TPCC Chief Mahesh Kumar Goud: తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఆదివారం ఆయన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. రేవంత్ రెడ్డి ఆయనకు బాధ్యతలను అప్పగించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర నలుమూలల నుంచి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం నార్సింగిలోని తన నివాసం నుంచి పెద్దఎత్తున వాహనాలు, వేలాది మంది కార్యకర్తలతో ఆయన గాంధీ భవన్ కు బయలుదేరారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు అసెంబ్లీ వద్ద ఉన్న గన్ పార్క్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా గాంధీ భవన్ కు మహార్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఆ ర్యాలీలో మహేష్ కుమార్ గౌడ్ తోపాటు ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ ఇంచార్జ్ కార్యదర్శులు, మంత్రులు, ముఖ్య నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
గన్ పార్క్ వద్ద కనీవినీ ఎరుగని రీతిలో ర్యాలీ
గతంలో ఎప్పుడూ లేని విధంగా ర్యాలీని నిర్వహించారు. పెద్ద ఎత్తున వాహనాలు, గుర్రాలు, ఒంటెలు, బగ్గీ వాహనాలు, ఆదివాసీల నృత్యాలు, బోనాలు, శివ సత్తుల ప్రదర్శనలతో అద్భుతమైన ప్రదర్శనలతో భారీ ర్యాలీని నిర్వహించారు.
Also Read: అనూహ్యంగా మెట్రో రైలులో ప్రయాణించిన మేయర్.. ఆమెను చూసి అంతా షాక్!
మహేశ్ కుమార్ గౌడ్ గురించి…
తెలంగాణ నాల్గవ పీసీసీ చీఫ్ గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను ఏఐసీసీ నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మహేష్ కుమార్ బీసీ గౌడ్ సామాజిక వర్గానికి చెందిన నేత. ఆయన స్వగ్రామం నిజామాబాద్ జిల్లాని భీంగల్ మండలం రహత్ నగర్ గ్రామం. డిగ్రీ వరకు చదువుకున్న మహేశ్ కుమార్ గౌడ్.. 2021 నుంచి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఆర్గనైజేషన్ ఇంచార్జీగా పార్టీకి ఆయన సేవలందించారు. ఆయన సేవలను గుర్తించి పార్టీ ఇటీవలే ఆయనకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా మండలిలో అవకాశం కల్పించింది.
అదేవిధంగా పలు పదవులను కూడా ఆయనకు పార్టీ హైకమాండ్ అప్పగించింది. 2013-14లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా పని చేశారు. 1986-1990 మధ్య నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్ యూఐ ప్రెసిడెంట్ గానూ పని చేశారు. 1990-98 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా, 1998-2000 మధ్య యువజన కాంగ్రెస్ కార్యదర్శిగానూ పని చేశారు.
Also Read: హైదరాబాద్ గణేశ్ నిమజ్జనాలపై దుష్ప్రచారం.. మంత్రి పొన్నం క్లారిటీ
2000-2003 మధ్య పీసీసీ సెక్రటరీగానూ పని చేశారు. 2012-2016 వరకు పీసీసీ అధికార ప్రతినిధిగా పని చేశారు. 2014 ఎన్నికల సమయంలో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2016-21 మధ్య టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గా కూడా మహేశ్ కుమార్ గౌడ్ పని చేశారు. బొమ్మ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులుగా ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తెలంగాణ స్పోర్ట్స్ కరాటే ప్రెసిడెంట్ గానూ మహేశ్ కుమార్ గౌడ్ కొనసాగుతున్నారు.