జీఎస్టీ సంస్కరణలతో అటు ఉత్పత్తిదారులు, ఇటు వినియోగదారులు.. అందరూ లాభపడతారని అంటోంది కేంద్ర ప్రభుత్వం. ఆ స్థాయిలో జీఎస్టీ తగ్గింపులు ఉన్నాయని ఊరిస్తోంది. అయితే అనూహ్యంగా ఈ తగ్గింపుల వల్ల ఓ వర్గం నష్టపోయింది. తాత్కాలికమే అయినా జీఎస్టీ సవరణల వల్ల తమ ఉపాధి దెబ్బతిన్నదని వాపోతున్నారు ట్రక్కు డ్రైవర్లు. అసలు జీఎస్టీ సంస్కరణలకి, ట్రక్కు డ్రైవర్ల ఉపాధికి లింకేంటని అనుకుంటున్నారా? అయితే మీరే చదవండి.
కొనుగోళ్లు వాయిదా..
ఈనెల 22నుంచి జీఎస్టీ సంస్కరణలు, అంటే తగ్గిన జీఎస్టీ రేట్లు అమలులోకి వస్తాయి. అంటే ఆ తర్వాత వస్తువుల రేట్లు భారీగా తగ్గుతాయనే అంచనా ఉంది. దీంతో వస్తువులు కొనాలనుకున్నవారు తాత్కాలికంగా తమ అవసరాలను వాయిదా వేసుకుంటున్నారు. జీఎస్టీ ధరలు తగ్గిన తర్వాత కొనొచ్చులే అనుకుంటున్నారు. దీంతో వివిధ రకాల వస్తువులకు గిరాకీ తగ్గి అమ్మకాలు పడిపోయాయి. అమ్మకాలు పడిపోయాయి కాబట్టి గోడౌన్లనుంచి షాపులకు వస్తవులును చేరవేసే అవసరం కూడా తగ్గింది. అంటే రవాణా స్తంభించిందనమాట. అందుకే ట్రక్కు డ్రైవర్లు అవస్థలు పడుతున్నారు. గత వారంలో సరుకు రవాణా 30 నుంచి 35శాతం మేర పడిపోయింది. జీఎస్టీ సవరణలో నష్టపోతున్న ఏకైక వర్గం తమదేనంటూ బాధను వ్యక్తం చేస్తున్నారు ట్రక్కు డ్రైవర్లు.
ఖాళీగా ట్రక్కులు..
చెన్నైలోని తయారీ కేంద్రాల నుంచి భారతదేశం అంతటా కొన్ని కంపెనీలకు కార్లు, ఇతర వాహనాల రవాణా జరుగుతుంది. గతవారం రోజులుగా కార్ల రవాణా తగ్గుముఖం పట్టిందని ట్రక్కు డ్రైవర్‌లు చెబుతున్నారు. కంపెనీ ఉత్పత్తుల డెలివరీలు నిలిపేశారని, కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చే వరకు వేచి ఉండాలని రవాణా ఏజెన్సీలు చెబుతున్నాయని అన్నారు. ప్రస్తుతం 90శాతం ట్రక్కులు ఖాళీగా ఉన్నాయని లాజిస్టిక్స్ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. సరఫరాదారులు, రిటైలర్లు వస్తువుల ఇన్‌వాయిస్‌లను నిలిపేశారని అంటున్నారు. వాస్తవానికి దసరా సీజన్ లో వస్తువుల కొనుగోళ్లు భారీగా జరుగుతుంటాయి. కానీ ఈసారి మాత్రం జీఎస్టీ తగ్గింపుల నేపథ్యంలో అందరూ వాయిదా పద్ధతిలోకి వచ్చేశారు. జీఎస్టీ తగ్గింపు అమలులోకి వచ్చాక, సెప్టెంబర్ 22 తర్వాత కొనుగోళ్లకు వెళ్లొచ్చని అనుకుంటున్నారు. దీంతో సరకు రవాణా ఫ్లో తగ్గిపోయింది. ఆ ఫలితం ట్రక్కు డ్రైవర్ల ఉపాధిపై పడింది.
ఉందిలే మంచికాలం..
జీఎస్టీ అమలు తర్వాత సరుకు రవాణా పెరగడంతోపాటు, రేట్లు కూడా 30 నుంచి 40 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త జీఎస్టీలు అమలులోకి వస్తే సరకు రవాణా ఆర్డర్లు కూడా భారీగా పెరుగుతాయని తెలుస్తోంది. మొత్తానికి కొత్త జీఎస్టీ దాదాపు అన్ని రంగాలపై ప్రభావం చూపినట్టే అర్థమవుతోంది. దసరా సీజన్లో వస్తువుల కొనుగోళ్లు బాగా తగ్గిపోడానికి కారణం ఇదే. మరి జీఎస్టీ తగ్గింపు అమలులోకి వచ్చిన తర్వాత ఆమేర వినియోగదారులు లాభం పొందుతారా, లేక వ్యాపారస్తులే ఆ లాభాలను జేబులో వేసుకుంటారా? వేచి చూడాలి. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం లాభాలు వినియోగదారుల్ని చేరాలి. అలా కాకుండా రేట్లలో మతలబులు చేసి, ఆ లాభాలను తయారీదారులు, లేక వ్యాపారస్తులు కూడా స్వీకరించే అవకాశం ఉంది.