HBD Trivikram:త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas).. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మాటల మాంత్రికుడుగా మనందరికీ పరిచయమైన ఈయన చదువులో బంగారు పతకం సాధించారని బహుశా చాలామందికి తెలియదు. అంతేకాదు ఉపాధ్యాయుడిగా కూడా కెరియర్ కొనసాగించిన ఈయన .. అనూహ్యంగా రచయితగా మారి నేడు దర్శకుడిగా చలామణి అవుతున్నారు. ఇకపోతే ఈ మాటల మాంత్రికుడి పుట్టినరోజు ఈరోజు ఈ సందర్భంగా ఆయన కెరియర్ ఎలా సాగింది.. ఇండస్ట్రీలో ఆయన ఎదిగిన తీరు ఇలా ప్రతి విషయం ఇప్పుడు వైరల్ గా మారుతోంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్.. అసలు పేరు ఆకెళ్ళ నాగ శ్రీనివాస్.. 1971 నవంబర్ 7న పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆకెళ్ళ ఉదయ భాస్కరరావు – నరసమ్మ దంపతులకు జన్మించిన ఈయన భీమవరంలోని డీ.ఎన్.ఆర్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అణుకేంద్ర శాస్త్రంలో ఎంఎస్సీ పూర్తి చేసిన ఈయన బంగారు పతకం కూడా అందుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. అయితే సాహిత్యంపై ఉన్న ఇష్టంతో హైదరాబాద్ కి వచ్చారు. అదే సమయంలో సునీల్ తో పరిచయం ఏర్పడి ఆయన గదిలోనే రూమ్మేట్ గా చేరారు త్రివిక్రమ్. అయితే సునీల్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ ను గౌతమ్ రాజుతో పిల్లలకు ట్యూషన్ చెప్పే వాడిలా పరిచయం చేశాడు. అదే సమయంలోనే ఒక ప్రముఖ వార్తాపత్రికలో శ్రీనివాస్ రాసిన “ది రోడ్” అనే కథ ప్రచురితం మయింది.
ALSO READ:Actress Death: గుండెపోటుతో ప్రముఖ నటి మృతి.. ఎవరంటే?
ఆ తర్వాత పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali) దగ్గర అసిస్టెంట్గా చేరారు . అలా 1999లో స్వయంవరం సినిమా ద్వారా మాటల రచయితగా సినీ రంగ ప్రవేశం చేసిన త్రివిక్రమ్ నువ్వే కావాలి, మన్మధుడు, నువ్వు నాకు నచ్చావ్ వంటి చిత్రాలకు కథ, స్క్రీన్ ప్లే రచయితగా పనిచేశారు. ఇకపోతే తరుణ్ హీరోగా వచ్చిన ‘నువ్వే నువ్వే’ చిత్రంతో దర్శకుడిగా మారిన ఈయన.. ఆ తర్వాత వాసు, మన్మధుడు, మల్లీశ్వరి, జై చిరంజీవ, ఒక రాజు ఒక రాణి చిత్రాలకి రచయితగా పనిచేశారు. ఇక నువ్వే నువ్వే చిత్రానికి దర్శకత్వం వహించిన తర్వాత మూడేళ్లు దర్శకత్వానికి దూరంగా ఉన్న త్రివిక్రమ్.. మహేష్ బాబు (Mahesh Babu) తో అతడు సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన త్రివిక్రమ్.. ఇప్పుడు వెంకటేష్(Venkatesh )తో సినిమా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి అత్యంత ప్రాణ స్నేహితుడిగా కొనసాగుతున్న ఈయన.. ఆయన చిత్రాల విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల వచ్చిన ఓజీ సినిమాకి మాత్రం త్రివిక్రమ్ కాస్త దూరం మెయింటైన్ చేసిన విషయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
త్రివిక్రమ్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. సాయి సౌజన్యను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈమె ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ అధినేతగా కొనసాగుతూ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ తో కలిసి సంయుక్తంగా పలు చిత్రాలు నిర్మిస్తూ బిజీగా మారిపోయింది.