జ్యోతిష శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్యా మన దేశంలో ఎంతో ఎక్కువ. కేవలం మనదేశంలోనే కాదు విదేశాల్లో కూడా జ్యోతిష శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. జ్యోతిష శాస్త్ర సలహా మేరకు కొన్ని రకాల ఉంగరాలను ధరిస్తే ఆర్థికంగా అన్ని రకాలుగా కలిసి వస్తుందని నమ్ముతారు. ఆ ఉంగరాలలో విలువైన రత్నాలను పొదుగుతారు. అలాగే తాబేలు ఉంగరాలు కూడా మన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయని జ్యోతిష్యం చెబుతుంది. తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల పేదవాడు కూడా ధనవంతుడయ్యే అవకాశం ఉందని వివరిస్తుంది. అలాగే పాము ఉంగరం కూడా ధరిస్తారు. పాము ఉంగరం పెట్టుకోవడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని జ్యోతిష్యం చెబుతోంది.
పాము ఉంగరం పెట్టుకుంటే
జ్యోతిష శాస్త్రం ప్రకారం పాము ఆకారంలో ఉన్న ఉంగరం ధరిస్తే పితృ దోషాలు, గ్రహదోషాలు, కాలసర్ప దోషాల నుండి ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఈ ఉంగరం పెట్టుకున్న వ్యక్తి జీవితంలో శుభం, అదృష్టం స్థాయిలు పెరుగుతాయి. అయితే ఈ ఉంగరాన్ని వెండి, రాగి లేదా అష్టధాతువుతో మాత్రమే తయారు చేయాలి. అలాగే జ్యోతిష్కున్ని సంప్రదించి అతని సూచన మేరకే ధరించాల్సిన అవసరం ఉంది. ఎవరికి వారు సొంతంగా ధరించకూడదు.
తాబేలు ఉంగరం పెట్టుకుంటే
తాబేలు ఆకారంలో ఉంగరాన్ని ఎంతో మంది ధరించడం మీరు చూసే ఉంటారు. వాస్తుపరంగా జ్యోతిష శాస్త్ర పరంగా తాబేలు శుభప్రదంగా భావిస్తారు. తాబేలు ఉంగరం ధరించడం వల్ల వ్యక్తి అదృష్టం మారుతుందని అంటారు. ఈ ఉంగరం ఎన్నో ఆర్థిక అడ్డంకులను తొలగించి వ్యాపారంలో లాభం పొందేందుకు సహాయపడుతుందని చెబుతారు. ఈ ఉంగరాన్ని కుడిచేతి మధ్య వేలుకు ధరించాలి. తాబేలు ముఖం లోపలికి ఉండేలా చూసుకోవాలి. ఈ ఉంగరం సంపదను ఆకర్షిస్తుందని లక్ష్మీదేవి ఆశీస్సులను అందిస్తుందని అంటారు.
గుర్రపు నాడా ఉంగరం పెట్టుకుంటే
శనిగ్రహానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారు గుర్రపు నాడా ఉంగరం ధరిస్తే మంచిది. శని దోషం ఉన్నవారు ఏలినాటి శనితో బాధపడుతున్న వారు గుర్రపు నాడా ఉంగరాన్ని ధరించాలని జ్యోతిష్శాస్త్రం చెబుతోంది. ఈ ఉంగరం శని వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించి ఆ వ్యక్తి జీవితంలో స్థిరత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు సహాయపడుతుంది.
ఎనిమిది లోహాలతో తయారుచేసిన ఉంగరం
దీనినే అష్టధాతువు అని పిలుస్తారు. అంటే 8 లోహాలతో తయారుచేసిన ఉంగరం అని అర్థం. ఈ ఉంగరాన్ని ధరిస్తే తొమ్మిది గ్రహాలను సమతుల్యం చేయడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుందని చెబుతారు. ఈ ఉంగరాన్ని ధరించడం వల్ల పనిలో విజయం సాధిస్తారని, మానసిక స్థితి మెరుగ్గా ఉంటుందని అంటారు. ఈ ఉంగరం వ్యక్తులు సానుకూల ఆలోచనలు పెంచుతుంది. అలాగే ప్రతికూల ఆలోచనలను దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంది.