Delhi: ముందస్తు బుకింగ్ డ్రైవర్ టిప్‌ను నిలిపివేయాలని క్యాబ్ అగ్రిగేటర్లను ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. ఈ పద్దతి తప్పుదోవ పట్టించేది ఉన్నట్లు వర్ణించింది ప్రభుత్వం. అంతేకాదు అన్యాయమైనదిగా పేర్కొంది. అనుచితమైన పద్ధతులకు పాల్పడినందుకు రాపిడోపై రూ.10 లక్షల జరిమానా విధించిన నేపథ్యంలో ఈ చర్య చేపట్టింది. అసలు మేటరేంటి?
ఏదైనా రైడ్ బుక్ చేసుకునే క్రమంలోనే టిప్ చెల్లించే విధానానికి ఫుల్ స్టాప్ పెట్టాలని క్యాబ్ అగ్రిగేటర్లను ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పద్ధతి వినియోగదారులను తప్పుదోవ పట్టించేదిగా ఉందని ఆమె అభివర్ణించారు. ఇది అన్యాయమైన వ్యాపార పద్ధతి అని తేల్చేశారు. రైడ్ నిర్ధారణ కాకముందే అడ్వాన్స్ టిప్‌ని ప్రాంప్ట్ చేయడంపై జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌కు ఇటీవలకాలంలో ఫిర్యాదులు వరుసగా వెల్లువెత్తుతున్నాయి.
టిప్ పే చేయకుంటే రైడ్ నిర్ధారణ కాదన్న భయం వినియోగదారుల్లో మొదలైంది. దీనిపై లోతైన విచారణ జరిపిన తర్వాత ‘బిల్ట్ ఇన్ వ్యవస్థ’ను తొలగించాలని రవాణా సేవల అందించేవారిని ఆదేశించారు. టిప్ అనేది.. రైడ్ పూర్తయిన తర్వాత వినియోగదారుని ఇష్టానికి వదిలేయాలి. ఈ తరహా విషయాలు.. ఊబర్, ఓలాపై విచారణ కొనసాగుతోందన్నారు. అనైతిక వ్యాపార పద్ధతులను అవలంభిస్తూ ముందస్తు టిప్ చెల్లించేలా వినియోగదారుడిని ప్రేరేపిస్తున్నందుకు ర్యాపిడో ప్లాట్ ఫాం యాజమాన్య సంస్థ రొప్పెన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.10 లక్షల జరిమానా విధించింది. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన ఒక రోజు తర్వాత ఖరే ఈ వ్యాఖ్యలు చేశారు.
ALSO READ: యుపిఐ పేమెంట్స్‌పై ఫ్లాట్ MDR.. పెట్రోల్, రైల్వే, ఇన్‌సూరెన్స్ రంగాలకు కొత్త రూల్స్
రాపిడో అల్గోరిథం ఛార్జీలను నిర్వహించే విధానాన్ని నియంత్రణ సంస్థ తప్పుబట్టింది. కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ- సీసీపీఏ.. క్యాబ్, బైక్, ఆటో రవాణా సేవల అనుసంధానకర్తల ప్లాట్ ఫాంల వ్యాపార పద్దతులను లోతుగా పరిశీలన చేస్తోంది. ప్రీ రైడ్ టిప్పింగ్ పద్ధతులపై అధ్యయనం చేసింది. ఊబర్, ఓలా, ర్యాపిడో వంటి పలు ప్లాట్ ఫాంలకు నోటీసులు జారీ చేసింది. ప్రివెన్షన్, రెగ్యులేషన్ ఆఫ్ డార్క్ పాటర్న్స్-2026 గైడ్‌లైన్స్‌ను తప్పనిసరిగా పాటించాలని అందులో సూచన చేసింది. డార్క్ ప్యాటర్న్‌లు అంటే వినియోగదారులను తప్పుదారి పట్టించడానికి రూపొందించిన మోసపూరిత చర్యలుగా పేర్కొన్నారు.