Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రచారం హోరెత్తుతోంది. ఎన్నికలకు ఇంకా రెండు రోజులే టైం ఉంది. టైం దగ్గర పడుతున్న కొద్ది.. అన్ని పార్టీలు పక్కా వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. ఇవాళ ప్రచారంలో అధికార పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు పాల్గొనే ఛాన్స్ ఉంది. జూబ్లీలో తమ పార్టీలను నిలబెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అన్ని పార్టీల నేతలు. తమ అభ్యర్థులను గెలిపించాలంటూ నియోజకవర్గ ప్రజలను కోరుతున్నారు. హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇటు బీజేపీ, బీఆర్ఎస్ కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.
తమ అభ్యర్థి మాగంటి సునీత గెలుపును అడ్డుకునేవారే లేరంటూ బీఆర్ఎస్ పార్టీ నేతల ధీమా
ఇక బీఆర్ఎస్‌లో మాగంటి గోపీనాథ్ చేపట్టిన కార్యక్రమాలను గుర్తు చేస్తూ ముందుకు సాగుతున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. మరోసారి గులాబీ పార్టీని గెలిపించి ప్రజలు మార్పు తీసుకురావాలని కోరుతూ ముందుకు సాగుతున్నారు బీఆర్ఎస్ నేతలు. అంతేకాకుండా మాగంటి సునీత గెలుపును అడ్డుకునేవారే లేరంటూ బీఆర్ఎస్ పార్టీ నేతల ధీమాతో ఉన్నారు. ఇంటింటి ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు.
ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్న బీజేపీ
ఇక, బీజేపీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఇప్పటికే ప్రజలు ఓట్లేశారని.. ఈసారి కమలాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్రం చేపడుతున్న పథకాలను చూసి ఓట్లేయాలని అభ్యర్థిస్తున్నారు. దీంతో.. జూబ్లీహిల్స్ ప్రచారం వాడివేడిగా సాగుతోంది.
Also Read: కొనసాగుతున్న రెండవ రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ..
రాష్ట్రంలో కేసీఆర్ గడీ బద్ధలు కొట్టింది బీజేపీయే- బండి
బోరబండ బీజేపీ ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కేంద్రమంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ వాళ్లు పాకిస్థాన్‌ను పొగడటం మొదలుపెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ గడీ బద్ధలు కొట్టింది బీజేపీయే అన్నారు. ముస్లిం టోపీ పెట్టుకుని ఓటు అడగాల్సి వస్తే తల నరుక్కుంటా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వస్తున్న సర్వేలన్నీ బోగస్సేనని అన్నారు. బీఆర్‌ఎస్‌ను మరోసారి ఫామ్‌హౌస్‌కు పరిమితం చేసేలా జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పునివ్వాలని కోరారు. మాగంటి మృతికి కేటీఆరే కారణమని గోపినాథ్ తల్లి చెప్పారంటూ బండి సంచలన ఆరోపణ చేశారు.