Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రాగానే అంతటా నగల దుకాణాల హడావిడే కనిపిస్తుంది. ఇది చూసి “నా దగ్గర అంత బడ్జెట్ లేదే” అని డల్ అయిపోతున్నారా? అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనడం మాత్రమే కాదు. అసలైన ఐశ్వర్యం అంటే శాంతి, సంస్కారం, సంతోషం. ఈ పవిత్రమైన రోజున మన ఇంట్లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా.. మన మనసును శుద్ధి చేసుకోవడం ద్వారా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఆ సింపుల్ పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం..
బంగారం కొనక్కర్లేదు.. అదృష్టం మీ తలుపు తట్టాలంటే ఇలా చేయండి!
అక్షయ తృతీయ నాడు ఏదైనా కొంటే అది వృద్ధి చెందుతుంది అన్నది శాస్త్రం. అయితే అది కేవలం బంగారం మాత్రమే అవ్వక్కర్లేదు. మన చుట్టూ ఉండే పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడం ద్వారా కూడా మనం సంపదను ఆకర్షించవచ్చు.
1. ఇంటిని ‘క్లట్టర్’ ఫ్రీగా ఉంచండి:
లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. ఈ రోజు మీ రూమ్‌ని, మీ డెస్క్‌ని నీట్‌గా సర్దుకోండి. వాడకుండా పక్కన పడేసిన పాత వస్తువులు, చిరిగిన బట్టలు, పాడైపోయిన ఎలక్ట్రానిక్స్ నెగటివ్ ఎనర్జీని కలిగిస్తాయి. వాటిని వదిలించుకోండి. ఇల్లు ఎంత ప్రశాంతంగా.. వెలుతురుతో ఉంటే అంతగా సానుకూల శక్తి ఇంట్లోకి వస్తుంది.
2. ‘సముద్ర లక్ష్మి’ని ఇంటికి తెచ్చుకోండి:
బంగారం కొనలేని వారు అక్షయ తృతీయ నాడు ఒక ప్యాకెట్ ‘కల్లు ఉప్పు’ (రాళ్ల ఉప్పు) కొనండి. శాస్త్ర ప్రకారం ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. ఈ రోజు కొత్తగా కొన్న ఉప్పును గాజు జార్‌లో పోసి మీ కిచెన్‌లో ఉంచండి. ఇది మీ ఆర్థిక సమస్యలను తగ్గించి, అదృష్టాన్ని తెస్తుందని నమ్మకం.
3. దానానికి మించిన సంపద లేదు:
అక్షయ తృతీయ రోజున మనం చేసే దానం వంద రెట్లు ఎక్కువ పుణ్యాన్ని ఇస్తుంది. మీ బడ్జెట్ తక్కువైనా పర్వాలేదు.. ఎండలో తిరిగే వారికి ఒక బాటిల్ మజ్జిగ ఇవ్వండి లేదా పక్షులకు నీళ్లు పెట్టండి. పేదలకు ఒక పూట భోజనం పెట్టినా చాలు.. ఆ తృప్తి మీ ఇంట్లో ఐశ్వర్యాన్ని నింపుతుంది. డబ్బు ఇచ్చే దానికంటే అవసరమైన వస్తువులను దానం చేయడం ఈ రోజు చాలా శ్రేష్ఠం.
Also Read: అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేకపోతున్నారా? ఈ 3 వస్తువులు తెచ్చుకున్నా అదృష్టమే!
4. ‘జ్ఞాన లక్ష్మి’ని పూజించండి:
యువతకు ఇది బెస్ట్ టిప్. మీ దగ్గర ఉన్న డబ్బుతో ఒక మంచి పుస్తకాన్ని కొని చదవడం మొదలుపెట్టండి. లేదా మీరు నేర్చుకోవాలనుకుంటున్న స్కిల్ కోసం ఒక కోర్సులో జాయిన్ అవ్వండి. జ్ఞానం ఎప్పుడూ అక్షయంగా ఉంటుంది. మీ నాలెడ్జ్ పెరిగితే, డబ్బు సంపాదించే అవకాశాలు కూడా అవే వస్తాయి.
5. శాంతిగా ఉండటం కూడా ఒక పూజే..
అక్షయ తృతీయ నాడు ఇంట్లో అస్సలు గొడవ పడకండి. ఎవరినీ కించపరచకండి. ముఖంపై చిన్న నవ్వుతో, అందరితో ప్రేమగా మాట్లాడండి. ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో అక్కడ మహాలక్ష్మి స్థిరంగా కొలువై ఉంటుంది.
చిన్న పరిహారం:
సాయంత్రం వేళ ఇంటి గుమ్మం దగ్గర ప్రమిదలో దీపం వెలిగించి, ఆ జ్యోతిని లక్ష్మీదేవిగా భావిస్తూ నమస్కరించుకోండి. మీ మనసులో ఉన్న కోరికను అమ్మవారికి చెప్పుకోండి. నమ్మకంతో చేసే ఏ చిన్న పనైనా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.
అక్షయ తృతీయ అంటే మన సంస్కృతిని, దానగుణాన్ని గుర్తుచేసే రోజు. బంగారం ఉన్నా లేకపోయినా, పైన చెప్పిన పనులు చేయడం ద్వారా మీరు మనశ్శాంతిని, అదృష్టాన్ని పొందవచ్చు.