Telangana Politics: కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి కావల్సిన లక్షణాలు తనకు ఉన్నాయంటున్నారు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి. అలాంటాయన తాజాగా నేడు రాజకీయాలకు దూరం అంటున్నారు. జగ్గారెడ్డి ఏది చేసినా ఏమి చెప్పినా సెన్సేషనల్ అవుతుంది. జగ్గారెడ్డి మాట మాట్లాడితే కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలో సైతం రాజకీయ దుమారం లేగుస్తోంది. అలాంటి నేత నేడు రాజకీయాలకు దూరంగా ఉంటానని దసరా రోజు చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తోందట. జగ్గారెడ్డికి సడన్‌గా అంత వైరగ్యం ఎందుకు?
తాను పదేళ్లలో సీఎం అవుతానని ప్రకటించిన జగ్గారెడ్డి
ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి 2023 డిసెంబర్ జనరల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కామన్ కార్యకర్త కూడా ముఖ్యమంత్రి కావచ్చని విచిత్రమైన స్టేట్‌మెంట్ ఇచ్చారు. రాష్ట్రానికి తాను కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని, రానున్న 10 ఏళ్లలో ముఖ్యమంత్రి అవుతానంటూ ఆనాడు ఆయన చేసిన కామెంట్స్‌పై కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా పార్టీలో కూడా చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులుకు కూడా జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ అంతుచిక్కని ప్రశ్నగా మిగిలాయి. ఆ తర్వాత సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఓటమిపాలయ్యారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పరాజయం పాలైనప్పటికీ పార్టీ అధికారంలోకి రావడంతో యాక్టివ్‌గానే ఉంటూ వచ్చారు.
దసరా వేడుకల్లో జగ్గారెడ్డి సెన్షెషనల్ కామెంట్స్
ఓడిపోయిన నాటి నుంచి, ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా, కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలతో పాటు, పండుగలు పబ్బాలకు పేద ప్రజలకు అండగా ఉంటూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ వచ్చారు జగ్గారెడ్డి. అలాంటాయన దసరా వేడుకల్లో సెన్సేషనల్ కామెంట్ చేశారు. ఇకనుండి పది సంవత్సరాలు రాజకీయాలకు దూరంగా ఉంటానని, రానున్న ఎన్నికల్లో సంగారెడ్డి ఎమ్మెల్యేగా తన సతీమణి నిర్మల జగ్గారెడ్డిని పోటీలో దించుతానని ప్రకటించి, నియోజకవర్గ ప్రజలకు నిర్మలను పరిచయం చేశారు.
సంగారెడ్డికి చేయవలసిందంతా చేసిన జగ్గారెడ్డి
సంగారెడ్డి ప్రజలు తనకు మూడుసార్లుగా ఎమ్మెల్యే అవకాశం కల్పించారని, తాను వారికి చేయాల్సినంతా చేసి నియోజకవర్గాన్ని అభివృద్ది చేశానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై వెనకడుగు వేయకుండా, వారికి ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం ఉందన్నా అన్ని నెరవేర్చానన్నారు. ఆ క్రమంలో ఇకనుండి 10 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయంగా దూరం ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చానని, తన సతీమణి నిర్మలకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని కోరారు.
రాజకీయాల నుండి తప్పుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు?
రాష్ట్ర రాజకీయాల్లో వ్యూహాత్మకంగా వివరించే జగ్గారెడ్డి, రాజకీయాలకు దూరంగా ఉంటాననడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. ఆయన ఎందుకు అలా అన్నారు.. రాజకీయాల నుండి తప్పుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతుపట్టకుండా తయారైంది. ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఎమ్మెల్యే పదవి కూడా ఇప్పుడు తనకు అక్కర్లేదని, రానున్న ఎన్నికల్లో కూడా పోటీ చేయనని అంటున్నారు. అంటే జగ్గారెడ్డి మనసులో ఏం ఉందనేది రాజకీయ విశ్లేషకులకు కూడా అంతుచిక్కని ప్రశ్నగా ఉందట.
సమస్యల పరిష్కారానికి అధికారులతో సమీక్షలు..
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాల అమలులో, నియోజకవర్గానికి కావలసిన నిధులు తెప్పించడంలోనే రాష్ట్రంలోనే ముందుండేవారన్న పేరుంది. ఎమ్మెల్యే గా ఆ ప్రాంత ప్రజలు ఓడించినా ప్రజలకు వెన్నంటి ఉంటూ, ఆపద సమయంలో ఆదుకుంటూ, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు. అధికారులతో రివ్యూ సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తూ, తాగునీటి సమస్యపై, మున్సిపాలిటీ అభివృద్ధి, నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం డబుల్ బెడ్ రూముల ఫ్లాట్స్ కోసం అధికారులతో పాటు, జిల్లా కలెక్టర్ ఇతర శాఖ అధికారులతో సమన్వయంతో ముందుకు సాగుతూ వచ్చారు.
Also Read: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నేతలు..
ఇలాంటి సమయంలో జగ్గారెడ్డి రాజకీయాలకు దూరం అంటున్నారంటే .. అసలు ఏం జరుగుతుందని? ఆయనకి పార్టీకి, ప్రజలకు ఇంత చేసినా తనకు ఓటమి ఎందుకు ఎదురైందని మదన పడుతున్నారా…? అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
Story By Rami Reddy, Bigtv