 
					Warangal:వరంగల్ లో కుంటలు, చెరువుల కబ్జాపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో సీఎం వరంగల్లో పర్యటించారు. హెలికాప్టర్‌లో ఏరియల్ వ్యూ నిర్వహించారు. వరంగల్ లోని పలు కాలనీల్లో కాలినడకన కలియతిరిగారు. అనంతరం హన్మకొండ కలెక్టరేట్లో అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. కబ్జాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. పది మంది కబ్జాలవల్ల ప్రజలు బాధితులుగా మారొద్దని అన్నారు. ప్రతీ సంవత్సరం వరదలొస్తాయి, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అధికారుల తీరుతో ఓరుగల్లుకు ముంపు సమస్య పెరిగిందన్న సీఎం.. ఇరిగేషన్, మున్సిపల్ శాఖల సమన్వయ లోపంతో వరద నియంత్రణ గాడి తప్పిందన్నారు. డ్రైనేజ్ ల డిసిల్టేషన్ అంశంలో రెండు శాఖలు మౌనం వహించాయన్నారు. అధికారుల నిర్లక్యంతో నగరవాసులు బాధితులుగా మారారని అన్నారు.
‘‘వరద ప్రభావంపై పూర్తి నివేదికలు ఇవ్వాలి. క్షేత్ర స్థాయిలో అధికారులు విజిట్ చేయాలి. ప్రజాప్రతినిధుల సహకారం అధికారులు తీసుకోవాలి. పూర్తి నివేదికలు వస్తె కేంద్ర ప్రభుత్వానికి పరిహారం కోసం రిక్వెస్ట్ పంపిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు కేంద్ర నిధులు కూడా తెచ్చుకుందాం. గతంలో కేంద్ర నిధులు వాడుకోలేదు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకోం. ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఇండ్లు, పంటలు, పశువుల నష్టంపై పూర్తి నివేదిక కావాలి.’’ అని అధికారులను ఆదేశించారు.
Read Also: Hydra: రూ. 30 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ పై ఇరిగేషన్ శాఖ సంసిద్ధంగా ఉండాలని సీఎం అధికారులకు సూచించారు. అన్ని శాఖలు ఇరిగేషన్ శాఖతో సమన్వయం చేసుకోవాలని, శాఖల మధ్య సమన్వయం లేక సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు. ‘‘ చెరువుల ఇన్ఫ్లో, ఔట్ ఫ్లో పై లెక్కలు పక్కాగా ఉండాలి. నాళాల కబ్జాపై ఉక్కు పాదం మోపాలి. ఎవరు ఉన్నా ఆక్రమణలపై వెనక్కి తగ్గేది లేదు. ఒక్కరి వల్ల వందల మంది ఆగం కావద్దు. డిజాస్టర్ మేనేజ్మెంట్ పై ప్రత్యేక ప్రణాళిక ఉండాలి. విపత్తుల వల్ల మరణిస్తే 5లక్షలు పరిహారం ఇవ్వాలి. పంట నష్టంపై ఎకరానికి 10 వేలు ప్రకటిస్తున్నా. ఇసుక మేటలు వేసిన పొలాల్లో ఎన్ఆర్ఈజీఎస్ కింద పనులు చేయాలి. ఇండ్లు డ్యామేజ్ అయిన వాళ్ళకు 15వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. ఇండ్లు కోల్పోయిన వాళ్ల లిస్ట్ సిద్ధం చేసి ఇండ్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. మున్సిపల్, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయ లోపంతోనే ముంపు తీవ్రత పెరిగింది. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చూసుకోవాలి.’’ అని సీఎం రేవంత్ తెలిపారు.
మున్సిపల్ కార్మికులకు సీఎం భరోసా:
ఈ పర్యటనలో భాగంగా ఆయన మున్సిపల్ కార్మికులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో కార్మికులు తమ దీనస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, వరంగల్ నగరం సాధించిన అభివృద్ధి వెనుక మున్సిపల్ కార్మికుల సేవలు ఎంతో గొప్పవని ప్రశంసించారు. నగరాన్ని శుభ్రంగా, సుందరంగా ఉంచడంలో వారి నిరంతర కృషిని ఆయన అభినందించారు.
తమకు వస్తున్న జీతాలు ఏమాత్రం సరిపోవడం లేదని, పెరుగుతున్న ధరలతో కుటుంబాలను పోషించడం చాలా కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమ వేతనాలు పెంచాలని సీఎంను కోరారు. కార్మికులు పడుతున్న ఇబ్బందులను సావధానంగా విన్న ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. కార్మికుల కష్టాన్ని ప్రభుత్వం తప్పకుండా గుర్తిస్తుందని, వారి న్యాయమైన డిమాండ్లను పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.