BJP: కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఫుట్ బాల్ పంచాయితీ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి చేరింది. రంగారెడ్డి జిల్లా రూరల్ అధ్యక్షుడితో పాటు వికారాబాద్ జిల్లా అధ్యక్షులను తొలగించాలని చేవెళ్ల ఎంపీ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొన్న జరిగిన ముఖ్య నేతల సమావేశంలో రాష్ట్ర నాయకత్వానికి కొండ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ లు సరిపోలేదా అనే చర్చ నడుస్తోంది. అసలు తన గ్రౌండ్ ను కబ్జా చేస్తున్నందుకే కొండ ఫుట్ బాల్ ను బీజేపీ కార్యాలయానికి తీసుకొచ్చారా?. ఇంతకు తన సొంత ఇలాకాలో కొండకి ఫుట్ బాల్ ఆడేందుకు గ్రాండ్ లేకుండా చేస్తున్న ఆ నేతలు ఎవరనేది హాట్ టాపిక్‌గా మారింది.
చేవెళ్ల బీజేపీ ఎంపీగా ఉన్న కొండ విశ్వేశ్వరరెడ్డి
కొండ విశ్వేశ్వర్‌రెడ్డి చేవెళ్ల బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు. గతంలో రాష్ట్ర బీజేపీలో రహస్య సమావేశాలు నిర్వహించిన దాంట్లో కొండ సైతం కీలక పాత్ర పోషించారనే టాక్ ఉంది. అంతేకాదు వివేక్, రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి లాంటి కీలక నేతలు పార్టీకి గుడ్ చెప్పినప్పటికీ కొండ మాత్రం పార్టికి గుడ్ బై చెప్పకుండా ఉన్నారు. ఆ తర్వత బిజెపి నుంచి చేవెళ్ల ఎంపీగా కొండ గెలుపొందారు. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. ఇప్పుడిప్పుడే కొండకి బీజేపీలో అసలు సినిమా కనిపిస్తుందనే చర్చ జోరుగా నడుస్తోందట.
కొండ అంటే ఫ్లవర్ అనుకున్నారా?.. ఫైర్ అంటున్న ఎంపీ
కొండ అంటే ఫ్లవర్ అనుకున్నారా.. ఫైర్ అంటున్నారట…కలిసి కూర్చొని మాట్లాడుకునే పరిస్థితులు లేవు…ఇదేం పార్టీ అంటూ సెటైర్లతో వార్నింగ్‌లు ఇస్తున్నారాయాన. కానీ, ఫైర్ ఫైర్ అంటే ఎట్లా ఇక్కడ కొండలను మింగే అనకొండలున్నాయనే సంగతి పాపం కొండకు తెలీదనే గుసగుసలు అయన వర్గాల్లో వినిపిస్తున్నాయట. ఇదంతా పక్కన పెడితే ఆయన ఇలాకలో ఆయనకే ఎసరు పెట్టే నేతలు రాష్ట్ర నాయకత్వంలో ఎవరున్నారు?.. అసలు ఆయన ఫుట్ బాల్ గ్రౌండ్ ను కభ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నదెవరు?.. కొండ విశ్వేశ్వరరెడ్డిని ఫుట్ బాల్ రాష్ట్ర కార్యలయానికి తీసుకొచ్చేలా చేసిందెవరు.. అన్న అంశాలు పార్టీలో చర్చనీయంశంగా మారాయి.
తాజాగా ముఖ్యనేతల సమావేశంలో ఫుట్‌బాల్ పంచాయితీ
అసలు కొండ ఆ ఫుట్ బాల్ ఎవరితో ఆడుదామని అనుకున్నారో కానీ తన ఇలాకాలో తన ఆటకు అడ్డుకట్ట వేయడానికి జరుగుతున్న కుట్రలు రాష్ట్ర కార్యలయం నుంచే జరుగుతున్నాయన్నంత కాన్ఫిడెన్స్‌తోనే ఫుట్ బాల్ పట్టుకొచ్చారట. ఇక తాజాగా రామచంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన ముఖ్యనేతల సమావేశంలో ఈ ఫుట్ బాల్ పంచాయితీపై కొండ మరోసారి చర్చకు తీసుకొచ్చారట.. ఇది ఇలాగే కొనసాగితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జరిగే పరిణామాలకు బాధ్యత మీరే వహించాలని స్వీట్ వార్నింగ్ లిచ్చి సమావేశం నుంచి వెళ్లిపోయారనే చర్చ జరుగుతోంది.
కొండా ఎపిసోడ్‌పై కమిటీ నియమించిన రాష్ట్ర నాయకత్వం
ఇక బీజేపీలో కొండకు తోడుగా ఉన్న నేతలంగా పార్టీకి గుడ్ బై చెప్పి సొంత గూడు కాంగ్రెస్‌కు వెళ్లారు. దీంతో కొండ బీజేపీలో ఒంటరిగా ఫుట్ బాల్ ఆడుకునే పనిలో బిజీబిజీగా గడుపుతున్నారట. పేరుకే ఎంపీ, కానీ పార్టీలో ఫుట్ బాల్ లెక్కన ఆడేసుకుంటున్నారట . ఉన్నఫలంగా కొండలో పుష్ప రేంజ్ లో ఫైర్ ను చూసి.. రాష్ట్ర నాయకత్వం కొండ ఫుట్ బాల్ నిరసన.. స్వీట్ వార్నింగ్‌లు.. అసహనాలపై రాష్ట్ర నాయకత్వం ఓ కమిటీ నియమించింది. ఈ పంచాయితీకి పులిస్టాప్ పెట్టేందుకు కమిటీ రంగంలోకి దిగింది. కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఫుట్ బాల్ పంచాయితీకి కారకులెవరు?.. రాష్ట్ర నాయకత్వంలో ఉన్నారా?.. లేక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నారా?.. ఏ విషయంలో కొండ హర్ట్ అయ్యారు? ఫుట్ బాల్ నిరసనలకు ఆజ్యం పోసిందెవరనే అంశాలపై కమిటీ ఆరా తీస్తుందట.
కమిటీ సమావేశం జూబ్లీహిల్స్ బైపోల్స్ తర్వాతకి వాయిదా
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలను రాష్ట్ర కార్యాలయానికి రావాలని పిలుపు నివ్వడంతో పెద్ద సంఖ్యలో బహిరంగ సభకు వచ్చినట్టు వచ్చారట. తక్షణమే వికారాబాద్, రంగారెడ్డి రూరల్ అధ్యక్షులను తొలగించాలంటూ మెజారిటీ క్యాడర్ కమిటీకి చెప్పినట్టు తెలుస్తోంది. 30, 40 ఏళ్ల నుంచి పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ పనిచేస్తున్న వారికి కాకుండా, అర్హత లేని రాజశేఖర్‌రెడ్డి, రాజ్‌భూపాల్‌గౌడ్‌లకు అధ్యక్ష పదవులిచ్చి మమ్మల్ని అవమానిస్తారా అంటూ క్యాడర్ కమిటీ పెద్దలపై ఫైర్ అయ్యారనే చర్చ జరుగుతోందట. అటు కొండ, ఇటు జిల్లాల అధ్యక్షుల మధ్యలో నలిగిపోతున్నామని క్యాడర్ కమిటీ ముందు ఆవేదన వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కుమ్ములాటలు పార్టీ పరువును తీస్తున్నాయని కమిటీ పెద్దలు తలలు పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు హాట్ హాట్ గా జరిగిన ఈ సమావేశంలో రెండు వర్గాలు తగ్గకపోవడంతో కమిటీ ఈ పంచాయితీనీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతకి పోస్ట్‌పోన్ చేసినట్టు తెలుస్తోంది.
Also Read: నోబెల్ శాంతి బహుమతి రేసులో డొనాల్డ్ ట్రంప్ కల నెరవేరేనా?
ఆలోపు ఉమ్మడి రంగా రెడ్డి జిల్లాలో ప్రధానంగా వికారాబాద్, రంగారెడ్డి రూరల్ అధ్యక్షుల పంచాయితీ పీక్ స్టేజీకి చేరుతుందనే టాక్ నడుస్తోంది. ఒకవేళ అదే జరిగితే కొండ విశ్వేశ్వర్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే చర్చ జరుగుతుంది. వచ్చే కాలమంతా ఎన్నికల కాలం, ఇలాంటి నేపథ్యంలో సంస్థాగతంగా రచ్చ రేపుతున్న సవాళ్లను సద్దుమణిగించకపోతే రాబోవు కాలంలో గడ్డు కాలం తప్పదంటున్నారు. మరి రాష్ట్ర పార్టీ నాయకత్వం దీన్ని ఎలా సెట్‌రైట్ చేస్తుందో చూడాలి.
Story By Vamshi Krishna, Bigtv