Road Incident: తమిళనాడు రామేశ్వరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శబరిమల అయ్యప్ప దర్శనం పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా.. వారి వాహనాన్ని లారీ ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషాద ఘటన శుక్రవారం రాత్రి 2.15 గంటల సమయంలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోరపు కొత్తవలస, గజపతినగరం మండలం మరుపల్లి గ్రామాలకు చెందిన ఐదుగురు భక్తులు ఒక కారులో శబరిమల దర్శనం కోసం వెళ్లారు. దర్శనం ముగించుకుని తిరుగు ఇంటికి పయనం అవ్వగా.. వీరు రామేశ్వరం సమీపంలోని రోడ్డుపై కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి కారును పక్కకు తీసి ఆపారు. అలసటతో నిద్రిస్తున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ నియంత్రణ కోల్పోయి వారి కారును ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు.
మృతుల వివరాలు
వంగర రామకృష్ణ (51 సంవత్సరాలు) – కోరప కొత్తవలస
మార్పిన అప్పలనాయుడు (33 సంవత్సరాలు) – కోరప కొత్తవలస
మరాడ రాము (50 సంవత్సరాలు) – కోరప కొత్తవలస
బండారు చంద్ర రావు (35 సంవత్సరాలు) – మరుపల్లి గ్రామం, గజపతినగరం మండలం
ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.