Cold Weather: చలికాలం మొదలైంది. చలికాలం వచ్చిందంటే చాలు అందరు వణికిపోతుంటారు. ఈ సమయంలో ఉదయాన్నే లేచి చలి మంటలు కాచుకోవడం.. వేడివేడిగా టీ తాగడం చేస్తుంటారు. అయితే కొన్ని రోజుల పాటు కురిసిన వర్షాలు, తుఫాన్ ప్రభావం ఆగిపోవడంతో, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసరడం మొదలుపెట్టింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు
ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు, రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోతున్నాయి. గురువారం రాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. ఆదివారానికి మరింతగా పడిపోయాయి. రాత్రిపూట, తెల్లవారుజామున చలిగాలుల తీవ్రత ఎక్కువైంది. మరో వైపు.. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది.
మరో మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో పడిపోనున్న ఉష్ణోగ్రతలు
రానున్న రోజుల్లో ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ వంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరో మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో చలితీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. మంగళవారం ఉదయం 13 నుంచి 15 సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉందన్నారు.
Also Read: దారుణం.. ఆస్తి కోసం కన్న తల్లిని హత్య చేసిన కసాయి కొడుకు..
చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలన్న వైద్యులు
హైదరాబాద్ శివార్లలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే 14 నుంచి 15 సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటలైనా చలి తగ్గక, మంచు కమ్ముకోవడంతో మార్నింగ్ వాక్‌లు, రోడ్డు ప్రయాణాలు ఆలస్యమవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ తీవ్రత మరింత పెరుగుతుందని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.