మార్కెట్లోకి IPO లు వస్తుంటాయి పోతుంటాయి. కొన్ని ఊహించినదానికంటే రెట్టింపు ఆకర్షణీయంగా కనపడతాయి. మరికొన్నిటికి అసలు డిమాండే ఉండదు. అప్లై చేసిన అందరికీ లాటరీ తగులుతుంది. అదంతా ఆ బ్రాండ్ వేల్యూపై ఆధారపడి ఉంటుంది. తాజాగా ఆ బ్రాండే వేల్యూతో మార్కెట్ లోకి అడుగు పెట్టింది టాటా క్యాపిటల్. మదుపరుల నుంచి రూ.15,500 కోట్లు (1.7 బిలియన్ డాలర్లు) సమీకరించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన ఐపీఓలలో ఇదే అతిపెద్ద కలెక్షన్ కావడం గమనార్హం.
హుండై రికార్డ్..
గతేడాది హుండై మోటార్ ఇండియా లిమిటెడ్ రికార్డు స్థాయిలో 3.3 బిలియన్ డాలర్లను ఐపీఓ ద్వారా సమీకరించింది. ఇది భారత దేశంలోని ఐపీఓలలో అతి పెద్దదిగా రికార్డ్ సృష్టించింది. ఆ తర్వాత అతిపెద్ద ఐపీఓగా టాటా క్యాపిటల్ రికార్డులకెక్కింది. రీసెంట్ టైమ్ లో టాటా క్యాపిటల్ ఐపీఓ గురించి గొప్ప ప్రచారం జరిగింది. టాటా బ్రాండ్ తోనే ఈ కంపెనీ అత్యధిక నిధుల్ని ఆకర్షించింది. టాటా క్యాపిటల్ ఇప్పటికే మనీ లెండింగ్ మార్కెట్ లో మంచి స్థానంలో ఉండటంతో ఈ కంపెనీపై జనాల్లో నమ్మకం కుదిరింది. అందుకే ఊహించినదానికంటే రెట్టింపు ప్రతిస్పందన వచ్చింది. కంపెనీ టార్గెట్ ని సునాయాసంగా రీచ్ అయింది.
షేర్ మార్కెట్ లో భారీ సందడి..
ఈ వారమే LG ఎలక్ట్రానిక్స్ కూడా షేర్ మార్కెట్ లోకి ఐపీఓ ద్వారా అడుగు పెడుతోంది. ఒకరోజు గ్యాప్ లో టాటా క్యాపిటల్ షేర్లు కూడా లిస్టింగ్ లోకి వస్తున్నాయి. ఈ రెండిటితో ఈ వారం మార్కెట్ కి మరింత ఊపు వస్తుందని అంటున్నారు. భారత్ లో పెట్టుబడుల సమీకరణకు కంపెనీలన్నీ ఇప్పుడు క్యూ కడుతున్నాయి. ఐపీఓలతో లిస్టింగ్ కు సిద్ధమయ్యాయి. అయితే ఈ పరిణామాలను మదుపరులు నిశితంగా గమనిస్తున్నారు. ప్రస్తుతం భారత్ ప్రపంచ నిధుల సేకరణ కేంద్రంగా మారుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో టాటా కూడా చేరింది. గత రెండేళ్లుగా ప్రపంచంలోనే ఎక్కువ ఐపీఓలు వస్తున్న మార్కెట్ గా భారత్ రికార్డ్ సృష్టించింది. పేరుగొప్ప కంపెనీలన్నీ ఐపీఓలతో రికార్డుల మోత మోగిస్తున్నాయి. అక్టోబర్ నెల ఇందులో అతి పెద్ద ఐపీఓలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. దాదాపు ఈ నెలలో 5 బిలియన్ డాలర్లను కంపెనీలు ఐపీఓల ద్వారా సేకరించాయి. బ్లూమ్‌బెర్గ్ నివేదికల ప్రకారం ఈ ఏడాది భారతదేశం ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద IPO మార్కెట్‌గా మారింది. ఈ ఏడాది మొదటి 9 నెలల్లో ఐపీఓల ద్వారా వివిధ కంపెనీలు సేకరించిన ఆదాయం 11 బిలియన్ డాలర్లుగా ఉంది. గతేడాది భారత ఐపీఓల మార్కెట్ విలువ 21 బిలియన్ డాలర్ల గరిష్ట మార్క్ ని తాకింది.
వారసత్వ పోరు ఉన్నా కూడా..
ఇక ఈ ఏడాది టాప్ ఐపీఓగా రికార్డుల కెక్కిన టాటా క్యాపిటల్ మార్చి చివరి నాటికి దాదాపు 1500 బ్రాంచ్ లను కలిగి ఉంది. ప్రపంచ, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులను ఇది ఆకర్షించింది. వాస్తవానికి రుణాల చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నా టాటా క్యాపిటల్ వంటి సంస్థలు మాత్రం ఈ రంగంలో నిలదొక్కుకుంటున్నాయి. అయితే టాటా గ్రూప్ లో వారసత్వ ఆధిపత్య పోరు కాస్త ఇబ్బంది కలిగించేలా ఉంది. రతన్ టాటా తర్వాత టాటా గ్రూప్ లో ఏ నిర్ణయం కూడా ఏకాభిప్రాయంతో కుదరడం లేదని అంటున్నారు. అయితే ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ టాటా క్యాపిటల్ సేఫ్ జర్నీ చేయడం విశేషం.