“ఆకాశమంత ఎత్తైన కలలు కనాలి. వాటిని సాకారం చేసుకోవాలి” అంటారు దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం. ఆయన మాటలను అక్షరాలా నిజం చేశాడు అబ్దుల్ అలీమ్ అనే యువకుడు. అంతేకాదు, లక్షలాది మందికి ఆయన ఇప్పుడు ప్రేరణగా మారాడు. సాధించాలనే తపన బలంగా ఉంటే, ఉన్నత స్థాయికి ఎలా చేరుకోవచ్చు అనేది నిరూపించాడు అలీమ్. ఇంతకీ అబ్దుల్ ఎవరు? ఆయన ఎందుకు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
తాజాగా అబ్దుల్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. సెక్యూరిటీ గార్డుగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన జోహో కంపెనీలోనే.. ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం ప్రారంభించినట్లు వెల్లడించాడు. ఎడ్యుకేషన్ లో డిగ్రీ లేకపోయినా, తన దగ్గర ఉన్న చక్కటి స్కిల్స్ తో జోహోలో సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ ఇంజనీర్ గా ఉద్యోగం సంపాదించినట్లు చెప్పాడు. 2013లో కేవలం రూ. 1000తో ఇంటి నుంచి బయల్దేరాడు అబ్దుల్. అందులో రూ. 800 రైలు టికెట్లు కొనడానికే ఖర్చు అయ్యాయి. ఆ సమయంలో సరైన ఉద్యోగం లేదు. ఉండటానికి నివాసం లేదు. రెండు నెలల పాటు రోడ్డు మీదే గడపాల్సి వచ్చింది. ఆ తర్వాత జోహో ఆఫీస్ లో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం వచ్చింది. రోజూ 12 గంటల షిఫ్ట్ చేయాల్సి వచ్చేది. ఓ రోజు డ్యూటీలో ఉన్నప్పుడు ఆ కంపెనీలో సీనియర్ ఉద్యోగి అతడిని చూసి మాట్లాడాడు. ఆ సమయంలో అబ్దుల్ కొన్ని విషయాలు చెప్పాడు. “నేను స్కూల్ టైమ్ లో కొంచెం HTML నేర్చుకున్నాను అని చెప్పాను. అప్పుడు అతను నన్ను నేను మరింత నేర్చుకోవాలనుకుంటున్నానా? అని అడిగాడు. ఆ తర్వాత నేను అతడి సాకారంతో నేర్చుకోవడం మొదలు పెట్టాను” అని చెప్పుకొచ్చాడు.
తన షిఫ్ట్ అయిపోయిన తర్వాత సీనియర్ దగ్గరికి వెళ్లి HTML గురించి తెలుసుకునే వాడు. సుమారు 8 నెలల తర్వాత అబ్దుల్ ఏకంగా ఓ యాప్ క్రియేట్ చేశాడు. “నా 12 గంటల సెక్యూరిటీ షిఫ్ట్ పూర్తి చేసిన తర్వాత ప్రతిరోజు, సీనియర్ దగ్గరికి వెళ్లి HTML గురించి నేర్చుకున్నాను. దాదాపు ఎనిమిది నెలల తర్వాత, నేను ఒక చిన్న యాప్‌ను క్రియేట్ చేశాను. ఆ యాప్ ను మా సీనియర్ ఉద్యోగి మేనేజర్ కు చూపించాడు. అతడికి చాలా నచ్చింది. ఆ తర్వాత నన్ను సాఫ్ట్ వేర్ డెవలపర్ గా తీసుకున్నారు” అని చెప్పుకొచ్చాడు.
అబ్దుల్ అలీమ్ సాధించిన ఘతన పట్ల నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. “నేర్చుకోవాలనే తపన, సాధించాలనే లక్ష్యం ఉంటే కచ్చితంగా సక్సెస్ అవుతారని నిరూపించావు బ్రదర్. ఆల్ ద బెస్ట్” అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన విద్యార్థిగా, నీ స్టోరీ నాకు స్ఫూర్తినిచ్చింది. నాకు ఆశను కలిగించింది” అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చాడు. ప్రస్తుతం అలీమ్ సక్సెస్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: ఉద్యోగికి పొరపాటున 300 రెట్లు ఎక్కువ జీతం చెల్లించిన కంపెనీ, ఊహించని తీర్పు ఇచ్చిన కోర్టు!