మీరట్‌కు చెందిన ఒక మహిళ ఊబకాయంతో బాధపడుతోంది. ఆమె వయసు 55 ఏళ్లు. ఆమె ఆహారపు అలవాట్ల ద్వారా, వ్యాయామాల ద్వారా బరువు తగ్గితే అది ఆరోగ్యకరమైన పద్ధతి. కానీ ఆమె ఆ పద్ధతిని ఎంపిక చేసుకోలేదు. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు తగ్గాలని అనుకుంది. అందుకోసం బరువు తగ్గించే ఆపరేషన్ చేయించుకోవాలని సిద్ధపడింది. 24 గంటల్లో 30 కిలోల బరువును తగ్గిస్తామని కొంతమంది వైద్యులు ఆమెకు హామీ ఇచ్చారు. దీంతో ఆమె ఆపరేషన్ చేయించుకుంది చివరికి ప్రాణాలే కోల్పోయింది.
మీరట్‌కు చెందిన ఆ మహిళ బరువు 123 కిలోలు. శస్త్ర చికిత్స చేస్తున్నప్పుడు పొట్టలో లీకేజీ ఏర్పడడంతో ఆ మహిళకు ఇన్ఫెక్షన్ వచ్చి ప్రాణాలు కోల్పోయింది. ఊబకాయంతో బాధపడేవారు ఎంతోమంది. ఈ బేరియాట్రిక్ సర్జరీ చేయించుకునేందుకు సిద్ధపడుతున్నారు. కానీ ఇలాంటి తీవ్రమైన ప్రమాదాలు జరిగితే అసలుకే మోసం వస్తుంది. మీరు ఊబకాయాన్ని తగ్గించుకోవాలంటే శస్త్ర చికిత్స చేయించుకోవాలని ఎప్పుడూ అనుకోవద్దు. ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గేందుకు ప్రయత్నించండి. దీనికి ఏడాది సమయం పట్టవచ్చు. కానీ మీ ఆరోగ్యానికి ఢోకా లేకుండా బరువు తగ్గుతారు. ఆపరేషన్ల జోలికి వెళితే ప్రాణానికే ప్రమాదాలు ఏర్పడతాయి.
బేరియాట్రిక్ సర్జరీ అంటే?
బరువు తగ్గడానికి చేసే ఆపరేషన్ ను బేరియాట్రిక్ సర్జరీ అని పిలుస్తారు. చాలామంది ఊబకాయంతో బాధపడుతున్న వారు డైటింగ్, వ్యాయామం చేయలేక ఈ సర్జరీ చేయించుకునేందుకు సిద్ధపడతారు. ఈ సర్జరీ అందరూ చేయించుకోకూడదు. నిజానికి ఈ సర్జరీ జోలికి వెళ్లక పోతేనే ఆరోగ్యంగా జీవిస్తారు. ఎంత బరువునైనా కూడా వ్యాయామం ఆరోగ్యకరమైన ఆహార పద్ధతుల ద్వారా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. సాధారణంగా బేరియాట్రిక్ సర్జరీని బాడీ మాస్ ఇండెక్స్ 40 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారికి చేస్తూ ఉంటారు. కానీ అందులో కొన్ని సఫలీకృతం అవుతాయి. మరికొన్ని ఇలా ప్రాణాంతకంగా మారుతాయి.
బేరియాట్రిక్ సర్జరీ చేసేటప్పుడు అనస్థీషియా ఇస్తారు. దీనివల్ల అలర్జీలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి. శస్త్ర చికిత్స సమయంలో అధిక రక్తస్రావం జరిగే ప్రమాదం కూడా ఉంది. అప్పుడు రెండోసారి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇక శస్త్ర చికిత్స అయిన తర్వాత ఊపిరితిత్తులు, మూత్ర నాళంలో కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది. పొట్ట, పేగుల ఆకారం మారిపోయే అవకాశం ఉంది. దీని వల్ల కూడా లీకేజీలు ఏర్పడతాయి. ఈ లీకేజీ వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకి మరణం సంభవిస్తుంది.
బేరియాట్రిక్ సర్జరీ చేసుకున్న రోగులకు డీప్ థ్రాంబోసిస్ అంటే కాలిలో రక్తం గడ్డ కట్టడం అనే ప్రమాదం కూడా పెరిగిపోతుంది. ఈ గడ్డలు ఊపిరితిత్తులకు చేరుకొని ప్రాణాంతకమైన పరిస్థితులను ఏర్పరుస్తాయి. అలాగే సర్జరీ చేసిన తర్వాత శరీరంలో ఇనుము, విటమిన్ b12, క్యాల్షియం, విటమిన్ డి వంటి విటమిన్లు ఎన్నో ఖనిజాలు లోపించే అవకాశం ఉంది. దీనివల్ల ఎముకల బలహీనత, అలసట, రక్తహీనత వంటివి కూడా రావచ్చు. అలాగే డంపింగ్ సిండ్రోమ్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు తిన్న ఆహారం పెద్ద పేగులో కొంతవరకు జీర్ణం అయ్యి తర్వాత చిన్న పేగులకు చేరుతుంది. కానీ డంపింగ్ సిండ్రోమ్ లో ఆహారం నేరుగా త్వరగా చిన్న పేగులకు చేరుతుంది. దీనివల్ల మీకు తల తిరగడం, విరేచనాలు, చెమటలు పట్టడం, బలహీనత వంటివి కనిపిస్తాయి. వాటిని తట్టుకోవడం కష్టంగా అనిపిస్తుంది.