NEET పరీక్ష ప్రశ్నపత్రాల లీక్.. ఎంతమంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిందో తెలిసిందే. ప్రభుత్వం ఇలాంటి విషయాలను సీరియస్‌గా తీసుకోవాలని, లీకులను పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలనేది విద్యార్థుల డిమాండ్. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. అయితే, కేంద్రం మాత్రం ఈ విషయంలో మొండిగా వ్యవహరిస్తోంది. అయితే, కొన్ని దేశాలు ఇలాంటి పరిస్థితులను అస్సలు లైట్‌గా తీసుకోవు. ప్రశ్నపత్రాల లీకేజీలను తీవ్రమైన నేరంగా పరిగణించి.. కఠినమైన చట్టాలు అమలు చేస్తాయి.
చైనాలో యూనివర్శిటీ ప్రవేశ పరీక్ష గాఓకావో(Gaokao)ను ఎంతో పవిత్రంగా పరిగణిస్తారు. తప్పులు జరిగితే ఆ శాఖ మంత్రి నైతిక బాధ్యతగా రాజీనామా చేస్తారు. ఈ పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా 2015లో క్రిమినల్ లాను సవరించింది. పరీక్షల్లోని అక్రమాలను తీవ్ర నేరంగా పరిగణించేలా మార్పులు చేసింది. దీని ప్రకారం.. ఎవరైనా పేపర్ లీక్ చేసినా, నెట్ వర్క్ లేదా వైర్ లెస్ సాధనాల ద్వారా మాస్ కాపియింగ్‌కు పాల్పడినా.. మూడు నుంచి ఏడేళ్లు వరకు కఠిన కారాగార శిక్ష విధిస్తుంది. అయితే, లీకేజీలకు ఏ మాత్రం అవకాశం లేకుండా పేపర్ల రవాణాకు ప్రత్యేక SWAT బలగాలను ఉపయోగిస్తారు. జీపీఎస్ ట్రాకింగ్‌తో పాటు క్వశ్చన్ పేపర్ స్టోరేజ్ గదులకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తారు. అంతేకాదు.. కాపీయింగ్‌ను కూడా అక్కడ తీవ్రంగా పరిగణిస్తారు. కాపీ చేసే విద్యార్థులను మూడేళ్లపాటు అన్ని జాతీయ పరీక్షల నుంచి డిబార్ చేస్తారు. బ్లాక్ మార్క్ రికార్డుల్లోకి అతడి పేరు ఎక్కుతుంది. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం రావడం దాదాపు అసాధ్యం.
దక్షిణ కొరియాలో కాలేజీల అడ్మిషన్ల కోసం జరిగే సునెంగ్ (Suneung) అనే పరీక్ష నిర్వహిస్తారు. ఆ రోజు దేశం మొత్తం రవాణా సేవలు నిలిపేస్తారు. పరీక్ష పూర్తయ్యేవరకు విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లు కూడా నిలిపేస్తారు. ప్రశ్నపత్రం లీకైనా, చివరికి ప్రింటింగ్‌లో చిన్న పొరపాటు జరిగినా.. వెంటనే పదవి నుంచి తొలగించి క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. ఆ శాఖకు బాధ్యత వహించే మంత్రులు నైతిక బాధ్యత కింద రాజీనామా చేస్తారు. లీకేజీలకు పాల్పడే అధికారులకు సుదీర్ఘ కాలం జైలు శిక్ష విధిస్తారు. దాదాపు అవి జీవిత ఖైదుతో సమానం. జరిమానాలు కూడా భారీగానే ఉంటాయి.
సింగపూర్ ప్రభుత్వం కూడా పేపర్ లీకుల వంటి విషయాల్లో చాలా కఠినంగా ఉంటుంది. అవినీతి, అక్రమాల విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తుంది. పరీక్షల్లో మోసాలకు పాల్పడే ఉపాధ్యాయులు, ఏజెంట్లపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేస్తారు. ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీసినందుకు ఏళ్ల తరబడి జైలు శిక్షలతోపాటు నిందితుల ఆస్తులు జప్తు చేస్తారు. ప్రజల కంటే వేగంగా అక్కడే ప్రభుత్వమే స్పందిస్తుంది. దానివల్ల అవినీతి చేయాలంటేనే అక్కడి మంత్రులు, అధికారులు భయపడిపోతారు.
ఈ దేశాల్లో SAT/ACT లేదా A-Levels వంటి పరీక్షలు ఉంటాయి. ప్రైవేట్ టెస్టింగ్ ఏజెన్సీలు నిర్వహించే పరీక్షల్లో లీకేజీలు లేదా మోసాలు జరిగితే వైర్ ఫ్రాడ్ లేదా కుట్రగా పరిగణించి ఎఫ్‌బీఐ లేదా లోకల్ పోలీసులు దర్యాప్తు చేస్తారు. లీక్‌లో భాగస్వామ్యులైన నిర్వాహకులకు సుదీర్ఘ జైలు శిక్షలు విధిస్తారు. ప్రభుత్వం అధికారులకు సంబంధం ఉందని తేలితే జైలుకు పంపుతారు.
జపాన్, దక్షిణ కొరియా మరికొన్ని ఆసియా దేశాల్లో అవినీతి, అక్రమాలను చాలా తీవ్రంగా పరిగణిస్తారు. ఆ శాఖలకు బాధ్యత వహించే మంత్రుల, ఉన్నతాధికారులే నైతిక బాధ్యతగా తమ పదవులకు రాజీనామా చేస్తారు. ‘రాజీనామా’ అనేది వ్యక్తిగత తప్పుకే కాదు.. తన శాఖలో జరిగిన పెద్ద వైఫల్యాన్ని వ్యవస్థాగత బాధ్యతగా వారు భావిస్తారు. అక్కడ మంత్రి పదవిని వదలడం అనేది ప్రజలు, విద్యార్థుల్లో పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించడానికి చేసే మొదటి చర్య.
కానీ, మన దేశంలో ‘రాజీనామా’ను రాజకీయ ఓటమి లేదా తప్పును అంగీకరించడంగా భావిస్తారు. ప్రజాస్వామ్య జవాబుదారీ తనంగా పరిగణించలేరు. మన దేశంలో కూడా Public Examinations (Prevention of Unfair Means) Act, 2024 చట్టాన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం.. ప్రశ్నా పత్రాలను లీక్ చేసినవారికి పదేళ్ల జైలు శిక్ష, రూ.కోటి జరిమానా విధిస్తారు. అయితే, విచారణ వేగంగా సాగించి నిందితులకు శిక్ష విధిస్తేనే ప్రజల్లో.. ముఖ్యంగా విద్యార్థుల్లో నమ్మకం ఏర్పడుతుంది. అప్పుడు ఇలా రోడ్డెక్కే పరిస్థితులే రావు.
Also Read: దిగివచ్చిన మోడీ? నీట్ పేపర్ లీక్‌పై కీలక ప్రకటన, విద్యార్థులు శాంతిస్తారా?