Telangana politics: తెలంగాణలో రాజకీయాలు నెక్ట్స్ ఏం జరుగుతోంది? బీఆర్ఎస్-టీడీపీ ఒక్కటవుతున్నాయా? కేటీఆర్ పదే పదే టీడీపీ నేతలను ఎందుకు కలుస్తున్నారా? పార్టీ అధికారంలోకి రావాలంటే ఒంటరిగా కష్టమని డిసైడ్ అయ్యారా? ఈ వ్యవహారంపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఏమన్నారు? లోలోపల ఏం జరుగుతోంది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు. ఎప్పురు.. ఎప్పుడు.. ఏం చేస్తారో తెలీదు. ఎవరెవరు కలుస్తారో తెలీదు కూడా. కారణాలు ఏమైనా కావచ్చు. కాకపోతే క్లారిటీ లేకపోవడం వల్ల రకరకాల వార్తలు హంగామా చేస్తున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లిన మంత్రి నారా లోకేష్ మీడియాతో చిట్ చాట్‌తో చేశారు.
ఈ సందర్భంగా చాలా విషయాలు బయటపెట్టారు. అంతేకాదు మీడియా మిత్రులు అడిగిన పలు ప్రశ్నలు తనదైన శైలిలో రిప్లై ఇచ్చేశారు. కేటీఆర్ తనను తరచూ కలుస్తున్నారని తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలపై నోరు విప్పారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యల గురించి ఆయన్ని మీడియా అడిగితే బాగుంటుందన్నారు.
తాను అందర్నీ కలుస్తానని, తాను ఎవరినైనా కలవాలంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమతి తీసుకోవాలా అని అన్నారు. వివిధ సందర్భాల్లో కేటీఆర్‌ని కలిశానని మనసులోని మాట బయటపెట్టారు. కేటీఆర్‌ని కలవకూడదని ఎందుకు అనుకుంటు న్నారు? తెలంగాణలో పార్టీకి కార్యకర్తలు ఉన్నారని, పార్టీ బలోపేతంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.
ALSO READ: ఫార్ములా ఈ-రేస్ కేసులో కీలక పరిణామం
ఇకపై తెలంగాణ టీడీపీపై ఫోకస్ పెడతామన్నారు. అదే సమయంలో కవిత టీడీపీలోకి వస్తున్నారా? అన్న ప్రశ్నలకు రిప్లై ఇచ్చారు. కవితని మా పార్టీలోకి తీసుకోవడం అంటే.. జగన్‌ని టీడీపీలో చేర్చుకున్నట్లేనని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ నిలబడుతుందన్న వ్యాఖ్యలపైనా నోరు విప్పారు. దీనిపై అధినేత చంద్రబాబుదే తుది నిర్ణయమన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉంటుందని, బరిలో టీడీపీ ఉంటే మద్దతు ఇచ్చే అవకాశముందని ఆ మధ్య మీడియా సర్కిళ్లులో వార్తలు గుప్పుమన్నాయి. ఆ విషయం ఎంతవరకు వచ్చిందో తెలీదుగానీ, అక్కడ పోటీ చేయాలా? వద్దా అనేది అధినేత నిర్ణయమని తప్పించుకునే ప్రయత్నం చేశారు మంత్రి లోకేష్.
తాను ప్రధాని నరేంద్రమోదీని కలిసినప్పుడు ఏపీలో ఏం జరుగుతుందో చెబుతున్నట్లు తెలిపారు. ఆయన నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల కలిసినప్పుడు ప్రభుత్వం పనితీరుని, చేస్తున్న కార్యక్రమాలను వివరించానన్నారు. ఎన్నికల సమయంలో బూత్ స్థాయిలో ఏ విధంగా ఉండాలనే దానిపై మాట్లాడామన్నారు. మొత్తానికి టీడీపీ-బీఆర్ఎస్ మధ్య ఏదో జరుగుతుందన్న చర్చ తెలంగాణలో మొదలైంది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
మీడియాతో చిట్ చాట్ లో మంత్రి నారా లోకేష్
కవితని మా పార్టీలోకి తీసుకోవడం అంటే జగన్ ని టీడీపీలో చేర్చుకున్నట్లే
కేటీఆర్ ని ఎందుకు కలవకూడదు?
వివిధ సందర్భాల్లో కేటీఆర్‌ని కలిశాను
తెలంగాణ టీడీపీపై ఫోకస్ పెడతాం
కార్యకర్తలు ఉన్నారు పార్టీ బలోపేతంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం
— BIG TV Breaking News (@bigtvtelugu) September 10, 2025