Veeraiah Murder Case: ప్రకాశం జిల్లా టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసును పోలీసులు ఛేదించారు. స్వగ్రామంలో ఆధిపత్య పోరు కారణంగానే వీరయ్య చౌదరిని హత్య చేశారని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. హత్య కేసులో మొత్తం 12 మంది నిందితులను గుర్తించామని.. 9 మంది అరెస్ట్, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు చెప్పారు. నలుగురు వ్యక్తులు హత్య చేశారని.. దాదాపు 50 కత్తిపోట్లతో వీరయ్య చౌదరి ప్రాణాలు విడిచాడని చెప్పారు.
వీరయ్య చౌదరి హత్యకు రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని, అతడి ఎదుగుదల చూసి కొందరు ఈర్ష్య చెందారని ఎస్పీ తెలిపారు. వీరయ్య చౌదరి హత్యకు ఆళ్ల సాంబయ్య అనే వ్యక్తి ప్రణాళిక రచించాడని చెప్పాడు. సాంబయ్య ఓ వాస్తు సిద్దాంతి అని తెలిపారు. వినోద్ అనే వ్యక్తి ద్వారా హత్య కుట్ర అమలు చేశారని వివరించారు.
వీరయ్య వల్ల ప్రాబల్యం కోల్పోతున్నట్టు సాంబయ్య గుర్తించాడని, అతడికి వ్యతిరేకంగా రాజకీయ కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. వీరయ్య రాజకీయంగా ఎదిగితే తన మేనల్లుడు సురేశ్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది అని సాంబయ్య భావించాడని ఎస్పీ తెలిపారు. వీరయ్య చౌదరికి నామినేటెడ్ పదవి వస్తుందనే ప్రచారంతో సాంబయ్య ఆందోళన చెందాడని, దాంతో, వినోద్ సహకారంతో వీరయ్యను హత్య చేయాలని చేసినట్లు చెప్పారు.
వీరయ్య హత్య కోసం 25 లక్షలు ఖర్చు చేశారని, ఈ హత్యలో ప్రత్యక్షంగా నలుగురు పాల్గొన్నారని తెలిపారు. వంశీకృష్ణ, వెంకట గౌతమ్, మన్నెం తేజ, నాగరాజు ఈ హత్య చేశారని వివరించారు. 100 బృందాలతో గాలించి నిందితులను పట్టుకున్నామని చెప్పారు. సాంబయ్య మేనల్లుడు సురేశ్, నాగరాజు, నాని పరారీలో ఉన్నారని తెలిపారు.
Also Read: ఇలా ఉన్నారేంట్రా బాబు.. భార్య అందంగా ఉందని చంపిన భర్త
ఇదిలా ఉంటే.. ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులోని జామా మసీదు ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. అడిగినంత డబ్బులు ఇవ్వలేదని బంధువులు ఒక టైలర్‌ను నిర్ధాక్షణ్యంగా బ్లేడుతో గొంతు కోశారు. టైలర్ చావు బతుకుల మధ్య ఉన్నాడు. జామ మసీదు వద్ద టైలరింగ్ చేసుకునే షబ్బీర్ వద్దకు బంధువులు వచ్చారు. డబ్బులు కావాలని అడగడంతో అతను కొంత నగదు ఇచ్చాడు.
అయితే అది నచ్చని దుండగులు వెంటనే అతన్ని బ్లేడ్‌తో గాయపరిచి అక్కడి నుంచి పరారైనట్టు స్థానికులు తెలిపారు.షబ్బీర్ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి అతన్ని 108లో స్థానిక రిమ్స్ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షబ్బీర్ నగరంలోని ఇస్లాం పేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం షబ్బీర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.