Janasena X Account: జనసేన పార్టీ అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) అకౌంట్ హ్యాక్ అయింది. శనివారం రాత్రి నుంచి జనసేన ఎక్స్ ఖాతా నిలిచిపోయింది. ఈ అకౌంట్ లో షేర్ మార్కెట్ కు సంబంధించిన పోస్టులు కనిపిస్తున్నాయి. సైబర్ దాడిని నియంత్రించేందుకు పార్టీ సోషల్ మీడియా విభాగం పనిచేస్తుంది. గుర్తు తెలియని సైబర్ నేరగాళ్లు జనసేన ఎక్స్ ఖాతాను నియంత్రణలోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం వరకు ఖాతా సైబర్ నేరగాళ్ల ఆధీనంలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి జిల్లా పర్యటన ఫొటోలు, సమాచారాన్ని జనసేన శనివారం పోస్టు చేసింది. ఈ పోస్టు తర్వాత ఎక్స్ ఖాతాలో వేరే పోస్టులు వస్తున్నాయి. అధికారిక ఖాతా లోగో, కవర్ పేజ్ తొలగించిన సైబర్ కేటుగాళ్లు.. వేరే పోస్టులు పెడుతున్నారు. హ్యాకర్లు ఇన్వెస్ట్‌మెంట్స్, ట్రేడింగ్స్ కు సంబంధించిన పోస్టులను రీట్వీట్ చేస్తున్నారు. దీంతో జనసేన మద్దతుదారులు ఆందోళన చెందుతున్నారు. సైబర్ దాడిపై జనసేన అధికారంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఎక్స్ ఖాతా హ్యాకింగ్ కు గురవ్వడంతో జనసేన నాయకత్వం అప్రమత్తమైంది. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. హ్యాకర్‌ల నుంచి ఖాతాను తిరిగి పొందేందుకు పార్టీ సాంకేతిక బృందం ప్రయత్నిస్తునట్లు సమాచారం. ఈ వ్యవహారంపై జనసేన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా అనే కోణంలో చర్చ మొదలైంది. పార్టీ ఎక్స్ ఖాతా హ్యాకింగ్‌పై అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.
Also Read: Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..