Nvidia: ప్రపంచ చరిత్రలో టెక్నాలజీ దిగ్గజం ఎన్విడియా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే 5ట్రిలియన్ డాలర్ల మార్కెట్ వాల్యుయేషన్‌ను చేరుకున్న మొట్టమొదటి కంపెనీగా నిలిచింది. కంపెనీ తయారుచేస్తున్న ఏఐ చిప్‌లకు భారీగా డిమాండ్ రావడంతో, సంస్థ షేర్లు బుధవారం భారీగా పెరిగాయి.
మూడు నెలల క్రితమే 4 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటింది ఎన్విడియా. ఇంత వేగంగా 5 ట్రిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరడం విశేషం. కంపెనీ $3 ట్రిలియన్ల నుండి $4 ట్రిలియన్లకు చేరడానికి ఎన్విడియాకు 13 నెలలే పట్టింది. బుధవారం మార్కెట్ ప్రారంభంలోనే కంపెనీ షేర్లు 3% పెరిగాయి. ఈ 2025 సంవత్సరంలోనే ఎన్విడియా స్టాక్ సుమారు 50% లాభపడింది.
READ ALSO: Amazon layoffs: అమెజాన్‌లో ఉద్యోగాల కోత.. 30 వేల మందిపై వేటు? మేనేజర్లకు ఈ-మెయిల్స్
తమ చిప్స్ సెల్ టవర్ల నుండి రోబోటిక్ ఫ్యాక్టరీల వరకు అన్నింటిలో ఉంటాయని వాషింగ్టన్‌లో జరిగిన జీటీసీ ఏఐ కాన్ఫరెన్స్‌లో సీఈఓ జెన్సన్ హువాంగ్ అన్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హువాంగ్ ప్రశంసలు కురిపించారు. ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య చర్చల ఆశలు, చైనా మార్కెట్‌ను ఎన్విడియా హై-ఎండ్ ఏఐ చిప్‌లకు తెరిచే అవకాశాలు ఈ తాజా పెరుగుదలకు కారణంగా నిలిచాయి.
మరో టెక్ దిగ్గజం ఆపిల్ కూడా మంగళవారం 4 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఎన్విడియా ఇటీవల ఏఐ లీడర్ ఓపెన్‌ఏఐతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఓపెన్‌ఏఐ బిలియన్ల డాలర్ల విలువైన చిప్‌లను ఓపెన్ ఏఐ కొనుగోలు చేయనుండగా, ఎన్విడియా ఓపెన్‌ఏఐలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. అలాగే ఇంటెల్ కంపెనీలో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడిని కూడా ఎన్విడియా ప్రకటించింది.
ఎన్విడియా ప్రస్థానం:
ఎన్విడియా 1993లో స్థాపించబడిన ఒక అమెరికన్ టెక్నాలజీ కంపెనీ. దీని వ్యవస్థాపకులు జెన్సన్ హువాంగ్ (CEO), క్రిస్ మలాచోవ్‌స్కీ, కర్టిస్ ప్రీమ్. ఇది కంప్యూటర్ గేమింగ్ కోసం గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లను తయారు చేస్తూ ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఈ GPUలే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, సూపర్ కంప్యూటింగ్ రంగాలలో కీలకంగా మారాయి. ఏఐ చిప్ మార్కెట్‌లో కంపెనీని అగ్రగామిగా నిలబెట్టాయి.