Pacific Ocean: బంగారం-వెండి భూమిపైనే కాదు.. సముద్ర గర్భంలో ఉన్నాయా? భారీ స్థాయిలో బంగారం-వెండి నిక్షేపాలను కనుగొన్నారా? రానున్న రోజుల్లో విలువైన లోహాల కొరత తీరినట్టేనా? ఇంకీ చైనా శాస్త్రవేత్త్రలు ఎక్కడ ఆ నిక్షేపాలను కనుగొన్నారు? ఆ సంపద ఎవరికి చెందుతుంది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఖనిజ నిధిని కనుగొన్నారు చైనా శాస్త్రవేత్తలు. వారు చేపట్టిన పరిశోధనల్లో అత్యంత విలువైన బంగారం, వెండి నిక్షేపాలు భారీగా ఉన్నట్లు గుర్తించారు. భూమిపై లభించే గనులతో పోలిస్తే బంగారం, వెండి నిల్వలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు మాంచి క్వాలిటీ కూడా ఉన్నట్లు తేలింది. సింఘువా యూనివర్సిటీ-షాంఘై జియావో టాంగ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు జియాంగ్ యాంగ్ హాంగ్ 10 అనే నౌకలో పసిఫిక్ మహాసముద్రంలో పరిశోధన చేపట్టారు. ఆగష్టు 10 నుంచి బయలుదేరి మొత్తం 18 రోజులపాటు ఈ పరిశోధన సాగింది.
అది పశ్చిమ పసిఫిక్‌లోని చైనా ప్రత్యేక ఆర్థిక మండలం పరిధిలో ఉన్న బ్యాక్-ఆర్క్ బేసిన్‌లో ఏడు ప్రోబ్ డైవ్‌లను నిర్వహించింది. వారు సేకరించిన నమూనాలను నౌకలోని ల్యాబ్‌లో విశ్లేషించారు. అందులో ఆశ్చర్యపరిచే విషయాలు బయటపడ్డాయి. ఖనిజాల్లో ప్రతి టన్నుకు 15.4 గ్రాముల వరకు బంగారం ఉన్నట్లు తేల్చారు. అదే వెండి అయితే 1,271 గ్రాములు ఉన్నట్లు తేలింది. కేవలం బంగారం, వెండితో పాటు రాగి, ఇనుము, జింక్ వంటి ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉన్నట్లు తేల్చారు.
మరో విషయం ఏంటంటే.. సముద్ర గర్భంలో అధిక-ఉష్ణోగ్రత హైడ్రోథర్మల్ క్షేత్రాన్ని గుర్తించారు. 700 నుంచి 1,500 మీటర్ల లోతులో ఈ థర్మల్ క్షేత్రం ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో సముద్రం నీటి ఉష్ణోగ్రత 315 డిగ్రీల సెల్సియస్‌కు ఉన్నట్లు వెల్లడించారు. మూడు పెద్ద శంఖ ఆకార నిర్మాణాలతో ఉన్న ఈ క్షేత్రం.. భవిష్యత్తులో ప్రపంచ స్థాయి సముద్ర గర్భ నిక్షేపంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు.
ALSO READ: 1980 నుంచి 2026 వరకు.. తులం బంగారం ఎంత పెరిగిందో తెలుసా? లెక్కలు చూస్తే షాకే!
చైనా ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలో ఈ నిక్షేపాలు ఉన్నట్లు చెబుతున్నారు. పూర్తి స్థాయిలో అంచనా వేయడానికి 2027లో సర్వేలు చేపట్టాలని డిసైడ్ అయ్యింది చైనా. లోతులో ఉన్న హైడ్రో థర్మల్ క్షేత్రాల నుంచి ఖనిజాలను వెలికితీయడం సాంకేతికంగా చాలా క్లిష్టమైన ప్రక్రియగా చెబుతున్నారు. ఈ తరహా మైనింగ్ కార్యకలాపాలు ప్రపంచంలో ఎక్కడా జరగడం లేదని అంటున్నారు.