
Chitragupta Temple in Telangana : తెలంగాణలో చిత్రగుప్తుడి దేవాలయం కేవలం ఒకే ఒకటి ఉంది. ఇంత అరుదైన దేవాలయం హైదరాబాద్ పాతబస్తీ కందికల్ గేట్ ప్రాంతంలో ఉంది. అయినా స్థానికులు చాలా మందికి ఇక్కడ చిత్రగుప్త దేవాలయం ఉందన్న విషయం తెలియదు. చిత్రగుప్తుడి గుడి గంట మోగే శబ్దం వినిపించడం కన్నా వారికి చావు డప్పు, బంధువుల శోకాలు వినిపిస్తుంటాయి.
దేవాలయం ముందు నుంచి తరచుగా పీనుగులను మోసుకెళ్లే పాడెలు కనిపిస్తుంటాయి. ఎందుకంటే దేవాలయానికి కూత వేటు దూరంలోనే నల్లవాగు స్మశాన వాటిక ఉండటంతో ఈ మార్గం గుండానే అనేక శవయాత్రలు వెళాల్సి ఉంటుంది. దేవాలయ పరిసరాల్లో సాంబ్రాణి పొగ వాసనకు బదులుగా శవం కాలుతున్న వాసనలే విపరీతం. పాతబస్తీలో ఇదే అతిపెద్ద స్మశానవాటిక అని చెప్పొచ్చు. అపుడపుడు కందికల్ గేట్ రైల్వే ట్రాక్ మీద ప్రమాదాలు జరిగి మృత్యువాత పడే జీవులెందరో.
ఆ భయంతోనే బహుశా ఇక్కడ రాత్రిపూట పెద్దగా జనసంచారం ఉండదు. దీపావళి రెండో రోజు మాత్రమే ఘనంగా జరిగే ఉత్సవం తప్పించి మామూలు రోజుల్లో కూడా పెద్దగా పూజలు జరగవు.
దీపావళి రెండో రోజు యమద్వితీయ ఉంటుందని ఆరోజు చిత్రగుప్తుడి పుట్టిన రోజు నిర్వహించే ఆచారం కొనసాగుతుంది.దీన్నే భాయ్ దూజ్ అంటారు. చిత్రగుప్తుడికి ఇష్టమైన రోజు బుధవారం . ఆరోజు అభిషేకం, ప్రత్యేక పూజలు జరుపుతారు. అకాల మృత్యువును జయించడానికి మాత్రమే కాదు , చదువు, పెళ్లి, సంతానం ఇలా అనేక సమస్యలకి పరిష్కారం కోసం ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు..
కేతు గ్రహ దోష నివారణకు కూడా ఈ దేవాలయంలో పూజలు జరుగుతుంటాయని మరో పూజారీ చంద్రకాంత్ జోషి తెలిపారు. ఈ దేవాలయానికి భక్తుల సంఖ్య కూడా అంతంత మాత్రమే.ఇంతటి విశిష్టమైన దేవాలయం అభివృద్ది కాకపోవడానికి వాస్తు దోషమేన్న ప్రచారం ఉంది. తూర్పు ఆగ్నేయం పెరగడం,తూర్పు భారం,ఈశాన్యం బరువు, దక్షిణ నైరుతి గేటు తెరవడం వల్ల దేవాలయం ఖ్యాతి చెందడం లేదట.