Haryana News: అమెరికాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హర్యానా రాష్ట్రానికి చెందిన 26 ఏళ్ల యువకుడు కపిల్‌ను బలి తీసుకుంది. కపిల్, జింద్ జిల్లాలోని బరాహ్ కలాన్ గ్రామానికి చెందిన యువకుడు. కపిల్ కుటుంబం వ్యవసాయం పైన ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నది. అతనికి సోదరీమణులు ఉన్నారు. మూడేళ్ల క్రితం సుమారు 45 లక్షల రూపాయల ఖర్చుతో ‘డంకీ రూట్’ (అక్రమ వలస మార్గం) ద్వారా అమెరికాకు వెళ్లాడు. పనామా అడవులు దాటి, మెక్సికో సరిహద్దు గోడ ఎక్కి అమెరికా చేరుకున్నాడు. అక్కడ కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో ఒక స్టోర్‌లో సెక్యూరిటీ గార్డుగా కపిల్ పని చేస్తున్నాడు.
అయితే శనివారం రోజున కపిల్ తన డ్యూటీలో ఉండగా స్టోర్ బయట రోడ్డుపై ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఇది చూసిన కపిల్, ఆ వ్యక్తిని ఆపమని అది తప్పు అని చెప్పాడు. ఇది కాస్త గొడవకు దారి తీసింది. ఆ గొడవలో ఆ వ్యక్తి తన వద్ద ఉన్న గన్ తీసి కపిల్‌పై కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలతో కపిల్ అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన జరిగి రెండు రోజులు అయినప్పటికీ.. అమెరికా అధికారులు ఇంకా నిందితుడిని అరెస్టు చేయలేదు.
ALSO READ: Jobs in Indian Railways: 32,438 ఉద్యోగాలు.. మంచి వేతనం, ఎగ్జామ్స్ డేట్స్ వచ్చేశాయ్..
కపిల్ మరణ వార్త తెలిసిన వెంటనే అతడి కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది. గ్రామ పెద్ద సురేష్ కుమార్ గౌతమ్ మాట్లాడుతూ.. కపిల్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర, హర్యానా ప్రభుత్వాల సహాయం కోరారు. కుటుంబం డిప్యూటీ కమిషనర్‌ను కలవాలని భావిస్తోంది. ఈ సంఘటన వలస జీవితాల్లోని ప్రమాదాలను, అమెరికాలో గన్ కల్చర్‌ను ప్రశ్నిస్తోంది. చిన్న విషయానికి ప్రాణాలు కోల్పోవడం దారుణ మని నెటిజన్లు మండిపడుతున్నారు.
ALSO READ: Faridabad News: ఏసీ పేలి ముగ్గురు మృతి.. బాల్కనీ నుంచి దూకేసి ప్రాణం కాపాడుకున్న యువకుడు
ఇలాంటి సంఘటనలు భారతీయులు విదేశాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను బయటపెడుతున్నాయి. అక్రమ వలస మార్గాలు ప్రమాదకరమే కాకుండా, జీవితాలను నాశనం చేస్తున్నాయి. ప్రభుత్వాలు ఇలాంటి ఘటనలపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని.. వలసదారుల రక్షణను పెంచాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.