Ameenpur Case Incident: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో ముగ్గురు చిన్నారుల మృతి కేసును పోలీసులు ఛేదించారు. మార్చి 28న తెల్లవారుజామున చోటు చేసుకున్న ఘటన మిస్టరీ వీడింది. సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కేసు వివరాలుతెలిపారు.
అక్రమ సంబందానికి అడ్డుగా ఉన్నారని మనసు లేని ఓ కన్నతల్లి తన పిల్లల పాలిట కసాయిగా మారింది. భర్తతో ఏజ్ గ్యాప్ ఉందని ప్రియునితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆనందంగా గడపాలని అభం శుభం తెలియని ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులను గొంతు నులిమి చంపేసింది. అంతే కాకుండా తనకేమి తెలియనట్టు పెరుగు అన్నం తిని అస్వస్థతకు గురయ్యామంటూ డ్రామాకు తెరలేపింది. మొదట్లో భర్తే చిన్నారులకు విషం ఇచ్చి చంపేశాడని అనుకున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారణ చేపట్టగా.. విస్తుపోయే అసలు నిజాలు బయటపడ్డాయి.
రజిత అలియాస్ లావణ్యకు ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో తనకన్నా వయసులో 20 ఏళ్ల పెద్ద వాడైన చెన్నయ్యతో వివాహం జరిగింది. అమీన్ పూర్‌లోని రాఘవేంద్ర కాలనీలో నివాసముంటున్న వీరికి ముగ్గురు పిల్లలు 12 ఏళ్ల సాయి కృష్ణ, పదేళ్ల మధుప్రియ, ఎనిమిదేళ్ల గౌతమ్ ఉన్నారు. చెన్నయ్య వాటర్ ట్యాంకర్ ట్రాక్టర్ నడుపుతుంగా.. రజిత ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. తన పదో తరగతి క్లాస్ మేట్ శివతో స్నేహం మరింత పెరిగింది. తన భర్తతో ఏజ్ గ్యాప్ ఉందని, తనకు సంతోషం లేదని శివతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది రజిత. శివ కలిసినప్పటి నుంచి జీవితం బాగుందని భావించి అతడిని వివాహం చేసుకుందామని తన సుఖం కోసం పిల్లలు అడ్డు వస్తున్నారని భావించి పిల్లలను గొంతు నులిమి చంపేసింది.
మార్చి 28న తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రయివేటు ఆస్పత్రి నుంచి డయల్ 100కి కాల్ రాగా.. పోలీసులు వెళ్లే సరికి ముగ్గురు చిన్నారులు నోటిలో నురగతో చనిపోయి ఉన్నారు. మొదట్లో ఫుడ్ పాయిజన్ అని భావించిన పోలీసులు.. క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించారు. ముగ్గురి చిన్నారుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు.
రజిత భర్త చెన్నయ్యను విచారించగా ఆ రోజు రాత్రి పెరుగన్నం తిన్నారని పోలీసులకు చెప్పారు. చెన్నయ్య మాత్రం పప్పన్నం తిన్నాను అని చెప్పడంతో అనుమానం పోలీసులకు అనుమానం పెరిగింది. దీంతో పిల్లల్ని తల్లే చంపినట్టు గుర్తించామని, పిల్లలపై ఎలాంటి విష ప్రయోగం జరగలేదని డాక్టర్లు నిర్దారించారు. మరింత లోతైన విచారణ జరపగా.. నిందితురాలు 35 ఏళ్ల రజిత, భర్త 55 ఏళ్ల చెన్నయ్య మధ్య ఏజ్ గ్యాప్.. రజిత టెన్త్ క్లాస్ ఫ్రెండ్ 35 ఏళ్ల శివకుమార్‌తో వ్యవహారం బయటపడింది. వివాహేతర సంబంధం కారణంగానే పిల్లలను చంపినట్టు తల్లి ఒప్పుకుంది. ఈ కేసులో ఏ-1, ఏ-2లగా ఉన్న రజిత అలియాస్ లావణ్య, ప్రియుడు నల్గొండ జిల్లా గోడుకొండ్ల గ్రామంకు చెందిన శివకుమార్ కుట్ర పన్ని అత్యంత కిరాతకంగా ముగ్గురు పిల్లలను ఊపిరాడకుండా చేసి చంపివేసినట్టు బహిర్గతం అయ్యింది. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు పోలీసులు.
Also Read: మాజీ ప్రియుడితో కలిసి ఉండాలని.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన తల్లి
ఈ నేపథ్యంలో మీడియా ముందు పిల్లల తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. నన్ను నమ్మించి నా భార్య గొంతుకోసింది. నా ప్రాణానికి సమానమైన నా పిల్లల్ని అతి కిరాతకంగా హత్య చేసింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడుద్దామంటే కంట్లో నుండి నీళ్లు రావడం లేదు. నాతో ఉండడం ఇష్టం లేకపోతే చెప్పకుండా ఇష్టం ఉన్న వాడితో వెళ్ళిపోవాల్సిందని ఆవేదన వ్యక్తం చేశారు. పదవ తరగతి గెట్ టు గెదర్ పార్టీ పేరుతో తనను నట్టేట ముంచిందని బోరున విలపించాడు. పిల్లలకి విషమిచ్చి తను యాక్టింగ్ చేసి తప్పించుకోవాలని చూసింది. తిరిగి మళ్లీ పిల్లలను ఊపిరి ఆడకుండా చేసి చంపేసిందని తెలిపారు. ఇదంతా నా ఆస్తి కోసమే చేసింది.. బహిరంగంగా నా భార్యను దీనికి కారణమైన శివను ఉరితీయాలి.. క్షణక్షణం నాకు నా పిల్లలే గుర్తొస్తున్నారు.. నేను చచ్చిపోయి ఉన్నా బాగుండేది బతికి క్షణక్షణం చస్తున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
అమీన్ పూర్ ఘటనపై మెదక్ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రజిత ఇలాంటి తల్లి వల్ల తమకు, ఊరికి చెడ్డ పేరు వచ్చిందని మండి పడ్డారు. అలాంటి సంస్కారం లేని మహిళను బహిరంగంగా ఉరితీయాలి. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన చాలామందికి పిల్లలు లేక మనోవేదనకు గురి అవుతున్నారు. ఇలాంటి వారి వల్ల సమాజంలో మహిళలు తలెత్తుకోలేరు. కఠినమైన శిక్షలు వేసి మరెవరు ఇలా చేయకుండా చూడాలని కోరారు.