Dongs Attack Man: వీధికుక్కల దాడులు ఏమాత్రం తగ్గడం లేదు. మనుషులను చూడగానే కుక్కలు విచక్షణారహితంగా దాడి చేస్తున్నాయి. ఫలితంగా జనాలు బయటకు రావడానికి భయపడుతున్నారు.. ఒంటరిగా వ్యక్తి కనిపిస్తే చాలు వారిపై దాడి చేసి భయాందోళన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్‌లో జరిగింది. వీధి కుక్కల గుంపు ఓ వ్యక్తిపై దాడి సంచలనంగా మారింది. ఈ ఘటన సీసీ టీవీ కెమెరాలో రికార్డైంది.
జరిగింది ఇదే..
పింప్రి చించ్వాడ్‌లో ఉదయం ఓవ్యక్తి నడుచుకుంటూ వెళుతున్నాడు. అక్కడంతా చీకటి తన చేతిలో సెల్ఫోన్ చూసుకుంటూ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. ఇంతలో శబ్దం.. ఏకంగా ఏడు వీధి కుక్కలు అతని వైపుకు పరిగెత్తుకుంటూ వచ్చి అతనిపై దాడి చేశాయి. దీంతో భయాందోళన చెందిన ఆ వ్యక్తి అక్కడే వున్న బైక్ వద్దకు వెళ్ళి, బైక్‌ను వాటిపైకి నెట్టాడు. ఏ కుక్కకు గాయాలు కాలేదు. పైగా అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించగా అక్కడే వున్న ఒక చక్క బోర్డు సహాయంతో తన ప్రాణాలు రక్షించుకున్నాడు. కుక్కల అరుపులకు సమీపంలో నివసించే ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు వచ్చి కుక్కలను తరిమి కొట్టారు. దీంతో ఆ కుక్కలు చేసేది ఏమీలేక అక్కడి నుంచి పారిపోయాయి. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జరిగింది. దాడికి గురైన వ్యక్తి ఉదయం పనికి వెళ్తుండగా జరిగినట్లు తెలుస్తుంది. సంఘటన తర్వాత, స్థానికులు మున్సిపల్ కార్పొరేషన్ ఈ ప్రాంతంలో వీధి కుక్కల బెడదను నియంత్రించాలని డిమాండ్ చేశారు.
Also Read:Special Trains: పండుగకు వైజాగ్ వెళ్తున్నారా? అయితే, మీ కోసమే ఈ గుడ్ న్యూస్!
సుప్రీ కోర్టు ఆదేశాలు
రేబిస్ మరణాలకు దారితీసే వీధికుక్కల కాటు కేసుల పెరుగుదలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం కలకలం రేపుతుంది. గత వారం, ఢిల్లీ-ఎన్‌సిఆర్ పరిసర ప్రాంతాలలోని అన్ని వీధికుక్కలను నివాస ప్రాంతాల నుండి దూరంగా తరలించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, కుక్క కాటు కారణంగా రేబిస్ మరణాలు పెరుగుతున్నందున. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన జంతు ప్రేమికులు దీనిని సవాలు చేశారు. దీంతో శుక్రవారం సుప్రీంకోర్టు తన ఉత్తర్వును సవరించింది, వీధి కుక్కల అంశంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కలన్నింటికి టీకాలు వేయించి, డీవార్మింగ్ చేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచిపెట్టాలి. అయితే హింసాత్మకంగా ప్రవర్తించే కుక్కలు, రేబిస్‌తో బాధపడుతున్న కుక్కలు, అనారోగ్యంగా ఉన్న కుక్కలు మాత్రం షెల్టర్లకు తరలించాలి.
కుక్కలకు ఆహారం పెట్టొద్దు..
బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ కుక్కలకు ఆహారం పెట్టరాదని కోర్టు స్పష్టంగా ఆదేశించింది. దాని బదులు ప్రత్యేకంగా గుర్తించిన ప్రాంతాల్లోనే ఆహారం ఇవ్వాలని సూచించింది. ఈ నియమాన్ని ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని కూడా తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. అదే విధంగా, కుక్కలను పట్టుకునే అధికారుల పనిని ఎవరు అడ్డుకుంటే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కోర్టు హెచ్చరించింది. వ్యక్తిగతంగా అడ్డుకుంటే రూ.25,000 జరిమానా, స్వచ్ఛంద సంస్థ అడ్డుకుంటే రూ.2 లక్షల జరిమానా విధించాలని ఆదేశం ఇచ్చింది. ఒకవేళ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే వెంటనే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్‌ను ప్రారంభించాలని సుప్రీంకోర్టు సూచించింది. జంతు ప్రేమికులు కుక్కలను దత్తత తీసుకోవాలనుకుంటే, వారు మున్సిపల్ కార్పొరేషన్‌కి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.
ఇదే ఆ.. వీడియో చూడండి..