Personal Financial Health: ఐఫోన్ ఒక బ్రాండ్. అది చేతిలో ఉంటే స్టేటస్ మారిపోతుంది. అందుకే ఐఫోన్‌ను జేబులో పెట్టుకోవడం కంటే ఎక్కువగా చేతిలో పట్టుకోవడానికి ఇష్టపడతారు. ఐఫోన్ ఒక స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. ఒకప్పుడు రిచ్ క్లాస్ ఈ ఫోన్లు కొనేవాళ్లు. ఇప్పుడు ఈఎంఐలు కల్పించిన అవకాశాలతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారు కూడా ఐఫోన్ మోజు తీర్చుకుంటున్నారు. ఈఎంఐలు పెట్టి మరీ ఖరీదైన ఐఫోన్లు కొనేస్తున్నారు.
ఒకప్పుడు ధనికులు మాత్రమే కొనుగోలు చేసే ఈ ఐఫోన్లను ఈఎంఐలు దాదాపు అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఉదాహరణఖు రూ. 79,700 విలువైన ఐఫోన్ 14ను యాపిల్ స్టోర్‌లో రూ. 9,404 ఈఎంఐతో సొంతం చేసుకోవచ్చు. ఇక అమెజాన్‌లో మరింత తక్కువ రూ. 3,746 ఈఎంఐతోనే పొందొచ్చు. ఈ మొత్తాన్ని కాలేజీ స్టూడెంట్ కూడా తన పాకెట్ మనీతో చెల్లించి ఐఫోన్‌ను కైవసం చేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీతోనే భారత్‌లో కేవలం నాలుగేళ్లలోనే యాపిల్ సంస్థ నాలుగు రెట్ల సేల్స్ పెంచుకుంది. లగ్జరీ ఐటమ్స్‌ను కూడా దిగువ మధ్యతరగతి ప్రజలకు ఈఎంఐ విధానం అందిస్తున్నదని సంతోషించవచ్చు. కానీ, వ్యక్తిగతంగా ఈఎంఐలు గుదిబండగా మారకుండా చూసుకోవాల్సిన అవసరముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈఎంఐలు లగ్జరీ పరికరాలను చేతికి అందిస్తున్నా.. ఈఎంఐలు మాత్రం కొరడా ఝుళిపిస్తు్న్నాయి. నెల మారగానే ఈఎంఐల బెదురు ఎదురుపడుతున్నది. ఇది ఒకరకంగా ఆర్థిక స్వేచ్ఛను కొల్లగొడుతున్నది. నెలల తరబడి.. కొన్నిసార్లు ఏడాది దాటి మరీ ఈఎంఐలు కడుతూ పర్సనల్ ఫైనాన్షియల్ హెల్త్‌ను పాడుచేసుకుంటున్నవారున్నారు. ఇంత సీరియస్‌గా దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే.. మన దేశంలో 70 శాతం ఐఫోన్లు ఈఎంఐలపైనే అమ్ముడుపోతున్నాయి. అంటే.. వీరంతా ఏకకాలంలో ఐఫోన్‌ను కొనుగోలు చేసే పరిస్థితిలో లేరు. ఈఎంఐ పెట్టి.. వడ్డీ చట్రంలో ఇరుక్కుపోతున్నారు. ఈఎంఐలు తీరే వరకూ ఆ మానసిక, ఆర్థిక భారాన్ని మోస్తున్నారు. ఇది కేవలం ఐఫోన్లకే పరిమితమైన విషయం కాదు.
Also Read: TPCC Chief: టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన మహేశ్ కుమార్ గౌడ్
అమెరికాలో ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్ కొనుగోలు చేయాలంటే.. వారు కేవలం 21 రోజుల సేవింగ్స్ ఖర్చు పెడితే చాలు. కానీ, మన ఇండియాలో పరిస్థితి వేరు. ఇక్కడ 218 రోజుల సేవింగ్స్ చెల్లించాల్సి వస్తుంది. కొందరికి సంవత్సరంపైనే పట్టొచ్చు. ఇది వారి పర్సనల్ ఫైనాన్స్ పై తీవ్ర భారాన్ని వేస్తున్నది. చాలా మంది భారతీయులు లగ్జరీ వస్తువుల కోసం నెలల తరబడి ఈఎంఐలు కడుతున్నారు. ఈ లగ్జరీ వస్తువులు నిజంగా అత్యవసరమా? ఒక పరికరం కోసం మన ఆదాయంలోని సింహభాగం ఖర్చు పెట్టడం క్షేమకరమేనా? అనే చర్చ జరుగుతున్నది. ఒక వైపు ఆర్థిక భారం.. మరోవైపు ఈఎంఐలు ముగిసేవరకు ఉండే మానసిక ఒత్తిడి.. ఒక్క లగ్జరీ వస్తువు కోసం అవసరమా? నిజానికి మన వ్యక్తిగత స్వేచ్ఛను మించిన విలువైన వస్తువులేవీ లేవనే వాదనలు వినిపిస్తు్న్నాయి.
హాలీవుడ్ కల్ట్ ఫిలిమ్ ఫైట్ క్లబ్‌లో టైలర్ డర్డన్ ఈ స్థితిని అద్భుతమైన డైలాగ్‌తో వివరిస్తాడు. ‘మనకు ఇష్టమే లేని మనుషులను ఇంప్రెస్ చేయడానికి.. లేని డబ్బు పెట్టి, మనకు అవసరమే లేని వస్తువులను కొంటుంటాం’ అని చెంపపై వాయించినట్టుగా బ్రాడ్ పిట్.. ఎడ్వర్డ్ నోర్టన్‌కు వివరిస్తాడు. ఇది మెటీరియలిస్టిక్ వరల్డ్‌ను క్రిటిసైజ్ చేస్తూ చెప్పిన మాట. కానీ, ఈ డైలాగ్ మాత్రం యూనివర్సల్. ఎవరైనా ఈ డైలాగ్‌ను ఆలోచించి హెచ్చరికగా తీసుకోవచ్చు.