AP Govt Plan: ప్రజలకు శుభవార్త చెప్పనుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సర్వీసులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన చంద్రబాబు సర్కార్, కొత్త ప్లాన్ చేస్తోంది. ఇకపై కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. అక్టోబరు 2 నుంచి ఇంటికే వారి కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలను నేరుగా ఇంటికి పంపేందుకు చర్యలు చేపట్టింది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.
విద్యార్థులు పాఠశాల మారాలన్నా.. స్కాలర్ షిప్‌లకు కావాలన్నా ప్రభుత్వం జారీ చేసిన కులం, ఆదాయ, నివాస పత్రాలను పదేపదే అడుగుతున్నారు. ఈ సమస్య ప్రభుత్వానికి పెనుభారంగా మారింది. ఆయా సర్టిఫికెట్లు కావాలన్నా ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుందిగానీ, ఒక్క అడుగు ముందుకు పడడంలేదు. ఆఫీసులు అధికారులు లేక చాలామంది ఇబ్బందులుపడుతున్నారు.
వీటిపై పుంకాను పుంకాలుగా మీడియాలో వార్తలు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాట్సాప్ సర్వీసులు మొదలుపెట్టింది. చాలామందికి ఫోన్లు ఉన్నాయి. కాకపోతే స్మార్ట్ ఫోన్లు లేకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ సమస్యకు శాశ్వతంగా ఫుల్‌స్టాప్ పెట్టాలని ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం ఇంటింటికి సర్వే చేపడుతోంది.
సర్వేలో ఆధార్, రైస్ కార్డు, విద్యార్హత వివరాలను పరిశీలిస్తున్నారు. వాటి ఆధారంగా కులం, ఆదాయం, నేటివిటీ పత్రాలను పునఃపరిశీలన చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక వీఆర్‌వోలు ప్రతి ఇంటికి వెళ్లి ఆయా పత్రాలు జారీ చేసేందుకు వారు అర్హులా కాదా? అనేదానిపై సర్వే చేపట్టారు.
ALSO READ: ఏపీలో అన్నదాత పోరు.. యథావిధిగా జగన్ కేరాఫ్ బెంగుళూరు
ఈ సర్వేలో ప్రతి ఇంట్లో ఆధార్, రైస్ కార్డు, గతంలో జారీ చేసి కుల ధ్రువీకరణ పత్రం, డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్, విద్యార్హత వివరాలు పరిశీలించనున్నారు. వీఆర్వోలు చేపట్టిన ప్రతీ ఇంటి సర్వేను ఈనెల 15 లోగా పూర్తి చేయాలని పైనుంచి కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు వచ్చాయి. వీఆర్‌వో నుంచి ఆర్‌ఐకి ఆయా వివరాలు వెళ్తాయి.
అక్కడి నుంచి తహసీల్దార్ ఆఫీసు తర్వాత వెబ్‌ల్యాండ్‌లో వాటిని నమోదు చేస్తారు. అయితే కొన్ని దరఖాస్తులు ఆర్డీవో, జేసీల పరిశీలనకు వెళ్లనున్నాయి. అంతా పూర్తి తర్వాత అర్హుల జాబితాను రెవెన్యూ వెబ్‌సైట్‌లో అధికారులు పెట్టనున్నారు. ఈ ప్రాసెస్ పూర్తి తర్వాత కులం, ఆదాయం, నేటివిటీ పత్రాలను విద్యార్థులు ఎప్పుడు పడితే అప్పుడు ఇంటర్ నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
లేకుంటే నేరుగా ఇంటికే పంపిస్తారు. అక్టోబరు 2 నుంచి ఈ పద్దతిని ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తోంది. చదువు, ఉపకార వేతనాలు, ఉద్యోగం, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు వాటిని ఉపయోగించుకోవచ్చు. గతంలో కుల ధ్రువీకరణ పత్రం కావాలంటే సచివాలయం, రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగేవారు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదని, దాని వెనుక రెవెన్యూ శాఖ ఈ పనిని మరింత సులభతరం చేస్తోంది.