Fake Income Tax refund scam| ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైలింగ్ సీజన్‌లో సైబర్ మోసాల కేసుల సంఖ్య పెరుగుతున్నాయని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) హెచ్చరించింది. నకిలీ ఆదాయపు పన్ను రీఫండ్ మెసేజ్ లేదా ఈ మెయిల్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపింది. ఈ మోసపూరిత మెసేజెలు నిజమైనవిగా కనిపించడం వల్ల చాలా మంది మోసపోతున్నారు. అందువల్ల ప్రతి పన్ను చెల్లింపుదారుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఈ సైబర్ మోసగాళ్లు తమను ఆదాయపు పన్ను శాఖ అధికారులుగా పరిచయం చేసుకుంటారు. ఎస్‌ఎంఎస్‌లు లేదా ఈమెయిల్స్ ద్వారా మీకు ట్యాక్స్ రీఫండ్ మంజూరైందని చెబుతారు. వెంటనే రీఫండ్ పొందాలని ప్రోత్సహించే మెసేజ్‌లు పంపిస్తారు. ఈ మెసేజ్ లేదా ఈ మెయిల్స్‌లలో “Claim Now” వంటి బటన్ లేదా అనుమానాస్పద లింక్ ఉంటుంది. ఆ లింక్‌పై క్లిక్ చేస్తే నకిలీ వెబ్‌సైట్ తెరుచుకుంటుంది. అది ప్రభుత్వ వెబ్‌సైట్‌లాగా కనిపించే నకిలీ వెబ్ సైట్. ఈ వెబ్ సైట్ మీ వ్యక్తిగత వివరాలు మీరు ఎంటర్ చేయగానే వాటిని మోసగాళ్లు దోచుకుంటారు.
నకిలీ వెబ్‌సైట్‌లు మీ బ్యాంకు ఖాతా వివరాలు అడుగుతాయి. అలాగే పాన్, ఆధార్ నంబర్లు నమోదు చేయాలని కోరుతాయి. కొన్ని సందర్భాల్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ కూడా అడుగుతాయి. వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP), డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ వివరాలను కూడా సేకరించడానికి ప్రయత్నిస్తాయి. ఈ సమాచారం లభించిన తర్వాత మోసగాళ్లు ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. అంటే ఈ వివరాలతో మీ బ్యాంక్ అకౌంట్‌లో నుంచి డబ్బు కాజేస్తారు.
ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఫోన్, ఎస్‌ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా ఓటిపిలను అడగరు. పాస్‌వర్డ్‌లు, డెబిట్ కార్డు క్రెడిట్ కార్డులపై ఉండే CVV నంబర్లు లేదా బ్యాంకింగ్ వివరాలు కూడా అడగరు. అలాంటి అభ్యర్థనలు వచ్చిన వెంటనే వాటిని అనుమానాస్పదంగా భావించాలి.
అనుకోకుండా ట్యాక్స్ రీఫండ్ వస్తుందని చెప్పే మెసేజ్‌లను వెంటనే నమ్మకూడదు. పాన్, ఆధార్ లేదా బ్యాంకు వివరాలు అడిగే లింక్‌లను తెరవకండి. OTP, పాస్‌వర్డ్ లేదా సివివి చెప్పాలని కోరే కాల్స్ వెంటనే తిరస్కరించండి. తెలియని నంబర్ల నుంచి వచ్చిన APK ఫైల్స్ లేదా అటాచ్‌మెంట్‌లను డౌన్‌లోడ్ చేయవద్దు. వీటిలో మీ ఫోన్ హ్యాక్ చేసే వైరస్ ఉంటుంది. వెంటనే డబ్బు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరించే కాల్స్ లేదా మెసేజ్‌లు వస్తే భయపడకండి. అవి మిమ్మల్ని బెదిరించడానికి మోసగాళ్లు చేసే కాల్స్. అందుకే జాగ్రత్తగా ఉండాలి.
ట్యాక్స్‌కు సంబంధించిన ప్రతి మెసేజ్‌ని ముందుగా ధృవీకరించండి. అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను మాత్రమే ఉపయోగించండి. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దు. వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. వెబ్‌సైట్ చిరునామాను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మాత్రమే వివరాలు నమోదు చేయండి. సైబర్ మోసాల గురించి ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి.
Also Read: Indian Army Jobs: ఆర్మీ లా ఆఫీసర్ జాబ్స్.. ఏడాదికి రూ.17 లక్షలకు పైగా సాలరీ
సైబర్ మోసం జరిగినట్లు అనుమానం వచ్చిన వెంటనే చర్యలు తీసుకోవాలి. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి. అలాగే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి. త్వరగా ఫిర్యాదు చేస్తే ఆర్థిక నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది.
ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో నకిలీ ట్యాక్స్ రీఫండ్ మోసాలు ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి ప్రతి మెసేజ్‌ని అధికారిక వనరుల ద్వారా ధృవీకరించాలి. అప్రమత్తంగా ఉండటం ద్వారా మీ డబ్బు, వ్యక్తిగత సమాచారం రెండింటినీ సురక్షితంగా కాపాడుకోవచ్చు.
Also Read: నెలకు రూ.10 లక్షల వరకు జీతం.. ప్రపంచమంతా తిరిగిరావొచ్చు.. ఇంటర్మీడియట్ ఉంటే చాలు