US Fed Interest Rate: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ప్రభావం ఇప్పుడు భారతదేశంలో కనిపిస్తోంది. ఈ పెంపు డాలర్‌ను బలోపేతం చేసి, రూపాయిపై ఒత్తిడి పెంచుతుందని అంచనా. దీనివల్ల భారతదేశంలో విదేశీ పెట్టుబడులు, స్టాక్ మార్కెట్, ముడి చమురు, రుణ వ్యయంపై ప్రభావం పడవచ్చు.
అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్.. వడ్డీ రేట్లను పెంచింది. ప్రస్తుతమున్న రేట్లకు 25 బేసిస్ పాయింట్లు లేదా 0.25 శాతం మేరా పెంచింది. అమెరికాలో ఫెడరల్ ఫండ్స్ రేటు 3.75 నుంచి 4 శాతానికి చేరింది. మూడేళ్లకు కాలంలో ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం ఇదే మొదటిసారి. ఫెడ్ నిర్ణయం భారత్ పై పడే అవకాశముంది. భారత రూపాయి, విదేశీ పెట్టుబడులు, స్టాక్ మార్కెట్, బాండ్లు, ముడి చమురు ధరలపై ప్రభావం చూపనుంది. ఒక్కమాటలో చెప్పాలంటే అమెరికాలో పెరిగిన వడ్డీ రేట్లు పెట్టుబడి పెట్టడాన్ని మదుపరులకు మరింత ఆకర్షణీయంగా మార్చగలవు. ఫలితంగా విదేశీ పెట్టుబడిదారులు భారత్ మార్కెట్ల నుండి అమెరికాకు వెళ్లే అవకాశముంది.
2026లో భారత స్టాక్ మార్కెట్‌లో విదేశీ పెట్టుబడిదారులు భారీగా అమ్మకాలు జరుపుతున్నారు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్- NSDL డేటా ప్రకారం.. ఈ ఏడాది ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు భారత స్టాక్‌మార్కెట్ నుండి సుమారు రూ. 2.41 లక్షల కోట్లు ఉపసంహరించు కున్నారు.ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడంతో విదేశీ పెట్టుబడిదారుల నుండి అమ్మకాలకు పాల్పడవచ్చు. ఇది స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపనుంది. అమెరికా వడ్డీ రేట్లు డాలర్‌ను బలపరుస్తాయి. డాలర్ బలపడటంతో రూపాయిపై ఒత్తిడిని పెరుగుతుంది. ఒక డాలర్ కొనడానికి ఎక్కువ రూపాయలు ఖర్చు చేయాల్సి రావచ్చు.
ముడి చమురు, బంగారం వంటి అనేక వస్తువులకు డాలర్లలో చెల్లింపులు జరుగుతాయి. దేశంలో దాని ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం చూపవచ్చు. ఒకవేళ రూపాయి బలహీనపడి ముడి చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణానికి దారి తీయవచ్చు. దీనివల్ల దేశంలో దిగుమతుల బిల్లు కూడా పెరిగే అవకాశముంది. ఫెడ్ నిర్ణయంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిశితంగా గమనిస్తోంది. డాలర్ బలపడితే రూపాయి, విదేశీ మూలధనంపై ఒత్తిడిని నిర్వహించడంలో ఆర్‌బీఐకి మరింత సవాల్ కానుంది.
ALSO READ: ‘రూ.11 సెలైన్ బాటిల్ రూ.325 ధరకు విక్రయం.. ఆస్పత్రిలో ప్రజలను దోచుకుంటున్నారు’
ఒకవేళ ఆర్‌బిఐ వడ్డీ రేట్లను పెంచితే వ్యక్తులు, వ్యాపారాలపై నేరుగా ప్రభావం చూపుతుంది. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, వ్యాపార రుణాలపై వడ్డీ రేట్లను పెంచవచ్చు. దీనివల్ల ఈఎంఐలు పెరిగే అవకాశం ఉంది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భారత్‌లోని ఐదు రంగాలపై పడవచ్చు. రూపాయి, విదేశీ పెట్టుబడులు, స్టాక్ మార్కెట్, ముడి చమురు, రుణాల వ్యయం.