Dharmasthala Case Updates: ధర్మస్థల.. ఇప్పుడీ పేరు నేషన్ వైడ్‌గా తెలియని వారుండరు. అలాంటి కేసులో ఇప్పుడు ఓ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ నెలకొంది. వందల కొద్ది మృతదేహాలను తన చేతులతో పాతిపెట్టానని చెప్పిన విజిల్ బ్లోయర్ భీమాను.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇన్నాళ్లు ముసుగు వేసుకొని పోలీసుల వెంట వెళ్లిన ఆ వ్యక్తే.. తమను పిచ్చివాళ్లను చేసి కట్టుకథలను అల్లాడని తేలడంతో అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఇకపై మాస్క్ మ్యాన్ అసలు కథపై పోలీసులు ఫోకస్ చేయనున్నారు.
భీమా చెప్పినట్టు 15 ప్రాంతాల్లో తవ్వకాలు జరిపిన SIT
నిజానికి ఆ మాస్క్ మ్యాన్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారు. మొత్తం 15 ప్రాంతాల్లో 15 రోజులుగా తవ్వకాలు జరిపారు. కానీ అతను చెప్పినట్టుగా వంద మృతదేహాలు లభ్యం కాలేదు. ఆరో ప్రాంతంలో మాత్రం ఒక అస్థిపంజరం మాత్రం లభించింది. అది కూడా ఓ పురుషుడిదే. దీంతో అతను కట్టు కథలు చెప్పి పోలీసులను తిప్పలు పెట్టాడనే క్లారిటీకి వచ్చారు. దీంతో అసలు ఇప్పుడీ కట్టు కథ ఎందుకు చెప్పాడు? దీని వెనక ఎవరున్నారు? అనే దానిపై పోలీసులు విచారణ జరపనున్నారు.
భీమా చేసిందంతా డ్రామానే అంటున్న SIT
ఈ కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే.. 2003లో ధర్మస్థలలో తన కూతురు అనన్య భట్ మిస్ అయ్యిందంటూ ఆరోపణలు చేసిన సుజాత భట్ కూడా ఇప్పుడు ఈ ఆరోపణలను వెనక్కి తీసుకుంది. తాను చెప్పిందంతా కట్టుకథే అని.. ఈ కేసుతో సంబంధం ఉన్న కొందరు తనతో ఈ మాటలు చెప్పించారంటూ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తన కూతురు అని చెప్తున్న ఫోటోలు కూడా సృష్టించినవే అంటున్నారు ఆమె. ఇప్పుడు ఆమెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నిజానికి భీమా చేసిన ఆరోపణలు ఓ సంచలనం. 1995 నుండి 2014 మధ్య లైంగిక వేధింపులకు గురై వంద మందికిపైగా మహిళలు, పిల్లలను హత్య చేశారని.. వారిని తన చేతులతో పూడ్చి పెట్టానని చెప్పాడు. అంతేకాదు 2014లో తన కుటుంబంలోని ఓ యువతిని కూడా హత్య చేశారని ఫిర్యాదు కూడా చేశాడు. తనను పశ్చాతాపం వెంటాడుతోందని.. అందుకే ఈ వివరాలు చెబుతున్నానంటూ ప్రకటించాడు.
పోలీసులకే చుక్కలు చూపించిన భీమా..
భీమా ఇచ్చిన ఈ స్టేట్మెంట్ తర్వాత ఓ అలజడి చెలరేగింది. కర్ణాటక ప్రభుత్వం ఏకంగా ప్రణబ్ మహంతి నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత భీమా చెప్పిన ప్రతి చోట సిట్ అధికారులు తవ్వకాలు నిర్వహించారు. దీని కోసం అత్యాధునిక పరికరాలు కూడా తీసుకొచ్చారు. కానీ అతను చెప్పినట్టుగా ఏ ఆధారాలు లభించలేదు. ఈ సమయంలో భీమా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను కొన్ని మృతదేహాలను డే టైమ్‌లోనే పాతిపెట్టానని.. స్థానికులు చూసినా భయంతో ఎవరూ ప్రశ్నించలేదన్నాడు. మరి ఎక్కడా మృతదేహాలు లభించలేదన్న ప్రశ్నకి.. అడవి పెరిగింది, ఇక్కడ నిర్మాణాలు జరిగాయి కదా అంటూ బదులిచ్చాడు. తాను ధర్మస్థల ఖ్యాతికి ఎందుకు మచ్చ తీసుకొస్తాను? తాను కూడా హిందువూనే కదా అంటూ కూడా స్టేట్మెంట్స్ ఇచ్చాడు.
Also Read: ప్రిన్సిపాల్ మీద కోపంతో మంచినీళ్ల ట్యాంక్ లో పురుగుల మందు కలిపిన సైన్స్ టీచర్
ఎందుకీ డ్రామా.. భీమా ఎందుకిలా చేశాడు ?
ఓ వైపు ఈ తవ్వకాలు జరుగుతుండగానే అనేక మంది తెరపైకి వచ్చారు. ధర్మస్థలలో అరాచకాలు జరుగుతున్నాయని.. ఇక్కడ అనేకమంది మహిళలు గల్లంతయ్యారంటూ స్టేట్మెంట్లు ఇచ్చారు. ధర్మస్థల ఆలయ ధర్మాధికారి వీరేంద్ర హెగ్గడేను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేశారు. భీమా చేసిందంతా డ్రామానే అయితే.. అతను ఈ డ్రామాను ఎందుకు చేశాడు? ఎవరి కోసం చేశాడు? ఎవరు చెప్తే చేశాడు? సుజాత భట్‌ను సీన్లోకి తీసుకొచ్చింది ఎవరు? ఆమె చెప్పిన ఆ ఇద్దరు ప్రముఖులు ఎవరు? ఇదంతా ధర్మస్థల ఖ్యాతిని అపఖ్యాతిగా మార్చే కుట్రేనా? లేక వీరంద్రను టార్గెట్ చేస్తూ చేసిన పనా? అనే దానిపై ఇప్పుడు సిట్ అధికారులు ఫోకస్ చేశారు.