Srisailam Road: హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే ఘాట్ రోడ్డులో దారుణం జరిగింది. ఈగలపెంట మైసమ్మ గుడి వద్ద అర్ధరాత్రి సమయంలో భక్తులతో వెళ్తున్న కారు దగ్ధమైంది. హైదరాబాద్ చిక్కడపల్లికి చెందిన ఆరుగురు భక్తులు మల్లన్న దర్శనానికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈగలపెంట సమీపంలో కారు ఇంజన్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే దిగారు. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు సురక్షితంగా బయటపడగా, కారులో భారీగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల సమాచారంతో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. బ్రహ్మగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న టయోటా ఫార్చునర్ కారు ఘోర ప్రమాదానికి చోటుచేసుకుంది. నవంబర్ 8 శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం కృష్ణగిరి ఈగలపెంట వద్ద ఈ దారుణ ఘటన జరిగింది. హైదరాబాద్ చిక్కడపల్లికి చెందిన ప్రణవ్ కుమార్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనార్థం బయలుదేరాడు. వారు ప్రయాణిస్తున్న టయోటా ఫార్చునర్ కారులో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి.
అయితే ప్రణవ్ కుమార్ కారు ఇంజిన్ నుంచి పొగలు రావడం గమనించి వెంటనే అప్రమత్తమై వాహనాన్ని రోడ్డు పక్కన ఆపేశాడు. కుటుంబ సభ్యులందరినీ సురక్షితంగా కారు నుంచి దించేశాడు. వారు దిగిన కొద్దిసేపటికే మంటలు వ్యాపించి కారు మొత్తం దగ్ధమైంది. వెంటనే ఫైర్ ఇంజిన్ సిబ్బంది కాల్ చేశారు.. కానీ, ఫైర్ ఇంజిన్ ఘటనాస్థలికి చేరుకునేలోపే కారు పూర్తిగా కాలిపోయింది. అయితే, ప్రయాణికులు సకాలంలో కారు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ గాయాలు కాలేదు.
Also Read: కాలేజీలే అడ్డాగా హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా.. ఈగల్ టీమ్ దాడులు
ఈ ప్రమాదం వల్ల హైవేపై భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. శ్రీశైలం ఘాట్ రోడ్డు భాగంలో వాహనాల రాకపోకలు కొంతసేపు అంతరాయం కలిగాయి. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లనే మంటలు చెలరేగినట్లు తేలింది.
మంటల్లో దగ్ధమైన కారు..
హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఘాట్ రోడ్డులో ప్రమాదం
షార్ట్ సర్క్యూట్ సంభవించి టయోటా ఫార్చునర్ కారులో చెలరేగిన మంటలు
వెంటనే అప్రమత్తమై ప్రయాణికులు కారు దిగిపోవడం తప్పిన పెను ప్రమాదం pic.twitter.com/RxFe5rkw8m
— BIG TV Breaking News (@bigtvtelugu) November 9, 2025