Konaseema Crime: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో బాలిక అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు శ్రీనివాస్ ను అరెస్టు చేశారు. ఈ నెల 4వ తేదీన ఫ్యాన్‌కు వేలాడుతూ చిన్నారి రంజిత మృతదేహం కనిపించింది. బాలిక సూసైడ్ చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. బాలికను హత్య చేసి ఆత్మహత్య అని ప్రచారం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ కేసుపై ముమ్మరంగా దర్యాప్తు చేసిన పోలీసులు మిస్టరీని ఛేదించారు. ఈ కేసు వివరాలను ఎస్పీ రాహుల్ మీనా ఆదివారం మీడియాకు వివరించారు.
ఈ నెల 4న అనుమానాస్పద రీతిలో మృతి చెందిన చిన్నారి రంజిత కేసును ఛేదించామని ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఆధారంగా చిన్నారిది హత్యగా నిర్ధారించామన్నారు. చిన్నారి ఇంటి కింద ఫ్లోర్ లో కోటి అనే యువకుడు జిరాక్స్ షాప్ నిర్వహిస్తున్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ లో పనిచేస్తున్న కోటి స్నేహితుడు శ్రీను తరచూ కోటి షాప్ నకు వచ్చి పనిచేస్తుండేవాడు. అయితే తాను ఇంట్లో లేని సమయంలో చిన్నారికి అవసరమైన వస్తువులు తెచ్చి ఇవ్వమని శ్రీనును రంజిత తల్లి సునీత కోరింది. దీంతో శ్రీను పలుమార్లు రంజిత ఇంటికి వచ్చాడు. రంజిత తల్లి సునీతతో శ్రీను ఫోన్ లో ఎక్కువగా మాట్లాడేవాడని పోలీసులు నిర్ధారించారు.
‘శ్రీను తన చెల్లి పెళ్లికి సంబంధించి తీవ్రమైన ఆర్థిక సమస్యలతో ఒత్తిడిలో ఉన్నాడు. ఈ నెల 4వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు బాలిక స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. సాయంత్రం 5 గంటలకు బాలిక ఇంటికి శ్రీను వెళ్లాడు. ఇంట్లో రంజిత తల్లి సునీత లేదని గ్రహించిన శ్రీను చోరీ చేయాలనుకున్నాడు. గతంలో తరచూ బాలిక ఇంటికి వచ్చిన శ్రీను.. ఇంట్లో విలువైన వస్తువులను గమనించాడు. ఇంట్లోకి చొరబడిన శ్రీనును ఎందుకు వచ్చావని బాలిక ప్రశ్నించింది. ఈ విషయాన్ని తన తల్లికి చెప్పాలని ప్రయత్నించింది. ఇంతలో చున్నీ మెడకు బిగించి రంజితను శ్రీను హత్య చేశాడు’ అని ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు.
Also Read: Srisailam Road: శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. మంటల్లో దగ్దమైన కారు.. స్పాట్‌లో 6గురు
తన మీద అనుమానం రాకుండా విచారణకి వచ్చిన పోలీసులతో శ్రీను తిరిగినట్లు తెలుస్తోంది. అలాగే, స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో నిందితులను త్వరగా పట్టుకోవాలని శ్రీను మెసేజ్ లు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. బాలిక ఇంట్లో శ్రీను ఫింగర్ ప్రింట్ దొరికిందని పోలీసులు తెలిపారు. బాలికను అతడే హత్య చేసినట్లు నిర్ధరించామని ఎస్పీ తెలిపారు. సీడీఆర్, సీసీ కెమెరాలు పరిశీలిస్తే నిందితుడి లోకేషన్ బాలిక మృతి చెందిన ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించామన్నారు. పూర్తి ఆధారాలతో నిందితుడిని అరెస్టు చేశామన్నా రు.