Rain Alert AP: నైరుతి రుతుపవనాల తిరోగమనంపై కీలక ప్రకటన చేసింది భారత వాతావరణ శాఖ. ఈ వారం చివరినాటికి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది ఐఎండీ. మరోవైపు బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడింది. దీని కారణంగా రానున్న రెండు రోజుల్లో అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దేశ వ్యవసాయ రంగానికి జీవనాధారం రుతుపవనాలు. వాటి గురించి భారతీయ వాతావరణ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 19 నాటికి రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు ఉపసంహరణకు అనుకూలంగా పరిస్థితులు ఉన్నట్లు అంచనా వేసింది. కేరళ ద్వారా దేశంలోని నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వగా, రాజస్థాన్ నుంచి ఉపసంహరించుకుంటాయి.
నైరుతి రుతుపవనాల తిరోగమన నేపథ్యంలో రాజస్థాన్లో సెప్టెంబర్ 14 నుంచి 16 వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. సెప్టెంబర్ 19 నుంచి వాతావరణం పొడిగా మారుతుందని పేర్కొంది. అదే సమయంలో మరొక కబురు చెప్పింది. తూర్పు-దక్షిణ భారతంలో పలు ప్రాంతాలలో సెప్టెంబర్ 19 నుంచి 21 వరకు వర్షాలు పడే అవకాశం ఉందని తెలియజేసింది.
ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ విషయాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోంది. దీనికితోడు ఒడిశా- పశ్చిమబెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగళ, బుధవారాల్లో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని తెలిపింది. వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఆ సమయంలో పిడుగులు, ఈదురుగాలుల ఉంటాయని పేర్కొంది.
ALSO READ: నెల్లూరులో చెత్త నిధులపై మాటల యుద్ధం.. సవాల్ విసిరిన వైసీపీ.. తిప్పికొట్టిన కూటమి!
చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండకూడదని, పొలాల్లో పనిచేసే రైతులు సురక్షిత ప్రాంతాల్లో వెళ్లాలని తెలియజేసింది. గడిచిన రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కాస్త ఊరట ఇచ్చాయి. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయన్న అంచనాతో రైతుల్లో ఆనందం మొదలైంది. జూన్ నెలలోనే నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చినా ఎల్ నినో కారణంగా సరైన వర్షాలు పడలేదు. దీంతో అందరి దృష్టి బంగాళాఖాతం వైపు పడింది.