే.. తెలంగాణ నేతలు వర్గీకరణ అంశంపై గప్ చుప్ అయ్యారని టాక్. వర్గీకరణను స్వాగతిస్తున్నామంటూ ఎవరికి వారు ముందుగా మీడియాకు ప్రకటనలు కూడా ఇచ్చి.. ఆ తర్వాత కొద్దిసేపటికే గ్రూపుల్లో ప్రకటనలు తొలగించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ మెసేజ్ లను తొలగించడం వెనుక హై కమాండ్ ఆదేశాలు ఉన్నాయని భావిస్తున్నారు. వర్గీకరణపై పాజిటివ్ గాను.. నెగిటివ్ గాను ఎలాంటి కాంట్రవర్శి చేయొద్దని రాష్ట్ర నాయకత్వానికి హైకమాండ్ సూచనలు చేసినట్లు పొలిటికల్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
వర్గీకరణ అంశంపై పాజిటివ్ గా మాట్లాడితే.. మిగతా వర్గాలకు అది నెగెటివ్ అయ్యే అవకాశం ఉండటంతో.. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. అందుకే నేతలు సైలెంట్ గా ఉండాలని దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. అగ్ర నాయకత్వం ఆదేశాలతో వెంటనే కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారని అంటున్నారు. వర్గీకరణ అంశంపై ఏ ఒక్క నేత మాట్లాడకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read: అడవుల్లో అడ్డగోలు దందా! డెక్కన్ సిమెంట్స్‌కు రూల్స్ పట్టవా?
వర్గీకరణ అంశం ఒక సామాజిక సమస్య కావడంతో.. ఆ విషయాన్ని రాజకీయ కోణంతో చూడొద్దని స్పష్టం చేసినట్టు టాక్ నడుస్తోంది. వర్గీకరణపై సుప్రీం తీర్పుతో ఎవరికైనా అన్యాయం జరుగుతుందని భావిస్తే.. వారిపై కేంద్రం సానుకూలంగా స్పందించి న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉందనే భరోసాను కల్పించాలని సూచనలు చేసినట్టు చెబుతున్నారు. దాంతోనే అప్పటికే స్టేట్‌మెంట్ ఇచ్చిన ఒకరిద్దరు నేతలు కూడా వెనక్కు తగ్గారని స్పష్టం అవుతోంది.
సంకీర్ణ భాగస్వాముల మధ్య ఈ వ్యవహారం కుదిపేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పును కేంద్రంలో కీలక మిత్రపక్షమైన టీడీపీ స్వాగతిస్తుండగా.. మరో భాగస్వామి లోక్ జన్ శక్తి పార్టీ మాత్రం వ్యతిరేకిస్తోంది. దీనిపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసేందుకు కూడా సిద్దమవుతోంది. అలానే వర్గీకరణ ప్రకటనతో మాల సామాజిక వర్గం నిరసన తెలుపుతోంది. ఎస్సీల వర్గీకరణ ఆపాలని డిమాండ్ చేస్తోంది. దీంతో బీజేపీ పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్నట్టు ఉందని చర్చ జరుగుతోంది.