Indian Currency Facts: కరెన్సీ నోట్లను మనం ప్రతిరోజూ వాడుతుంటాం. కానీ దానిపై ఉండే డిజైన్లను ఎప్పుడైనా గమనించారా? ముఖ్యంగా పాత రూ.10 నోటును గమనిస్తే వెనుక భాగంలో ఏనుగు, ఖడ్గమృగం, పెద్ద పులి బొమ్మలు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే భూమిపై ఎన్నో జంతువులు ఉండగా.. ఈ మూడు జీవులనే నోటుపై చేర్చడం వెనుక ఓ ప్రత్యేక కారణమే ఉంది. అది ఏంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
పాత రూ.10 నోటుపై ఉన్న ఖడ్గమృగం అస్సాంలోని ప్రముఖ కాజీరంగా నేషనల్ పార్క్‌కు ప్రతీక. ప్రపంచవ్యాప్తంగా అరుదైన ఒంటికొమ్ము ఖడ్గమృగాలకు ఈ పార్క్ నిలయం. ఈ జంతువు.. ఈశాన్య భారత వన్యప్రాణి వైభవానికి ఒక ప్రముఖ గుర్తింపుగా నిలిచింది.
ఇక ఏనుగు దేశంలో అత్యంత ముఖ్యమైన, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన జంతువు. దీనిని భారత ప్రభుత్వం గతంలోనే ‘జాతీయ వారసత్వ జంతువు’గా గుర్తించింది. అడవుల పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ఏనుగుల పాత్ర అత్యంత కీలకమైనందున దాని ప్రాధాన్యత గుర్తిస్తూ రూ.10 నోటుపై ఆ జీవిని చేర్చారు.
పాత రూ.10 నోటు వెనుక ఉన్న జంతువులలో పెద్ద పులి (టైగర్) కూడా ఒకటి. మన జాతీయ జంతువైన పులి.. దేశ అటవీ సంపదకు, గంభీరత్వానికి, శక్తికి ప్రతీకగా నిలుస్తోంది. దీనికి ప్రతీకగా నోటుపై పెద్ద పులి బొమ్మను చేర్చారు. భారతీయ పర్యావరణ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న ఈ 3 క్రూరమృగాలు.. వన్యప్రాణుల వైవిధ్యం, వాటి సంరక్షణ ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికీ గుర్తుచేస్తున్నాయి.
ఇదిలా ఉంటే కాలక్రమంలో నోట్ల రూపరేఖలు మారాయి. 2018లో వచ్చిన కొత్త రూ.10 నోటుపై ఈ జంతువుల స్థానంలో ఒడిశాలోని ప్రముఖ ‘కోణార్క్ సూర్యదేవాలయం’ చిత్రాన్ని చేర్చారు. దీంతో అప్పటినుంచి కొత్త రూ.10 నోట్లపై వన్యప్రాణుల బొమ్మలు కనిపించకుండా పోయాయి.
Also Read: శాంసంగ్ A18 4G లాంచ్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, ఏఐ టూల్స్.. అదిరిపోయింది మామ!
కొత్త నోట్లు వచ్చినప్పటికీ పాత జంతువుల బొమ్మలున్న రూ.10 నోట్లు ఇప్పటికీ చెల్లుబాటులోనే ఉన్నాయి. అందుకే ఇప్పటికీ ఈ జంతువులను కరెన్సీ నోట్లపై తరుచూ చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉంటే మన దేశంలో కరెన్సీ నోట్లు లావాదేవీలకు మాత్రమే కాకుండా.. దేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వ కట్టడాలు, ప్రకృతి సంపదను ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక ప్రచార సాధనంగా ఉపయోగపడుతున్నాయని చెప్పవచ్చు.
Also Read: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.51 కే అపరిమిత 5G డేటా.. ఇది కదా ప్లాన్ అంటే!